1950... అభ్యర్థుల హడల్‌

Election Commission Of India Set Up to 1950 Election Call Centre Number - Sakshi

ఎంపీ ఎన్నికలకు కలెక్టరేట్‌లో 1950 కాల్‌ సెంటర్‌ ఏర్పాటు

ఓటు ఉందా.. లేదా చూసుకోవచ్చు

సాక్షి, నల్లగొండ : భారత ఎన్నికల సంఘం పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటర్ల సౌకర్యార్ధం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. భారతదేశ వ్యాప్తంగా 1950 అనే ఫోన్‌ నంబర్‌ను ఏర్పాటు చేసింది. దీనిని దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేశారు. ఏ జిల్లా వారు ఆ జిల్లాల 1950కి ఫోన్‌ చేస్తే అది ఆ జిల్లాలో ఉన్న ఎన్నికల కాల్‌ సెంటర్‌కు వెళ్తుంది. ఫోన్‌ చేసినందుకు ఎలాంటి చార్జీ పడదు. జిల్లాలో ఓటర్ల జాబితాలో తమ ఓటు ఉందా లేదా తెలుసుకోవడంతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు అది ఏ స్థాయిలో ఉందో చూసుకునేందుకు 1950 ఎంతగానో దోహదపడుతుంది. అంతే కాక ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా పార్టీలు, ఇతర సిబ్బంది ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై ఈ నంబర్‌కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలా వచ్చిన వాటిని కూడా సంబంధిత నోడల్‌ అధికారుల ద్వారా చర్యలు తీసుకునేందుకు పూనుకుంటున్నారు. జనవరి 25 నుంచి ఈ నంబర్‌ని అమల్లోకి తీసుకొచ్చారు. 

కలెక్టరేట్‌లో కాల్‌ సెంటర్‌
నల్లగొండ కలెక్టరేట్‌లో డిప్యూటీ తహసీల్దార్‌ తబితను కాల్‌ సెంటర్‌ నోడల్‌ అధికారిగా  నియమించారు. ఆమెతో పాటు చరిత అనే అధికారిని కూడా నియమించారు. ఈ సెంటర్‌లో ఆరుగురు సిబ్బందిని ఏర్పాటు చేశారు. కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ రాగానే ఫోన్‌ వచ్చిన వాటిని వారంతా ఏ సమస్య మీద ఫోన్‌ చేస్తున్నారో తెలుసుకొని వారు అడిగిన వాటికి సమాధానాలు చెప్తున్నారు. జనవరి 25 నుంచి ఇప్పటి వరకు 6902 మంది ఫోన్లు చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

ప్రధానంగా ఓటర్ల జాబితాలో ఓటు ఉందా లేదా తెలుసుకుంటున్నారు. ఒకవేళ ఓటు లేకుంటే బీఎల్‌ఓలను కలవాలని సిబ్బంది సూచిస్తున్నారు. ప్రస్తుతం ఓటరు నమోదు పూర్తయినందున తమకు ఓటు హక్కు వచ్చిందా లేదా అంటూ ప్రస్తుతం 1950కి ఫోన్లు వస్తున్నాయి. అయితే దరఖాస్తు చేసుకున్నవారి ఓటు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో వారి పేరు, ఎపిక్‌ నంబర్‌ ఆధారంగా తెలుసుకొని కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసిన వారికి వారు సమాధానాలు చెప్తున్నారు.  

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఫిర్యాదులు.. 
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించేవారిపై ఫిర్యాదు చేసేందుకు ఈ కాల్‌ సెంటర్‌ ఎంతో ఉపయోగపడుతుంది. గత మూడు రోజుల క్రితం కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామానికి చెందిన ఓ ఓటరు కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి తమ గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని, దాంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని, వారిపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. దీంతో నోడల్‌ అధికారి తబిత సంబంధిత అధికారులకు ఆ కాంప్లెయింట్‌ను అందించడంతో వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి అక్రమంగా అమ్ముతున్న సరుకును స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నాం 
కలెక్టరేట్‌లోని కాల్‌ సెంటర్‌లో ఉన్న 1950 నంబర్‌కు ఫోన్లు చేసి ఓటర్లు తమ ఓటు ఉందా లేదా తెలుసుకుంటున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు తమ ఓటు ఏ స్థాయిలో ఉందో అడుగుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని నమోదు చేసుకొని సంబంధిత నోడల్‌ అధికారులకు పంపిస్తున్నాం. తద్వారా వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల మద్యం విక్రయిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు రాగా దాన్ని సంబంధిత అధికారులకు పంపించాం. వారు వెంటనే ఆ వ్యక్తి నుంచి మద్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు అతనిపై కేసు కూడా నమోదు చేశారు.  1950 తో పాటు 8004251442, 08682–22130 నంబర్లకు కూడా ఫోన్‌ చేయవచ్చు. వాట్సప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలంటే.. 7901535458 నంబర్‌కు అందించవచ్చు. 
– తబిత, కాల్‌ సెంటర్‌ నోడల్‌ అధికారి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top