ఆదాయం ఓకే...సిబ్బంది లేకే!

Department of Registration in the state is in dire straits due to shortage of staff - Sakshi

సతమతమవుతున్న రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

తమిళనాడులో 5,500 మందితో... ఏటా 26 లక్షల లావాదేవీలు

తెలంగాణలో 1,300 మందితోనే 15.5 లక్షల వ్యవహారాలు

ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళల్లో ఇక్కడ కంటే ఎక్కువమంది ఉద్యోగులు

సంస్కరణలు చేపట్టకుంటే రిజిస్ట్రేషన్ల శాఖకు ఇక్కట్లే అంటున్న వర్గాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది కొరతతో తీవ్ర అవస్థలు పడుతోంది. చాలీచాలని సిబ్బందితోనే ఇబ్బందులను ఎదు ర్కొంటూ నెట్టుకొస్తోంది. పొరుగునే ఉన్న తమిళనాడులో 575 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయా లుండగా, అక్కడ ఏటా 26 లక్షల వరకు లావా దేవీలు జరుగుతున్నాయి. ఏటా తమిళనాడు స్టాం పులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.11,302 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా, మొత్తం 5,500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అదే మన రాష్ట్రంలో 141 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఏటా 15.34 లక్షల లావాదేవీలు జరుగుతుండగా, రూ.6,614 కోట్ల ఆదాయం ఖజానాకు సమకూరుతోంది.

ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య కేవలం 1,302 మంది మాత్రమే. అంటే తమిళనాడుతో పోలిస్తే రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు సగానికన్నా ఎక్కువే జరుగుతున్నాయి. కానీ సిబ్బందితో పోలిస్తే మన దగ్గర ఉన్నది నాలుగో వంతు మాత్రమే. ఒక్క తమిళనాడే కాదు పొరుగున ఉన్న రాష్ట్రాల్లో పనికి తగ్గ ఆఫీసులు, సిబ్బంది ఉన్నారు. తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు మాత్రం రోజురోజుకూ పనిభారం పెరుగుతున్నా తగినంత సిబ్బంది లేకపోవడంతో  ఒత్తిడితో పాటు ఇతర సమస్యలు ఎదుర్కొంటోంది. దీంతో శాఖాపరంగా చేపట్టాల్సిన సంస్కరణలను వెంటనే అమల్లోకి తేవాలని, లేదంటే భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి వస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారులు చెపుతున్నారు. ఈ మేరకు ఓ ప్రత్యేక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు తెలుస్తోంది.

కొత్త రాష్ట్రం ఆవిర్భవించాక...!
రాష్ట్రంలో రియల్‌బూమ్‌ మొదలైన నాటి నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ కార్యకలాపాలు  పెరిగిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన నాటి నుంచి లావాదేవీలు భారీ సంఖ్యలో జరుగుతున్నాయి. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం కూడా లభిస్తోంది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లోని సిబ్బంది సంఖ్యలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ల సేవలు అమలవుతున్న తీరుపై ఆ శాఖ ఉన్నతాధికారులు అధ్యయనం చేశారు.

మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఏం జరుగుతోందన్న విషయాన్ని ఆరా తీస్తే ఒక్క మహారాష్ట్ర మినహా మిగిలిన చోట్ల చాలా వ్యత్యాసం కనిపిస్తోందని వారంటున్నారు. కేరళలో 315, కర్ణాటకలో 252, ఆంధ్రప్రదేశ్‌లో 295 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలు నిర్వహిస్తుండగా, మన రాష్ట్రంలో  కేవలం 141 కార్యాలయాల ద్వారా మాత్రమే ఈ సేవలు అందుతుండడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top