తెలంగాణలో టీడీపీ బతకొద్దా?

Chandrababu Naidu Focused On Party Strengthen In Telangana - Sakshi

కాంగ్రెస్‌తో పొత్తు ప్రజాస్వామిక అనివార్యత 

ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి 

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏ రోటికాడ ఆపాటే పాడారు. జాతీయ మీడియా సమావేశంలో ఒకలా, తెలుగు మీడియాతో మరోలా మా ట్లాడారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ దేశా న్ని రక్షించేందుకు, ప్రజాస్వామ్యాన్ని కా పాడేందుకు ఢిల్లీకి వచ్చానన్న చంద్రబాబు తెలుగు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ బతకొద్దా? జాతీయస్థాయిలో మద్దతు కోరవద్దా? అని ప్రశ్నించారు. ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీ లోని ఏపీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.  

జాతీయ మీడియాతో ఇలా.. 
‘‘ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. జాతీయ నేతలను, బీజేపీయేతర పక్షాలను కలుస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని వారికి వివరిస్తున్నా. బీజేపీ పాలనలో దేశంలో అన్ని వ్యవస్థలు చెడిపోయాయి. ఈ దేశం ఎటు పోతోంది? రాజకీయ నేతలపై, వ్యాపారులపై, మీడియాపై దాడి చేస్తున్నారు. నా గత ప్రెస్‌మీట్‌ను ఒక్క జాతీయ చానల్‌ కవర్‌ చేయలేదు. అలా నియంత్రిస్తున్నారు. ఒక్క ఏపీలోనే కాదు ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ దాడులు చేస్తున్నారు. ఇటీవల మా ఎంపీలు రమేశ్, సుజనా చౌదరిపై, ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేపై ఐటీ దాడులు చేశారు. దేశంలో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు.

మేం ప్రత్యేక హోదా అడిగాం. విభజన చట్టంలోని హామీ లను అమలు చేయాలని అడిగాం. అడిగితే దాడులు చేస్తారా? చాలామంది ప్రధానమంత్రులను చూశా. కానీ ఇలా ఎవరూ లేరు. సరైన విధానం లేదు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. అందుకే అందరం కలిసి పనిచేయాలనుకుంటున్నాం. నేను ఏ పదవినీ ఆశించడం లేదు. అంతిమంగా ఒక కార్యాచరణ రూపొందిస్తాం. అంతిమంగా ఇది ప్రజాస్వామిక అనివార్యత. మాకు గతంలో కాంగ్రెస్‌తో విభేదాలు ఉండేవి. మరికొన్ని పార్టీలతో కూడా విభేదాలు ఉండేవి. దేశాన్ని రక్షించాలన్న నినాదంతో ఇప్పుడు అందరం కలిసి పనిచేస్తాం. ఇప్పుడు దేశంలో రెండే కూటములు. ఒకటి బీజేపీ, రెండోది బీజేపీ వ్యతిరేక కూటమి. బీజేపీని వ్యతిరేకించే పార్టీలను రమ్మని స్వాగతిస్తున్నాం’’అని చంద్రబాబు వెల్లడించారు.  

తెలుగులో మాట్లాడినప్పుడు ఇలా.. 
‘‘మనం పొత్తు పెట్టుకుందాం, దేశ రాజకీయాలు చేద్దాం, తెలుగు జాతి అంతా ఐకమత్యంగా ఉందామని కేసీఆర్‌ను అడిగితే.. మీతో నేను పొత్తు పెట్టుకోవడం ఏంటి? నో క్వశ్చన్‌ అని ఆయన తిరస్కరించారు. అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండాల్సిన పనిలేదా? అదే ప్రజాస్వామిక అనివార్యత. బీజేపీ ఏపీకి అన్యాయం చేయడమే కాకుండా ఐటీ దాడులు చేస్తోంది. అలాంటప్పుడు మరి ఇక్కడ సపోర్ట్‌ తీసుకోవద్దా.. మద్దతు అవసరం లేదా? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూనే దేశ ప్రయోజనాలు కాపాడుకోవాలి. ఇప్పుడు ప్రజాస్వామ్య అనివార్యత వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేయాల్సి ఉంది’’అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీ పొత్తు కొనసాగుతుందా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ‘‘జాతీయ స్థాయిలో విశాల దృక్పథంతో పనిచేస్తాం. మిగిలినవి ఆ తరువాతే’’అని బదులిచ్చారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top