చంద్రబాబును మోదీ కాపాడతారని అనుకోను: కేసీఆర్ | cm kcr firres on ap cm chandra babu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబును మోదీ కాపాడతారని అనుకోను: కేసీఆర్

Jun 10 2015 10:29 PM | Updated on Oct 9 2018 6:34 PM

చంద్రబాబును మోదీ కాపాడతారని అనుకోను: కేసీఆర్ - Sakshi

చంద్రబాబును మోదీ కాపాడతారని అనుకోను: కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఫోన్లు ట్యాప్ చేయలేదని ఏబీసీ డీజీ తెలిపారని అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఫోన్లు ట్యాప్ చేయలేదని ఏబీసీ డీజీ తెలిపారని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే 120 మంది ఫోన్లు ట్యాప్ చేస్తామా అని ప్రశ్నించారు. అవినీతి వ్యవహారంలో ఇరుక్కున్న చంద్రబాబును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాపాడతారని తాను అనుకోవడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. చంద్రబాబు పీకల్లోతు ఊబిలో మునిగిపోయాడని పేర్కొన్నారు. చంద్రబాబు నేరుగా చాలా మందితో మాట్లాడారని, కేసులో ఆయన ప్రస్తావన తప్పకుండా ఉంటుందన్నారు.  ఈ వ్యవహారంపై కేంద్రం నుంచి తనకెవరూ ఫోన్ చేయలేదని చెప్పారు.

రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారం వెలుగు చూసిన తర్వాతే ట్యాపింగ్ గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు. తమ ఎమ్మెల్యేకు రేవంత్ రెడ్డి డబ్బు ఇచ్చాడా, లేదా. తమ ఎమ్మెల్యేతో ఫోన్ లో మాట్లాడారా, లేదా అనేది చంద్రబాబు చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబుకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదా అని ప్రశ్నించారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీ కొంటే తానే అప్రమత్తం చేశానని కేసీఆర్ వెల్లడించారు. ఐదు ముఠాలు ఏర్పాటు చేసి బేరసారాలకు టీడీపీ దిగిందని ఆరోపించారు. అందులో ఒక ముఠా పట్టుబడగానే మిగతా ముఠాలు జారుకున్నాయని తెలిపారు. అన్ని విషయాలు బయట పడతాయని, చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. నేరస్థుల్ని ప్రభుత్వం అరెస్ట్ చేయదు. అరెస్ట్ చేయడానికి ప్రత్యేక శాఖలు ఉన్నాయన్నారు.

టేపులు టీవీలో రావడం అనేది మీడియా స్వేచ్ఛకు సంబంధించిందని చెప్పారు. సీపీఎం, సీపీఐ, వైఎస్సార్ సీపీ మద్దతు కోరానని వెల్లడించారు. బంగారు లక్ష్మణ్ వ్యవహారంలో ఏం జరిగిందో అందరికీ తెలుసునన్నారు.  అరిగిపోయిన రికార్డులా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.  చంద్రబాబు దొరికిన దొంగ అంటూ దుయ్యబట్టారు. చేసిన దొంగతనం కప్పిపుచ్చుకోవడానికి ట్యాప్, టిప్పు అంటూ గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. 'నువ్వు కాదు, మీ తాత జేజమ్మ కూడా తమను ఏమీ చేయలేరన్నారు. చంద్రబాబు బాగోతం చాలావుందని, సరైన సమయంలో వివరాలు బయటపడతాయన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణలో చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్న విషయంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని కేసీఆర్ అన్నారు.  ఓటుకు నోటు వ్యవహారంపై సమాధానం చెప్పిన తర్వాతే చంద్రబాబు ఇతర విషయాలు మాట్లాడాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement