దడ.. దడ!

Dengue Fevers in Mahabubnagar District - Sakshi

డెంగీ.. ఈ వ్యాధి పేరు వింటేనే దడ పుడుతుంది.. ఇప్పటికే జిల్లాలో రెగ్యులర్‌ కేసుల కంటే ఎక్కువ కేసులు నమోదవుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. పది రోజుల నుంచి వరుసగా వర్షాలు కురుస్తుండడంతో ఖాళీ ప్రదేశాల్లో నీరు నిలిచి దోమలు విజృంభిస్తున్నారు. ఫలితంగా జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఇలా వచ్చే వారిలో పలువురికి డెంగీ సోకినట్లు నిర్ధారణ అవుతుండడం గమనార్హం. అలాగే, పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం కారణంగా కూడా పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇక జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరగడంతో బెడ్లు సరిపోక కిందే పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు.

పాలమూరు: సీజనల్‌ వ్యాధులను నియంత్రించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతూ సమీక్షలు నిర్వహిస్తున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రిలో తప్పించి ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా డెంగీ వ్యాధి నిర్ధరణ పరికరాలు లేవు. దీంతో బాధితులు కొంత వరకు జనరల్‌ ఆస్పత్రికి వస్తున్నా.. మిగతా హైదరాబాద్‌ వెళ్లి వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. రెండేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రులకు కార్పొరేట్‌ హంగులు కల్పించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్లేట్‌లెట్ల కిట్లు, వాటికి సంబంధించిన యంత్రాలు ప్రాంతీయ ఆస్పత్రులకు ఇంకా చేరలేదు.

40 కేసుల్లో 4 పాటిజివ్‌ జిల్లా జనరల్‌ ఆస్పత్రికి ప్రతి రోజు డెంగీ పరీక్షలు చేయించుకోవడానికి 40 మందికి పైగా వస్తుండగా ఇందులో నాలుగు నుంచి ఆరు మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అవుతోంది. ఆగస్టు నుంచి అక్టోబర్‌ 16వరకు 1,492 మందికి పరీక్షలు చేయగా.. ఇందులో 113మందికి రికార్డు స్థాయిలో పాజిటివ్‌ నమోదు కావడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసులు నమోదైన నేపథ్యంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం రావాల్సి ఉన్నా రాలేదు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు డెంగీ నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో కన్పించడం లేదు. ఏ గ్రామంలో కూడా ఇప్పటివరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం కానీ, అవసరమైన మందులు పంపిణీ చేసిన దాఖలాలు కానీ లేవు.

వ్యాధి లక్షణాలు
ఈడిన్‌ ఈజిప్టే అనే రకం దోమ కుట్టడం వల్ల డెండీ సోకుతుంది. ఇది కుట్టిన 7–8రోజుల తర్వాత డెంగీ లక్షణాలు కన్పిస్తాయి. హఠాత్తుగా తీవ్రమైన జ్వరం రావటం, కళ్లు కదలించలేని పరిస్థితి ఏర్పడుతుంది. భరించలేని కండరాల నొ ప్పి, వాంతులు, వికారం రక్తం తో కూడిన మల విసర్జన, కడుపు నొప్పి ఉంటాయి. రక్తపోటుతో పాటు రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. అన్ని అవయవాలు విఫలమైన ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదమున్నందున లక్షణాలను ముందుగా గుర్తించి చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలను అరికట్టడం సాధ్యమవుతుంది.

నివారణ చర్యలు చేపట్టాం
జిల్లాలో సీజనల్‌ వ్యాధులను అరికట్టడానికి ప్రతీ శుక్రవారం డ్రై డేగా నిర్వహిస్తున్నాం. డెంగీ కేసులు నమోదవుతున్న గ్రామాల్లో ఇంటింటి సర్వే చేసి రక్త నమూనాలు సేకరిస్తున్నాం. అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ప్రధానంగా గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల మధ్య నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. దీంతో పాటు ఇంటి పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి. ఇక మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో డెంగీ కిట్లు అందుబాటులో ఉన్నాయి. అవసరమైన వారికి ఇక్కడ పరీక్షలు చేయిస్తున్నాం.
– డాక్టర్‌ రజిని, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top