మెతుకుసీమను హరితవనం చేద్దాం | Each plant in the state to change | Sakshi
Sakshi News home page

మెతుకుసీమను హరితవనం చేద్దాం

Jul 19 2014 11:50 PM | Updated on Oct 9 2018 2:17 PM

ఒక్కొక్కరూ ఒక్కో మొక్క నాటి మెతుకుసీమను హరితవనంలా మార్చాలని రాష్ట్ర నీటి పారుదల, మైనింగ్, మార్కెటింగ్ శాఖల మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు.

సిద్దిపేట జోన్: ఒక్కొక్కరూ ఒక్కో మొక్క నాటి మెతుకుసీమను హరితవనంలా మార్చాలని రాష్ట్ర నీటి పారుదల, మైనింగ్, మార్కెటింగ్ శాఖల మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని రంగధాంపల్లి, గణేష్‌నగర్, శ్రీనగర్, పత్తిమార్కెట్ యార్డు, హిందూ శ్మశాన వాటికల్లో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు భవిష్యత్‌లో తలెత్తకూడదనే ప్రభుత్వం వన మహోత్సవానికి ప్రాధాన్యత నిచ్చిందన్నారు. ఈ క్రమంలోనే సిద్దిపేట పట్టణంలో ఈ సంవత్సరం లక్ష మొక్కలను నాటాలని నిర్ణయించామన్నారు. అందుకోసం తన సొంత నిధులు సైతం వెచ్చించి వివిధ నర్సరీలు, అటవీశాఖ సహకారంతో మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టానన్నారు. అందులో భాగంగానే తొలివిడతగా శనివారం 50 వేల మొక్కలను పంపిణీ చేస్తామన్నారు.
 
 మొక్కలు తీసుకున్న ప్రజలు కూడా వాటిని నాటడంతోనే తమ బాధ్యత తీరిపోయిందని భావించకుండా, వాటిని సంరక్షించాలని కోరారు. ప్రస్తుతం కనిపిస్తున్న కరువు ఛాయలు భవిష్యత్‌లో రాకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా వన మహోత్సవానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. అందుకోసం అటవీశాఖకు బడ్జెట్‌లో రూ.700 కోట్లను కేటాయించినట్లు హరీష్‌రావు తెలిపారు. అనంతరం స్థానిక శ్రీనగర్, గణేష్‌నగర్ కాలనీలో మహిళలకు మొక్కలను పంపిణీ చేసి లాంఛనంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
 
 ఈ సందర్భంగా మొక్కలు స్వీకరించిన ప్రతి ఒక్కరి నుంచి అధికారులు దత్తత పత్రాలను తీసుకున్నారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, విద్యుత్ డీఈ శ్రీనివాసరెడ్డి, నీటి పారుదల శాఖ ఈఈ ఆనంద్, డిప్యూటీ ఈఓ మోహన్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, తహశీల్దార్ ఎన్‌వై గిరి, మార్కెట్ శాఖ కార్యదర్శి సంగయ్య, విద్యుత్ ఏడీఈ శ్రీనివాస్, హౌసింగ్ డీఈ సత్యనారాయణ, ఏఈ సుధాకర్‌గౌడ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కృష్ణారెడ్డి, టీపీఎస్ ప్రభాకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మాజీ వైస్ చైర్మన్ చిన్నా తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement