కాంగ్రెస్‌ వరుస పాదయాత్రలు

Congress Leaders Padayatra in the name of irrigation projects - Sakshi

సాగునీటి ప్రాజెక్టుల పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ

26 నుంచి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి పాదయాత్ర

సాక్షి, హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టుల పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఖరీఫ్‌ సీజన్‌ ఊపందుకున్న తరుణంలో ఇంకా ప్రారంభం కాని, పూర్తికాని ప్రాజెక్టుల సాధన, కాళేశ్వరం ప్రతిపాదిత స్థలం, ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టు రద్దు లాంటి అంశాలతో పాదయాత్రల ద్వారా ప్రజలకు చేరువ కావాలని ప్రణాళిక రచించింది. ఈ మేరకు ఈ నెలాఖరులో మూడు యాత్రలకు శ్రీకారం చుట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ నేతలు ఈ యాత్రల్లో పాల్గొననున్నారు. 

ఉదయసముద్రం కోసం 
నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాలకు తాగు, సాగు నీరందించే ఉదయసముద్రం–బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకం కోసం ‘రైతుసాధన యాత్ర’పేరుతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాదయాత్ర చేపడుతున్నారు. నల్లగొండ శివారు పానగల్లు వద్ద ఉన్న ఉదయసముద్రం ప్రాజెక్టు నుంచి 100 కి.మీ. నడిచి ఆయన రాష్ట్ర సాగునీటి శాఖ ప్రధాన కార్యాలయమైన జలసౌధ వరకు చేరుకోనున్నారు. ఈ నెల 26 నుంచి నాలుగు రోజులపాటు 5 వేల మంది రైతు లతో నిర్వహించనున్న ఈ యాత్రలో నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టాలని కోరుతూ నిర్వహించనున్న ఈ యాత్రకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.

ఇక ఈ నెల 26నే ఉత్తమ్‌ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలం గురించి ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు టీపీసీసీ ఆధ్వర్యం లో యాత్ర చేపడుతున్నారు. తమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టు నిర్మించి ఉంటే గ్రావిటీ ద్వారా గోదావరి నీరు తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తయ్యేదని, అవినీతి కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టారంటూ ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్‌ నేతలతో ఈ యాత్ర చేపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ నేతలు సాగునీటి కోసం ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రద్దుకు నిరసనగా యాత్ర చేపట్టి మొదటి రోజు శంకర్‌పల్లి ధోబీపూర్‌ నుంచి చేవెళ్ల వరకు, రెండో రోజు మన్నెగూడ వరకు, మూడో రోజు పరిగి వరకు, నాలుగో రోజు షాద్‌నగర్‌ వరకు 88 కి.మీ. మేర యాత్ర సాగించనున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top