ఐడియా అదిరింది..! | Amitabh Bachchan Prices Hyderabad Traffic Police Idea | Sakshi
Sakshi News home page

‘ట్రాఫిక్‌’ ఏర్పాటుపై ‘బిగ్‌ బీ’ కితాబు!

Jul 8 2019 6:51 AM | Updated on Jul 8 2019 6:51 AM

Amitabh Bachchan Prices Hyderabad Traffic Police Idea - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్‌ పోలీసులు చేపట్టిన ఓ చిన్న ప్రయోగం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం నెట్‌జనులనే కాదు... ఏకంగా బిగ్‌–బీ అమితాబ్‌ బచ్చన్‌ను ఆకట్టుకుంది. కేబీఆర్‌ పార్క్‌ జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్టాప్‌లైన్‌ను ఆయన ట్విటర్‌ వేదికగా సూపర్‌ ఐడియా అంటూ కొనియాడారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ తరహా ఎలక్ట్రానిక్‌ స్టాప్‌లైన్ల సంఖ్య పెంచాలని ట్రాఫిక్‌ పోలీసులు భావిస్తున్నారు. సిటీలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద అనేక మంది ఓ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కచ్చితంగా నిబంధనలు పాటించే వారైనా, తమ తప్పు లేకపోయినా స్టాప్‌లైన్‌ క్రాసింగ్‌ అంటూ జరిమానాతో పాటు పెనాల్టీ పాయింట్‌ తప్పట్లేదు. ఓ రోడ్డుపై వివిధ చోట్ల ప్రయాణించే వాహనచోదకుడికి ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ కనిపించకపోవడమే దీనికి కారణం. ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నచోట్ల మినహాయిస్తే సాధారణంగా జంక్షన్లలో కుడివైపునే సిగ్నల్స్‌ ఉంటున్నాయి. దీంతో ఎడమ వైపుగా వెళ్లే వారికి పక్కగా భారీ వాహనం ఉండే సిగ్నల్‌ వారికి కనిపించే అవకాశం ఉండట్లేదు.

దీంతో రెడ్‌సిగ్నల్‌ పడిన విషయం గుర్తించలేక స్టాప్‌లైన్‌ క్రాసింగ్‌కు పాల్పడుతున్నారు. ఫలితంగా కేవలం జరిమానా విధింపే కాకుండా కొన్నిసార్లు ప్రమాదాలకు కారకం అవుతోంది. దీనిని పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఉండే జంక్షన్ల వద్ద ఎల్‌ఈడీ లైట్లతో కూడిన స్టాప్‌లైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కేబీఆర్‌ పార్క్‌ చౌరస్తా వద్ద అమలులోకి తీసుకువచ్చారు. కొన్నాళ్ల అధ్యయనం తర్వాత మార్పుచేర్పులు చేస్తూ అన్ని జంక్షన్లలోనూ అమలులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. కేవలం సిగ్నల్‌ లైట్లు మాత్రమే కాకుండా స్టాప్‌లైన్‌ కూడా ఏ రంగు సిగ్నల్‌ ఉందో చూపే విధంగా చేయాలని యోచించారు. ఇలా చేస్తే లైట్లు కనిపించకున్నా స్టాప్‌లైన్‌ను చూసైనా ముందుకు వెళ్లొచ్చా? లేదా? అనేది వాహనచోదకులు నిర్థారించుకోవచ్చని అధికారులు ఓ ఆలోచన చేశారు. దీంతో సిగ్నల్‌ స్తంభానికి అనుసంధానిస్తూ ఆ రహదారిపై స్టాప్‌లైన్‌ స్థానంలో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. వాహనాలు దీనిపై నుంచి వెళ్లినా ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మెటీరియల్‌ ఎంపిక చేశారు.

ఫలితంగా రెడ్‌ సిగ్నల్‌ పడితే ఈ ఎల్‌ఈడీ లైట్లు ఆ రంగులో, గ్రీన్‌ పడితే ఆ రంగులోకి మారతాయి. రాత్రి వేళల్లో ఇవి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కేబీఆర్‌ చౌరస్తా వద్ద సిగ్నల్‌కు ఏర్పాటు చేశారు. అధ్యయనం తర్వాత వీటిని విస్తరించనున్నారు. ఇలా చేయడంతో సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికీ ఇక సిగ్నల్‌ లైట్‌ రంగు తెలుస్తుందని, పొరపాటున జరిగే ఉల్లంఘనులకు చెక్‌ చెప్పడం, ప్రమాదాలు తగ్గించడానికి ఇది ఉపకరిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ స్టాప్‌లైన్‌ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో అమితాబ్‌ బచ్చన్‌ దృష్టికీ వెళ్లింది. ఈ ప్రయోగానికి ఆకర్షితుడైన ఆయన ఆదివారం ట్విట్టర్‌లో ‘దిస్‌ ఈజ్‌ ఏ సూపర్‌ ఐడియా... మోస్ట్‌ ఎఫెక్టివ్‌’ అంటూ ఫొటోతో సహా ట్వీట్‌ చేశారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement