ప్రజల గోడు పట్టదా...


నివేదికల వెల్లడితోనే సరిపుచ్చిన అధికారులు

సాదాసీదాగా తొలి స్థాయీ సంఘాల సమావేశం

కొన్ని అంశాలకే పరిమితమైన ప్రజాప్రతినిధులు


 

ఖమ్మం జెడ్పీ సెంటర్ : జిల్లా పరిషత్ స్థాయి సంఘాల తొలి సమావేశం తూతూ మంత్రంగానే ముగిసింది. జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నా వాటిపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపలేదు. కొందరు మాత్రమే ఆయా మండలాల్లోని పలు అంశాలపై ప్రశ్నించినప్పటికీ అధికారులు మాత్రం చేస్తాం..చూస్తాం.. అంటూ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు.



దీంతో కొందరు జెడ్పీటీసీ సభ్యులు నిరాశతోనే వెనుదిరగాల్సి వచ్చింది. అయితే పలువురు అధికారులు మాత్రం కొందరు సభ్యులను మండలస్థాయి సమస్యలకు మాత్రమే పరిమితం చేశారు. ఒకానొక దశలో చైర్ పర్సన్ సైతం సమావేశం తీరుపై అనాసక్తి చూపారు. ఎప్పుడు ముగిద్దామనే రీతిలో అధికారులు ఉండడం, సమయాభావం వల్ల స్థాయి సంఘాల సమావేశాన్ని కుదించారు. దీంతో పూర్తిస్థాయిలో సమావేశం జరగలేదు. మరోపక్క స్థాయి సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా హాజరు కాకపోవడం, శాసన మండలి సభ్యుల్లో కేవలం పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాత్రమే హాజరుకావడం గమనార్హం.  



సమావేశం జరిగిందిలా...

తొలుత జెడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన గ్రామీణ అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరాపథకం తీరు గురించి డీఆర్‌డీఏ ఏపీడీ వివరించారు. ఆసరా పథకం కింద 3,13,831 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 3,11,545 దఖాస్తులను విచారించి వారిలో 2,14,605 మందిని అర్హులుగా గుర్తించామని, ఇంకా కొంతమంది దరఖాస్తులు విచారణ చేపట్టాల్సి ఉందని, ఇప్పటికే అర్హులందరికీ పింఛన్‌లు మంజూరు చేశారని తెలిపారు. దీనిపై ఇల్లెందు, బయ్యారం జెడ్పీటీసీలు చండ్ర అరుణ, గౌని ఐలయ్య మాట్లాడుతూ అర్హులకు కాకుండా అనర్హులకు మాత్రమే పింఛన్‌లు ఇస్తున్నారని, ఈ పింఛన్‌లపై కూడా ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా అధికారులు, ఎంపీడీఓలే చూస్తున్నారని అన్నారు.



అందుకు స్పందించిన ఏపీడీ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జిల్లాలో తహశీల్దార్, ఎంపీడీఓ, రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి గ్రామస్థాయిలో పింఛన్‌లు అందించేలా చర్యలు చేట్టామని అన్నారు. ఏజెన్సీలోని రిజిస్టర్ సొసైటీల గీత కార్మికులకు పింఛన్ రావడం లేదని, వారికి పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని, సదరం క్యాంప్‌లో 2010 - 11 సంవత్సరంలో వచ్చిన వారికి సైతం పింఛన్‌లు రావడం లేదని, దీనిపై దృష్టి సారించాలని పలువురు జెడ్పీటీసీలు కోరారు.



పాత ఇనుము దుకాణంలో పింఛన్ దరఖాస్తులు...

ఇల్లెందు జెడ్పీటీసీ చండ్ర అరుణ మాట్లాడుతూ ఆసరా పింఛన్ కోసం వచ్చిన దరఖాస్తులు పాత ఇనుము దుకాణంలో ప్రత్యక్షమయ్యాయని, అందులో ఆ పాత ఇనుము షాపు యజమాని దరఖాస్తు కూడా ఉందని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన జెడ్పీచైర్‌పర్సన్ ఇలాంటి పొరపాట్లు జరుగకుండా చూడాలని, అర్హులకు మాత్రమే ఆసరా అందేలా అధికారులు చూడాలని అన్నారు. అనంతరం ఎస్సీ, బీసీ కార్పొరేషన్‌ల ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సీతామహాలక్ష్మి వివరించారు. దీంతో భూమి పంపిణీకి ఎంత మందిని ఎంపిక చేశారని, ఇప్పటి వరకు ఎంతమందికి భూమిని కొనుగోలు చేశారని జెడ్పీటీసీలు ప్రశ్నించగా 17 ఎకరాల భూమిని ఏడుగురికి అందజేశామని, మిగిలిని వారికి అందిస్తామని ఈడీ సీతామహాలక్ష్మి తెలిపారు.



రూ.50వేల డిపాజిట్ చేయాలనడం సరికాదు...

