మరో స్ట్రీట్‌ఫైట్... | Another Street fight held at Banjara hills | Sakshi
Sakshi News home page

మరో స్ట్రీట్‌ఫైట్...

May 13 2015 12:05 AM | Updated on Sep 3 2017 1:54 AM

పాతబస్తీలో స్ట్రీట్‌ఫైట్ జరిగి రెండు రోజులు గడవకముందే బంజారాహిల్స్‌లో అదే తరహా ఘటన వెలుగులోకొచ్చింది.

హైదరాబాద్: పాతబస్తీలో స్ట్రీట్‌ఫైట్ జరిగి రెండు రోజులు గడవకముందే బంజారాహిల్స్‌లో అదే తరహా ఘటన వెలుగులోకొచ్చింది. బంజారాహిల్స్ సినీమ్యాక్స్ వద్దకు రా.. తేల్చుకుందామంటూ ఓ విద్యార్థి తన స్నేహితుడికి సవాల్ విసిరాడు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఓ విద్యార్థి కిడ్నాప్‌కు దారితీసింది. వివరాలు... మదీనగూడలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులు రెండు గ్రూపులుగా ఏర్పడ్డారు. ఇటీవల ఓ విద్యార్థి(16) బైక్ నేమ్ ప్లేట్‌ను మరో విద్యార్థి ధ్వంసం చేశాడు. ఎందుకలా చేశావని నిలదీయగా నా ఇష్టం అంటూ అవతల విద్యార్థి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో బాధిత విద్యార్థి మంగళవారం బంజారాహిల్స్ వస్తే ఎవరి దమ్ము ఏంటో తేల్చుకుందాం’ అని సవాల్ విసిరాడు.

కొండాపూర్ నుంచి సదరు విద్యార్థి తన ఆరుగురు స్నేహితులతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లోని లూసిడ్ ఆస్పత్రి గల్లీకి వచ్చాడు. అప్పటికే ఇంకో ఆరుగురు స్నేహితులతో వేచిఉన్న బాధిత విద్యార్థి గొడవకు దిగాడు. ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. నన్నే కొడతావా? నీ సంగతి చూస్తానని బాధిత విద్యార్థిని మరో విద్యార్థి కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి దూసుకుపోయాడు. మిగితా వారంతా భయపడి పోలీసుకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు ఛేజింగ్ చేసి విస్పల్ వ్యాలీ సమీపంలో కారును అడ్డుకొని విద్యార్థిని రక్షించారు. కిడ్నాప్‌కు పాల్పడిన విద్యార్థిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Advertisement

పోల్

Advertisement