మహాకూటమిలో వీడని ఉత్కంఠ..

BJP Candidate List Suspense Medak - Sakshi

టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో ఇప్పటికే ముందంజలో ఉన్నారు. మహాకూటమిలో టికెట్‌ కాంగ్రెస్‌కా? లేక టీజేఎస్‌కా? అన్న చర్చ  జోరుగా సాగుతోంది.  ఇరు పార్టీలు తమదంటే తమదని ప్రచారం కూడా మొదలు పెట్టారు. వీళ్ల పరిస్థితి ఇలా ఉంటే బీజేపీ పరిస్థితి మరోలా ఉంది. వాళ్లు కూడా ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించలేదు. శుక్రవారం ప్రకటించిన రెండో జాబితాలో మెదక్, నర్సాపూర్‌ టికెట్‌ విషయంలో స్పష్టత వస్తుందని శ్రేణులు భావించాయి. కానీ ఈ జాబితా లోనూ జిల్లా అభ్యర్థుల పేర్లు లేవు. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కార్యకర్తలు కూడా వెనకబడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సాక్షి, మెదక్‌: జిల్లాలోని రెండు నియోజక వర్గాల్లోనూ బీజేపీ అభ్యర్థులపై ఇంకా స్పష్టత రావడం లేదు.  అధిష్టానం శుక్రవారం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థులు రెండో జాబితాలో సైతం జిల్లా స్థానాల అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ఆశావహులు నిరాశకు గురయ్యారు. పార్టీ శ్రేణుల్లో సైతం అధినాయకత్వంపై అసంతృప్తి కనిపిస్తోంది. మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల నుంచి మొదటి జాబితాలోనే అభ్యర్థులను ఖరారు చేస్తారని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. కానీ అందుకు విరుద్ధంగా రెండో జాబితాలోనూ ప్రకటించలేదు. ఎన్నికలు సమీపిస్తున్నా.. అభ్యర్థులను ప్రకటించక పోవడంతో ప్రచారం కూడ చేయలేని పరిస్థితి నెలకొంది. మెదక్‌ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంచరణ్‌ యాదవ్, జిల్లా నాయకులు కటికె శ్రీనివాస్, తాళ్లపల్లి రాజశేఖర్, నందారెడ్డి తదితరులు టికెట్‌ను ఆశిస్తున్నారు.

 వీరిలో కటికె శ్రీనివాస్, రాంచరణ్, తాళ్లపల్లి రాజశేఖర్‌లు తమ బలబలాను అధిష్టానానికి వివరించి టికెట్‌ ఇవ్వాలని ఇప్పటికే కోరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తోపాటు జాతీయ నాయకుడు మురళీధర్‌రావును కలిసి తమకు టికెట్‌ ఇవ్వాలని కోరారు. అధిష్టానం ఇటీవలే నియోజకవర్గ నాయకులతో సమావేశమై ఎమ్మెల్యే అభ్యర్థిపై అ«భిప్రాయం కూడా సేకరించారు. తాజాగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఆకుల రాజయ్య సైతం మెదక్‌ నుంచి బరిలో దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధిష్టానానికి వివరించగా వారు సైతం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే టికెట్‌ ఎట్టి పరిస్థితుల్లో స్థానికులకే ఇవ్వాలని మెదక్‌ నియోజకవర్గ నాయకులు అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

ఇటీవల అధిష్టానం కేంద్ర ఎన్నికల కమిటీకి నియోజకవర్గం నుంచి టికెట్‌ కోరుతున్న వారి జాబితాలను పంపించింది. శుక్రవారం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో మెదక్‌ నియోజకవర్గం పేరుంటుందని జిల్లా నేతలు ఆశించారు. అయితే కేంద్ర ఎన్నికల కమిటీ మెదక్‌ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించకుండా ఉత్కంఠతను రేపుతోంది. ఇది స్థానిక నాయకులకు మింగుడు పడటంలేదు. అభ్యర్థి పేరు ఎంత త్వరగా ప్రకటిస్తే పార్టీకి అంత మేలు జరుగుతుందని ఆశావాహులు భావిస్తున్నారు. వెంటనే ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలని వారు అధిష్టానం పెద్దలను కోరారు. నర్సాపూర్‌ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించలేదు. నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి గోపి, రఘువీర్‌ రెడ్డిలు టికెట్‌ ఆశిస్తున్నారు. ఇద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్‌ దక్కే అవకాశాలున్నాయి. అయితే ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించక పోవడంపై  ఇక్కడ కూడా వారితోపాటు పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలని ఆశావాహులు, పార్టీ నాయకులు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top