రూ.1,576 కోట్లు!

Farmers Problems With Bank Loans - Sakshi

 ప్రతియేటా పంట రుణం లక్ష్యాన్ని అంతోఇంతో పెంచుతూ.. ఆ విషయాన్ని ఘనంగా ప్రకటించుకుం టున్న బ్యాంకులు.. ఆ లక్ష్యం మేరకు రైతులకు రుణాలివ్వడంలో విఫలమవుతున్నాయి. ఈసారి కూడా గతేడాది కంటే 8శాతం పెంచి 2019–20 సంవత్సరానికి రూ.1,576 కోట్ల పంట రుణాలివ్వనున్నట్లు బ్యాంకులు ప్రకటించేశాయి. కానీ, ఆ మేరకు లక్ష్యాన్ని చేరుకుంటాయా.. అనేది సందేహాస్పదమే! ఎందుకంటే, 2017–18 కంటే 2018–19లో బ్యాంకులు రుణ లక్ష్యాన్ని 15శాతం పెంచాయి. కానీ, ఆ రెండు పంట కాలాల్లోనూ బ్యాంకులు నిర్ణీత లక్ష్యాన్ని అందుకోలేకపోయాయి. ఇప్పుడేమో 2018–19 కంటే 2019–20 సంవత్సరానికి 8శాతం పెంచాయి.

మరి ఈ కొత్త లక్ష్యం ఏ మేరకు నెరవేరి.. రైతులకు అండగా నిలబడుతుందో వేచిచూడాలి. ఇదిలా ఉంటే, రుణ లక్ష్యం చేరుకోలేకపోవడం వెనుక బ్యాంకుల వైఫల్యమే కారణమని గతానుభవాలు చెబుతున్నాయి. ఎలాగంటే.. కొత్తగా అప్పు కోసం బ్యాంకుకు వచ్చే రైతులకు ఏవో కొర్రీలు పెడుతుండగా.. పాత రైతులకు ‘స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌’ ప్రకారం రుణాలివ్వడం కుదరదని చెప్పేస్తున్నారు. దీంతో రైతులు బ్యాంకులపై ఆశలు వదులు కొని.. గత్యంతరం లేక బయట అప్పులు చేయాల్సి వ స్తోంది. ఇదే అదునుగా వడ్డీ వ్యాపారులు అన్నదాత రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. బ్యాంకులే గనక రుణాల మంజూరును సులభతరం చేస్తే.. తామెందుకు వడ్డీ వ్యా పారుల ఉచ్చులో పడతామని రైతులు ప్రశ్నిస్తున్నారు. 

సాక్షి, ఆదిలాబాద్‌ : జిల్లా రైతుల పరిస్థితి ఎప్పటిలాగే ప్రస్తుతం కూడా ఆగమ్యగోచరంగా మారింది. పంట వేద్దామని ఉన్నా.. చేతిలో చిల్లిగవ్వ ఉండదు. రుణాల కోసం బ్యాంకులకు వెళితే ఇస్తారన్న నమ్మకం లేదు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తే అసలుకే ఎసరు పెడుతున్నారు. ఇలా ప్రతియేటా అన్నదాతల కష్టాలు అన్నీఇన్నీ కావు.

కానీ, బ్యాంకులు మాత్రం ఏయేటికాయేడు పంట రుణ లక్ష్యాన్ని పెంచుతూ వస్తున్నామని చాలా ఘనంగా చెబుతున్నాయి. రుణ లక్ష్యాన్ని పెంచుతున్న బ్యాంకులు.. ఆ మేరకు రైతులకు రుణాలను మాత్రం ఇవ్వడం లేదన్నది కాదనలేని సత్యం! కొత్తగా అప్పు కోసం బ్యాంకుకు వచ్చే రైతులకు అంత తొందరగా రుణాలివ్వడం లేదు. పాత రైతులకేమో వారు తీసుకున్న తీసుకున్న రుణాలు రీషెడ్యూల్‌ చేసుకోవాలని అంటారు. ఇక్కడ కూడా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ (పంట రుణ పరిమితి) ఉందని చెప్పి అప్పు ఇవ్వడానికి  బ్యాంకులు వెనుకడుగు వేస్తాయి. అది ఖరీఫ్‌ గానీ.. రబీ గానీ.. ప్రతిసారీ ఇదే తంతు కొనసాగుతూ వస్తోంది. ఇలా బ్యాంకుల చుట్టూ తిరిగీతిరిగీ అలిసిపోయే రైతులు పంట వేసే సమయం దగ్గర పడగానే వేరే దిక్కు లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి.

