
గుంట పొలం కోసం.. గుండె పగిలి..
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతు ప్రాణం తీసింది. భార్య పేర కొనుగోలు చేసిన పొలాన్ని ఆన్‌లైన్ ఆర్‌ఓఆర్‌లో నమోదు చేయాలని అధికారుల కాళ్లావేళ్లాపడ్డాడు.
* తహసీల్దార్ కార్యాలయంలో కుప్పకూలి రైతు మృతి
* ఫర్నిచర్ ధ్వంసం, కలెక్టర్ రావాలని మృతదేహంతో రాస్తారోకో
పెబ్బేరు: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతు ప్రాణం తీసింది. భార్య పేర కొనుగోలు చేసిన పొలాన్ని ఆన్‌లైన్ ఆర్‌ఓఆర్‌లో నమోదు చేయాలని అధికారుల కాళ్లావేళ్లాపడ్డాడు. మూడు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. లంచం ఇచ్చినా పనిచేయలేదు. చివరికి తన పొలం కంప్యూటర్‌లో ఎక్కుతుందో లేదోనన్న బెంగతో తహసీల్దార్ కార్యాలయంలోనే ఆ రైతు గుండె ఆగిపోయింది. ఈ ఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
మండలంలోని శాఖాపూర్‌కి చెందిన కుమ్మరి లక్ష్మయ్య (42) ఆరునెలల క్రితం అదే గ్రామంలో 2.29 ఎకరాల పొలాన్ని కొన్నాడు. తన భార్య బాలకిష్టమ్మ పేర చేయించేందుకు పెబ్బేరు తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అందులో 2.28 ఎకరాల పొలం ఆన్‌లైన్ ఆర్‌ఓఆర్‌లో నమోదైంది. కేవలం గుంట పొలం మాత్రమే రికార్డుల్లోకి ఎక్కలేదు. దాన్ని ఆన్‌లైన్‌లోకి ఎక్కించాలని 3 నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. వీఆర్‌వో రాంచంద్రయ్యకు రూ.4 వేలు ఇచ్చాడు. గురువారం కార్యాలయానికి రాగా తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. కార్యాలయం ఆవరణలో వేసిన బెంచిపై కూర్చుని అక్కడే కుప్పకూలి ప్రాణాలొదిలాడు.
తహసీల్దార్ ఆఫీస్‌పై దాడి.. ఫర్నిచర్ ధ్వంసం
గుంట పొలాన్ని ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు మూడు నెలలపాటు తిప్పుకుని నిండు ప్రాణాన్ని రెవెన్యూ అధికారులు బలితీసుకున్నారని మృతుడి కుటుంబ సభ్యులు, పలువురు రైతులు తహసీల్దార్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్, కంప్యూటర్లు, ప్రిం టర్లను పగలగొట్టారు. మృతదేహంతో రాస్తారోకో చేశారు. బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని, స్వయంగా కలెక్టర్ వచ్చి హామీఇవ్వాలని పట్టుబట్టారు. రైతు మృతికి కారకులైన తహసీల్దార్, ఆర్‌ఐ, వీఆర్‌ఓ, కంప్యూటర్ ఆపరేటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కుటుంబ సభ్యులకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.