సర్వే నిర్వహిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌

Election Commission View BSNL conducted Survey  - Sakshi

ఎన్నికల కమిషన్‌ ఆన్‌లైన్‌లో వీక్షించడానికి... 

బ్రాడ్‌ బ్యాండ్‌ సౌకర్యం లేని చోట 4జీ, 3జీ డాటా కార్డుల వినియోగం 

మోర్తాడ్‌(బాల్కొండ): రాష్ట్ర శాసనసభకు జరుగనున్న ముందస్తు ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ను ఎన్నికల కమిషన్‌ ఎప్పటికప్పుడు వీక్షించడానికి వెబ్‌ కాస్టింగ్‌ కోసం భారతీయ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) సర్వేను నిర్వహిస్తోంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే స్పందించడానికి వీలుగా ఎన్నికల కమిషన్‌ పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 2009 సాధారణ ఎన్నికల నుంచి పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ను ఏర్పాటు చేయిస్తోంది. 

ఇందులో భాగంగా డిసెంబర్‌ 7న నిర్వహించనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల తీరును పరిశీలించడానికి వెబ్‌ కాస్టింగ్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్‌ అర్బన్, నిజామాబాద్‌ రూరల్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాలలోని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. పట్టణ కేంద్రా లు, మండల కేంద్రాలు, మేజర్‌ పంచాయతీలలోనే బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సౌకర్యం కల్పించడానికి అవకాశం ఉంది.

 గ్రామీణ ప్రాం తాలలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కేబుల్‌ వ్యవస్థ ధ్వంసం కావడంతో బ్రాడ్‌ బ్యాండ్‌కు అవకాశం లేదు.  అలాంటి చోట్లలో 4జీ, 3జీల డాటా కార్డులను వినియోగించాలని, బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌ బ్యాండ్, 4జీ, 3జీ సౌకర్యం లేని చోట ప్రైవేటు టెలికం ఆపరేటర్లకు చెందిన డాటా కార్డులను విని యోగించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే 2జీ డాటా కార్డులను అన్ని చోట్ల వినియోగించే అవకాశం ఉన్నా వెబ్‌ కెమెరాల సామర్థ్యానికి 2జీ సా మర్థ్యం సరిపోకపోవడంతో 4జీకి మొదటి ప్రాధాన్యం, 3జీకి రెండవ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top