మీరు ఏసీ కింద గంటలతరబడి ఉంటున్నారా? | Dry Eye Syndrome Disease With Air Conditioners | Sakshi
Sakshi News home page

ఏసీ..EYE సీ..

Apr 22 2019 7:08 AM | Updated on Apr 24 2019 12:38 PM

Dry Eye Syndrome Disease With Air Conditioners - Sakshi

వేసవి వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూఎయిర్‌ కండిషనర్ల రొద మొదలువుతుంది.ఉక్కపోత నుంచి తేరుకుని కంటి మీద కాస్త కునుకు పడాలంటే మాత్రం ఏసీ ఉండాల్సిందే. ఇంతవరకు బాగానే ఉన్నా శరీరానికి చల్లదనాన్ని పంచే ఎయిర్‌ కండిషనర్లు రకరకాల ఆరోగ్య సమస్యలను కూడా మోసుకొస్తాయన్న విషయం చాలామందికి తెలియదు. మొబైల్, డిజిటల్‌ తెరల కారణంగా ఇటీవల కంటి సమస్యలు నగరంలో
పెరుగుతున్న నేపధ్యంలో పులి మీద పుట్రలా ఇప్పుడు ఎయిర్‌ కండిషనర్లు కూడా కంటి ఆరోగ్యానికి ముప్పుతెస్తున్నాయంటున్నారు నగరానికి చెందిన అగర్వాల్‌ కంటి ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ బద్రీ ప్రసాద్‌ డాగ్నె. ఆయన చెబుతున్న మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే.    

సాక్షి, సిటీబ్యూరో :సమ్మర్‌ వస్తే చాలు సిటీలో ఎయిర్‌ కండిషన్లు మోత మోగిస్తుంటాయి. ఇల్లు, ఆఫీసులు, ప్రయాణం చేసే కార్లు, బస్సులు, మెట్రోరైళ్లు.. ఇలా ఏది చూసినా చల్లదనమే. ఎండలు పెరగడంతో పాటు వేడిని తట్టుకునే శక్తి కూడా మనలో లోపిస్తుండడంతో ఎయిర్‌ కండిషనర్లను ఆశ్రయించక తప్పడం లేదు. ఒక అంచనా ప్రకారం వేసవి కాలంలో ఓ కార్పొరేట్‌ ఉద్యోగి సగటున 14 నుంచి 16 గంటల పాటు ఎయిర్‌ కండిషన్డ్‌ వాతావరణంలోనే ఉంటున్నట్టు తేలింది. ఎయిర్‌ కండిషనర్లు శరీరానికి అవసరమైన చల్లదనంతో పాటు కొన్ని రకాల అనారోగ్య సమస్యల్ని కూడా మోసుకొస్తున్నాయి. కృత్రిమ పద్ధతుల్లో గాలిని, వాతావరణాన్ని మార్చే ప్రక్రియ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి  వచ్చే ‘డ్రై ఐ సిండ్రోమ్‌’ వేసవి కాలంలోనే బాగా కనిపిస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది.  

పొరలు పొడిబారి..
కన్ను తన విధిని తాను సక్రమంగా, సరైన విధంగా నిర్వర్తించేందుకు నిర్ణీత పరిమాణంలో కళ్లలో నీటి బిందువులు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నీటి బిందువులు బాహ్యంగా ఆయిలీ లేయర్, మధ్యలో వాటర్‌ లేయర్, లోపల ప్రొటీన్‌ లేయర్‌తో సంరక్షించబడుతుంటాయి. ఎయిర్‌ కండిషన్డ్‌ రూమ్‌లో అత్యంత తక్కువ టెంపరేచర్‌ ఉండే పరిస్థితుల్లో పరిసరాల్లో తేమ శాతం బాగా తగ్గిపోతుంది. తద్వారా నీటి బిందువులకు రక్షణ కవచాలుగా ఉండాల్సిన పొరలు బలహీనపడిపోతాయి. శరీరానికి తగిలే గాలి పూర్తిగా పొడి బారినది అవడం వల్ల అది కంటి పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించి ‘్రౖడై ఐ సిండ్రోమ్‌’గా మారుతుంది.  

డ్రై ఐ సిండ్రోమ్‌ లక్షణాలివే..
కళ్లు పొడిబారడం, కళ్లలో మంట, దురద, కంటి నుంచి నీరు కారడం, ఎర్రబడడం, చూపు మసకబారడం వంటి లక్షణాలతో ఈ డ్రై ఐ సిండ్రోమ్‌ వస్తుంది. ఇలా ఎక్కువ సేపు ఇదే రకమైన ఎయిర్‌ కండిషన్డ్‌ వాతావరణంలో ఉండడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. మరోవైపు ఏసీ మిషిన్ల నిర్వహణ సరిగా లేకపోతే వ్యాప్తి చెందే వైరస్, బాక్టీరియా, ఫంగస్‌ కూడా కంటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఓ వైపు పొడి వాతావరణం కూడా దీనికి జత కలవడం మరింత ప్రమాదకరంగా మారి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. నగరంలో ఉండే కాలుష్య వాతావరణం సమస్యను మరింత జటిలం చేస్తుంది.  

జాగ్రత్తలు తప్పనిసరి..
ఏసీ వినియోగించేటప్పుడు టెంపరేచర్‌ 23 నుంచి 25 డిగ్రీల సెల్సియస్‌ వరకూ మాత్రమే ఉండాలి. దీనితో పాటు అవసరమైతే  ఫ్యాన్‌ కూడా వినియోగించవచ్చు. ఎయిర్‌ కండిషనర్లకు మరీ దగ్గరగా లేదా నేరుగా కంటి మీద చల్లని గాలి పడేలా కూర్చోవడం ఎక్కువ సేపు గడపడం చేయవద్దు. ఏసీలో పనిచేస్తున్నప్పటికీ దాహం వేసే వరకూ ఆగకుండా తరచుగా మంచి నీరు తాగుతుండాలి. ఏసీ గదుల్లో కంప్యూటర్ల ముందు పనిచేసేవారు తరచుగా కళ్లు మూసి, తెరవడం చేస్తుండాలి. మంచి నిద్ర కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. వైద్యుల సూచనలను అనుసరించి లూబ్రికేటింగ్‌ ఐ డ్రాప్స్‌ వినియోగించాలి. కంటి ఆరోగ్య సమస్యలపై నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయిస్తుండాలి.– డాక్టర్‌ బద్రీ ప్రసాద్‌ డాగ్నె,అగర్వాల్‌ కంటి ఆస్పత్రి (సంతోష్‌నగర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement