పాసైతేనే పైతరగతికి..! | Amendment To Education Act | Sakshi
Sakshi News home page

పాసైతేనే పైతరగతికి..!

Aug 8 2018 12:28 PM | Updated on Jul 11 2019 5:01 PM

Amendment To Education Act - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శ్రీకాకుళం: విద్యా ప్రమాణాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్యా హక్కు చట్టం కింద ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులు వార్షిక పరీక్షల్లో  ఉత్తీర్ణులు కాకుంటే అదే తరగతిలో కొనసాగించడానికి (డిటైన్‌) వీల్లేదు. వార్షిక పరీక్షలతో సంబంధం లేకుండా వారిని పైతరగతికి పంపాల్సిందే. అయితే ఇకమీదట ఇటువంటి పరిస్థితి ఉండదు. తాజాగా విద్యాహక్కు చట్టానికి సవరణ చేసి నో–డిటెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

ఈ సవరణకు ఇటీవలే లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఉత్కంఠ చెందుతున్నారు. నోడిటెన్షన్‌ విధానం రద్దుకు సవరణ బిల్లు గత నెల 18న లోక్‌సభకు రాగా, అక్కడ ఆమోదం లభించింది. విద్యార్థులు 5, 8 తరగతుల్లో ఉత్తీర్ణులు అయితేనే తరవాత తరగతికి వెళ్తారు. లేదంటే మళ్లీ చదివి ఉత్తీర్ణత కావలసి ఉంటుంది. అయితే ఫలితాలు వచ్చిన వారంలో 10, ఇంటర్‌ తరహాలో అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ నిర్వహించాలని కూడా నిర్ణయించారు.

దీనిపై ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అభ్యంతరా లు తెలుపుతుండడంతో దీనిని అమలు చేయాలా, లేదా అన్నది రాష్ట్రాల విచక్షణకే వదిలివేస్తున్నట్టు కేంద్రమంత్రి లోక్‌సభలో ప్రకటించారు. ఈ విధానం వల్ల పాఠశాల విద్య బలోపేతం అవడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికంటే నాణ్యమైన విద్య అందుతుందని కేంద్ర భావన అని మంత్రి లోక్‌సభలో తెలిపారు. అయితే ఉపాధ్యాయులు మాత్రం దీనివల్ల డ్రాపౌట్స్‌ పెరిగిపోతాయని విద్యార్థులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు.

కార్పొరేట్‌ పాఠశాలల విషయాన్ని పక్కన పెడితే ప్రైవేటు పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదరుపాయాలు లేవు. దీనివలన బోధన కొంత వెనుకబడి ఉంటుందనడంలో సందేహం లేదు. డిటెన్షన్‌ విధా నం అమలైతే ప్రభుత్వ బడులకు వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

ప్రైవేటు పాఠశాలల్లో అయితే తమ పిల్లలు తప్పనిసరిగా ఏదోలా ఉన్నత తరగతికి వెళ్తారని తల్లిదండ్రుల్లో అభిప్రాయం కలగవచ్చని విద్యావేత్తలు వాదిస్తున్నారు. విద్యాహక్కు చట్టం సవరణపై అభిప్రాయ సేకరణసమయంలో 90 శాతం మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలు వ్యతిరేకించినా ప్రభుత్వం దానిని పరిగణనలోకి తీసుకోకుండా బిల్లును ఆమోదించి అమలు విషయాన్ని రాష్ట్రాలకు వదిలేసింది. డిటెన్షన్‌ విధానం అమలులో లేకపోవడం విద్యార్థుల ప్రయోజనానికి విఘాతమని పార్లమెంటరీ స్థాయి సంఘం స్పçష్టం చేస్తూ తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలనే నిబంధన ఉంటే

విద్యార్థుల్లో అభ్యసన నైపుణ్యం, వికాసం వంటివి అభివృద్ది చెందుతాయని పేర్కొంది. 8వ తరగతి వరకు డిటెన్షన్‌ విధానం లేకపోవడం సరికాదని పేర్కొంది. ఈ మేరకు నివేదిక కూడా సమర్పించింది. గతంలో 7వ తరగతికి కామన్, పదో తరగతికి పబ్లిక్‌  పరీక్ష ఉండేది. 

7వ తరగతి కామన్‌పరీక్షను తీసేయడంతో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థికి పరీక్షలలో ఫెయిల్‌ అయినా 9వ తరగతి వరకు విద్యకు ఆటంకం లేకుండా వెళ్లిపోయేవారు. దీనివలన పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం సాధించలేకపోవడం వంటివి జరిగేవి. ప్రస్తుతం అమలు చేయాలనుకుంటున్న డిటెన్షన్‌ విధానం మంచిదే అయినప్పటికీ ఉపాధ్యాయులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అంతు చిక్కడం లేదు. బాలల హక్కుల చట్టం ప్రకారం డిటెన్షన్‌ విధానం విరుద్ధమని విద్యావేత్తలు వాదిస్తున్నారు.

రాష్ట్రంలో 2012 నుంచి సీసీఈ విధానం అమలవుతుండగా డిటెన్షన్‌ విధానం అమలైతే సీసీఈ విధానం నిర్వీర్యమవుతుంది. సీసీఈ విధానం వలన పరీక్షల విధానంలో పలు మార్పులు చేశారు. సీసీఈ విధానంలో ఇంటర్నల్‌ మార్కులు కూడా ఉండేవి. డిటెన్షన్‌ విధానం అమలైతే సీసీఈ విధానానికి పూర్తిగా తూట్లు పడతాయి. సీసీఈ విధానంపై ఎన్నో అభ్యంతరాలు వచ్చినా కొన్ని రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకించి అమలు చేయకపోయినా మన రాష్ట్రంలో మాత్రం సీసీఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు డిటెన్షన్‌ విధానం వస్తే మరోసారి పరీక్షల నిర్వహణ విధానాన్ని సమూలంగా మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement