సరిహద్దుల్లో అప్రమత్తంగా వరంగల్‌ పోలీసులు

Due To Maoists Warangal Police Vigilant On Borders - Sakshi

రెండు రోజుల వ్యవధిలో రెండు చోట్ల మావోల కరపత్రాలు

మహారాష్ట్రలో ఎన్నికల కారణంగా మావోలు ఇటు వైపు రావొచ్చని భావన

గోదావరి దాటకుండా పటిష్టమైన చర్యలు

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు, పంప్‌హౌస్, గ్రావిటీ కాల్వపై పోలీసుల నిఘా

సాక్షి, కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్‌ అయ్యారు. గత ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు జిల్లాలోని పలిమెల మండల సర్వాయిపేట, మహాముత్తారం మండలం కనుకునూర్‌ గ్రామాల్లో మావోయిస్టుల కరపత్రాలు వెలిశాయి. దీంతో జిల్లా పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జిల్లాలో మావోయిస్టులు పట్టు కోసం ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు ప్రాజెక్టుల వద్ద భధ్రతను మరింతగా పెంచారు. రాత్రి, పగలు కూంబింగ్, చెకింగ్‌ నిర్వహిస్తున్నారు. మాజీ మావోయిస్టులు, రాజకీయ నాయకుల కదలికలపై కూడా పోలీసులు నజర్‌ వేసినట్లు తెలిసింది. ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే విచారించి వివరాలు ఆరా తీస్తున్నారు. 

వాహనాల తనిఖీలు
పోలీసులు కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన, మేడిగడ్డ బ్యారేజీ వంతెనల పైనుండి మçహారాష్ట్ర – తెలంగాణకు వస్తున్న వాహనాలపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వాహనాల రిజిస్ట్రేషన్, ధుృవీకరణ పత్రాలు, చిరునామాలు తెలుసుకునేందుకు  మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం మండలాల్లోని అడవుల్లో నిరంతరం పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పోలీసులు తెలంగాణ వైపున ఉన్న మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం మండలాల్లో గోదావరి దాటి జిల్లాలోకి ప్రవేశించకుండా అప్రమత్తమయ్యారు. మహదేవపూర్‌ మండలంలోని ఓడ రేవులపై పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించినట్లు తెలిసింది. మరోపక్క వర్షాకాలం గోదావరిలో ప్రవాహం ఎక్కువగా ఉండనుండడంతో రోడ్డు మార్గాలపైన పోలీసులు నజర్‌ వేశారు. మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డలోని లక్ష్మీ,  అన్నారంలోని సరస్వతీ బ్యారేజీ, కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్‌ హౌస్, గ్రావిటీ కాల్వ వద్ద ప్రత్యేక బలగాలు, సివిల్‌ పోలీసులు పహారా కాస్తున్నారు.

పల్లెల్లో గుబులు!
మంథని మాజీ ఎమ్మెల్యే పట్ట మధు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ లింగంపల్లి శ్రీనివాసరావు, గతంలో పనిచేసిన డీఎస్పీ కేఆర్‌కే. ప్రసాదరావుతో పాటు పలువురు రాజకీయనాయకులపైన మావోయిస్టులు మహదేవపూర్‌–ఏటూరునాగారం కమిటీల పేరిట కరపత్రాలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పల్లెల్లో ఆందోళన చోటు చేసుకుంటుంది. ఆయా గ్రామాల్లో అనుమానితులు కనిపిస్తే పట్టుకుని విచారించే అవకాశం ఉంది. మహారాష్ట్రలో ఈనెల 21న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఉన్న నేపథ్యంలో అక్కడ పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉండడంతో మావోలు ఇటుగా గోదావరి దాటినట్లు ప్రచారం జరుగుతోంది. మారుమూల మండలం పలిమెల, మహాముత్తారం గ్రామాల్లో మాత్రం అటవీ ప్రాంతం కావడంతో జిల్లాతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో మావోలు అటుగా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో గ్రామాల్లోని చోటమోట నాయకులతో పాటు మాజీ మావోయిస్టులు మండల కేంద్రంతో పాటు పట్టణాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే పోలీసులు కరపత్రాల విషయంలో విచారణ చేపట్టినట్లు తెలిసింది. మావోల కరపత్రాలు అసలా, నకిలివా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

భద్రత కట్టుదిట్టం..
జిల్లా ఇచ్‌చార్జి ఎస్పీ సంగ్రామ్‌సింగ్, కాటారం ఏఎస్పీ సాయిచైతన్య, సీఐలు నర్సయ్య, హతిరాం ఆధ్వర్యంలో బ్యారేజీలపై ప్రత్యేక నజర్‌ వేసినట్లు తెలిసింది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఆర్‌పిఎఫ్, డిస్ట్రీక్‌ గార్డ్స్, సివిల్‌ పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. మావోలు తెలంగాణ వైపు రాకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా నిఘా తీవ్రతరం చేసి చర్యలు చేపడుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top