రాజీవ్ యువశక్తి పథకం వల్ల యువతకు ప్రయోజనం లేదని, రూ 50వేలు డిపాజిట్ చేయాలనడం సరికాదని, ఇదే పరిస్థితి కొనసాగితే ఆ శాఖ అధికారులు సమావేశానికి రావాల్సిన అవసరం లేదని దుమ్ముగూడెం, బయ్యారం జెడ్పీటీసీలు పేర్కొన్నారు. అనంతరం హౌసింగ్ పీడీవైద్యం భాస్కర్ ఆ శాఖ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. జిల్లాకు రూ.25 కోట్లు విడుదలయ్యాయని, వాటిని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కల్పించుకుని జాబితాలో ఉన్న అనర్హులకు కూడా నగదు జమ చేశారా..? అని ప్రశ్నింగా హౌసింగ్ పీడీ సరైన సమాధానం ఇవ్వలేదు. ఆయన ఎమ్మెల్సీ అసహనం వ్యక్తం చేశారు. అర్హులకు మాత్రమే అందేలా చూడాలని, అనర్హుల పేర్లు తొలగించాలని ఎమ్మెల్సీ సూచించారు.



అనంతరం విద్యవైద్యంపై జరిగిన సమావేశంలో ఆయా శాఖల ప్రగతిని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన ప్రజాప్రతినిధులు విద్యా, వైద్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సక్రమంగా ఖర్చుచేసి ప్రజలకు పథకాలు అందేలా చర్యలుతీసుకోవాలన్నారు. కో ఆప్షన్‌సభ్యులు మౌలానా మాట్లాడుతూ డెంగీ నిర్ధారణకు జిల్లా కేంద్రంలోనే పరికరాలు ఉన్నాయని, మిగతా ప్రాంతాల్లో పరిస్థితులేమిటని ప్రశ్నించారు. కొత్తగూడెం జెడ్పీటీసీ మాట్లాడుతూ 2009లో సదరం వారికి ఇప్పటి వరకు సర్టిఫికెట్లు ఇవ్వలేదని అన్నారు. టేకులపల్లి జెడ్పీటీసీ మాట్లాడుతూ డబ్బులు తీసుకుని అనర్హులకు సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, సదరంలో పారదర్శకత పాటించాలని అన్నారు.



వ్యవసాయ కమిటీ సమావేశం జెడ్పీ వైస్ చైర్మన్ బరపటి వాసుదేవ అధ్యక్షతన, మహిళా సంక్షేమ స్థాయి కమిటీ సమావేశం తోటమల్ల హరిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జెడ్పీటీసీలు మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడం లేదని, మహిళా ప్రాంగణం అస్తవ్యస్తంగా ఉందని, సిబ్బంది లేక సక్రమంగా శిక్షణ ఇవ్వడం లేదని అన్నారు. సాంఘిక సంక్షేమ స్థాయి కమిటీ సమావేశం అసావత్ లక్ష్మి అధ్యక్షతన జరిగింది. అనంతరం పంచాయతీ రాజ్ ఎస్‌ఈ గంగారెడ్డి పీఆర్ శాఖలో చేపడుతున్న అభివృద్ధి పనులు వివరించారు.



మార్చిలోగా అన్ని పనులు పూర్తి చేస్తామని వివరించారు. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సతీష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఆర్‌అండ్‌బి శాఖ ద్వారా చేపడుతున్న పలు అభివృద్ధి పనులను వివరించారు. వైరా జెడ్పీటీసీ బొర్రా ఉమాదేవి మాట్లాడుతూ వైరాలోని ఆర్‌అండ్‌బి ప్రధాన రహదారి అధ్వానంగా ఉందని ఎస్‌ఈ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన ఆయన ఆ రహదారిపై నీరు నిల్వ ఉండడం వల్ల దెబ్బతిన్నదని, డ్రెయిన్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.



తీర్మానిలివే..

సక్సెస్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివిన ఉపాధ్యాయులను మాత్రమే నియమించేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలనీ తీర్మానించారు.



రూ.50వేల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికే రాజీవ్ యువశక్తి పథకం కింద బ్యాంక్ కాన్సెంట్ ఇస్తున్నారని, దీంతో ఆ పథకం నీరుగారుతోందని, వార్షికాదాన్ని రెండు లక్షలకు పెంచాలని తీర్మానించారు.



ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో పని దినాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, పని దినాలు యధావిథిగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి సిఫార్సు చేయాలని తీర్మానించారు.



ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపడుతున్న పనుల్లో ప్రత్యేక విజిలెన్స్ కమిటీని కలెక్టర్ నియమించటం వల్ల నిధులు రాక ఇబ్బందులు పడాల్సి వస్తోందని, అన్ని వర్కులపై విచారణ జరుపకుండా నాణ్యతా ప్రమాణాలు లేని వాటిపై విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top