అన్నదాత నడ్డి విరుస్తున్న వడ్డీ..
గత్యంతరం లేక తమ దగ్గరికి అప్పు కోసం వస్తున్న రైతులను వడ్డీ వ్యాపారులు నిలువు దోపి డి చేస్తున్నారు. ఆ వడ్డీ.. ఈ వడ్డీ అంటూ అన్నదాతల నడ్డి విరుస్తున్నారు. ఇక ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లోనైతే ‘దిడి’ పేరిట వడ్డీ దందా కొనసాగుతోంది. దీని ప్రకారం తీసుకున్న అప్పు ను పంటకాలం పూర్తయ్యే వరకు అంటే.. ఆరు నెలలోపే కట్టాల్సి ఉంటుంది. ఈ దిక్కుమాలిన లెక్క ప్రకారం రూ.వెయ్యి అప్పు చేస్తే.. ఇచ్చేట ప్పుడు రూ.500 అదనంగా కట్టాలి. ఈ లెక్క చూ స్తే చాలు.. రైతు ఎంత దోపిడికి గురవుతున్నాడనేది తెలిసిపోతుంది.

అదే రూ.20 వేల అప్పు తీసుకుంటే రూ.30 వేలు చెల్లించాలి. ‘దిడి’ దం దాయే కాకుండా కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ‘సవా యి’ వడ్డీ కూడా నడుస్తోంది. ఇందులో రూపాయి కి 25 పైసల చొప్పున వడ్డీ లెక్క కడతారు. బజార్‌హత్నూర్, బోథ్, నేరడిగొండ, బోథ్, గుడిహత్నూర్, తలమడుగు, తాంసి వంటి మండలాల్లో ఈ రకరకాల వడ్డీలు రైతుల పాలిట శాపంగా మారా యి. ఒకవేళ బ్యాంకులే పూర్తిస్థాయిలో రుణమిచ్చి ఆదుకుంటే రైతులకు ఈ పరిస్థితి ఎదురుకాదు. కీలక సమయంలో ఆదుకునేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదనేది సుస్పష్టం!

గతంలోనూ ఇంతే..
2018–19 ఆర్థిక సంవత్సరంలోనూ వానాకాలం, యాసంగి సీజన్లకు ఇవ్వాల్సిన రుణ లక్ష్యంలో బ్యాంకర్లు వెనుకబడ్డారు. జిల్లాలో వానాకాలం పంటలే ప్రధానం. ఈ సమయంలోనే రైతులకు విరివిగా రుణాలివ్వాలి. కానీ, బ్యాంకులు వివిధ కొర్రీలు పెట్టి రైతులను చుట్టూ తిప్పుకోవడం తప్ప ఆశించిన మేర రుణాలిచ్చిన దాఖలాలు చా లా స్వల్పం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఆ దిశగా ప్రణాళి కలేవీ కనుచూపు మేరలో కానరావడం లేదు. ఇదిలా ఉంటే, గతేడాది జిల్లాలో 85,501 మంది రైతులు తమ రుణాన్ని రెన్యూవల్‌ చేసుకున్నారు. మరో 16 వేల మంది చేసుకోలేదు. ఎన్నికల సమయం కావడంతో రుణ మాఫీ చేస్తారని పలువురు రైతులు పాత బకాయిలు కట్టకపోవడంతోపాటు కొత్త అప్పు కోసం కూడా ప్రయత్నించలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. కానీ, ఇదెంత వరకు నిజమో రైతులకు, బ్యాంకర్లకే తెలియాలి.

స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌   ప్రకారం ఇవ్వాల్సిందే..
స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం బ్యాంకర్లు రైతులకు పంట రుణాలు ఇవ్వాలి. కొన్ని బ్యాంకులు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అమలు చేయడం లేదని మా దృష్టికి వచ్చింది. ఇలాంటి బ్యాంకులపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఇప్పటి వరకు బ్యాంకు రుణం పొందని రైతులు బ్యాంకులకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు బయట అప్పులు తీసుకోవద్దు. వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు కలిసి రైతులు బ్యాంకు రుణాలే తీసుకునేలా అవగాహన కల్పించాలి.– జీవీఆర్‌ఎస్‌కె ప్రసాద్, లీక్‌ బ్యాంకు మేనేజర్, ఆదిలాబాద్‌ 

రెండేళ్లుగా తిరుగుతున్నా.. 
రెండేళ్ల కిందట విరాసత్‌ కింద ఐదెకరాలకు నా పేరు మీదా పట్టా అయింది. ఈ పట్టా తీసుకొని బ్యాంకుల చుట్టూ రెండేళ్లుగా తిరుగుతున్నా పంట రుణం ఇవ్వడం లేదు. అదేమిటంటే పాత రైతులకు ఇచ్చిన తర్వాత ఇస్తామని అధికారులు చెబుతున్నారు. తీరా అందరికీ ఇచ్చిన తర్వాత బ్యాంకుకు వెళ్తే రుణం ఇచ్చే గడువు అయిపోయిందని చెప్పి దాట వేస్తున్నారు. బ్యాంకు రుణం దొరక్క రెండేళ్లుగా రూ.45 వేల చొప్పున బయట వ్యాపారుల దగ్గర వడ్డీకి తీసుకున్నా. ఈ వానాకాలం పంటల ముందైనా బ్యాంకు రుణం ఇప్పించాలి. కుంరం గజానంద్, రైతు, పిట్టబొంగరం, ఇంద్రవెల్లి మండలం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top