34 కొత్త నియోజకవర్గాలు

34  కొత్త నియోజకవర్గాలు - Sakshi

తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనకు కసరత్తు షురూ
 
119 స్థానే 153కు చేరనున్న తెలంగాణ శాసనసభ్యుల సంఖ్య
ఎస్సీలకు 23, ఎస్టీలకు 19 స్థానాలు కేటాయించే అవకాశం
రంగారెడ్డిలో అత్యధిక స్థానాలు, నిజామాబాద్‌లో అత్యల్పం
కొత్త వాటిల్లోనే 2019 ఎన్నికలు, 2026 వరకు కొనసాగింపు

కొత్త రాష్ట్రంలో మరిన్ని శాసనసభ నియోజకవర్గాలు ఏర్పాటు కాబోతున్నాయి. తెలంగాణ పది జిల్లాల్లో మరో 34 శాసనసభ స్థానాలు ఏర్పాటు దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాథమిక కసరత్తును ప్రారంభించటంతో రాజకీయ పార్టీలు, నాయకుల్లో మళ్లీ ఆసక్తికరమైన చర్చలకు తెరలేస్తోంది. దీంతో ప్రస్తుత శాసనసభ నియోజకవర్గాల హద్దులు మారిపోవటం, కొత్తగా మరిన్ని ఏర్పాటు అవుతుండడం, ఎస్సీ, ఎస్టీలకు ఇంకొన్ని నియోజకవర్గాలు రిజర్వు కానున్న నేపథ్యంలో అందరి దృష్టి నియోజకవర్గాల పునర్విభజనపై పడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కొత్త నియోజకవర్గాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో 2,30,064 జనాభా సగటును ప్రామాణికంగా తీసుకుని ప్రక్రియను ప్రారంభించనున్నారు. ప్రస్తుతవుున్న 119 శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 153కు చేరుకోనుంది. ఈ పునర్విభజనలో అత్యధిక స్థానాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలో పెరగనున్నాయి.

 హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏకంగా పదకొండు కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నారుు. మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ నాలుగు నియోజకవర్గాలు ఏర్పాటై మొత్తం సంఖ్య 18కి చేరనుంది.

 పునర్విభజన సాగేదిలా...

2001 జనాభా లెక్కల మేరకు ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్‌సభ, 119 శాసనసభ స్థానాలున్నాయి. వీటిలో ఎస్సీలకు 19, ఎస్టీలకు 12లకు రిజర్వు అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలు విడిపోవటంతో 42 లోక్‌సభ పరిధిలో కొత్తగా రెండేసి చొప్పున శాసనసభ నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంటే తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో 34 (119+34=153) శాసనసభ స్థానాలు పెరుగుతాయి. లోక్‌సభ స్థానాలు 2026 వరకు యథావిధిగా ఉంటాయి. 2011 జనాభా లెక్కల వివరాలను పరిగణనలోకి తీసుకుని శాసనసభ స్థానాల పునర్విభజన జరుగుతుంది. ఈ ప్రకారం తెలంగాణ జనాభా 3,51,93,978గా తేల్చారు. దీంతో మొత్తం జనాభాను 153తో విభజిస్తే వచ్చే సగటు మేరకు నియోజకవర్గాల ఏర్పాటు జరుగుతుంది. అంటే 2,30,026 జనాభాకు ఒక్క నియోజకవర్గం ఏర్పాటవుతున్నట్లు లెక్క. అయితే పునర్విభజన చట్టం మేరకు ప్రత్యేక పరిస్థితుల్లో     
 
నియోజకవర్గ జనాభా రాష్ట్ర సగటు కంటే 10 శాతం తక్కువ లేదా 10 శాతం ఎక్కువతోనైనా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది.
 దళితులకు 23 శాసనసభ స్థానాలు...
 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దళితుల జనాభా 16.19 (2001 జనాభా) శాతంగా నమోదు కాగా, విడిపోయిన అనంతరం తెలంగాణలో దళితుల జనాభా సగటు 15.44 శాతంగా తేలింది. రాష్ట్రంలో ఎస్సీలకు ప్రస్తుతం 19 స్థానాలు ఉండగా పునర్విభజన తర్వాత 23కు చేరుకోనున్నాయి. జిల్లాలోని ఎస్సీ జనాభా ఆధారంగా ఈ స్థానాలను రిజర్వ్ చేస్తారు. అత్యధికంగా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఎస్సీలకు మూడేసి చొప్పున నియోజకవర్గాలు రిజర్వయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కరీంనగర్‌లో దళితులకు మూడు నియోజకవర్గాలు రిజర్వు కాగా, పెరిగే స్థానాలు వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కేటాయించే అవకాశం ఉంది.

ఎస్టీలకు 16 స్థానాలు...

ఎస్టీలకు ప్రస్తుతం 12 శాసనసభ స్థానాలు ఉండగా పునర్విభజన తర్వాత 16కు చేరుకోనుంది. 2011 జనాభా లెక్కల మేరకు తెలంగాణ రాష్ట్రంలో 9.34 శాతం గిరిజనులు ఉన్నట్లు లెక్కతేల్చారు. ఈ మేరకు గిరిజనులకు మరో నాలుగు స్థానాలు పెరుగుతాయి. రిజర్వేషన్లను మాత్రం రాష్ట్ర యూనిట్‌గా తీసుకుని కేటాయింపు చేస్తారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎస్టీలకు మరిన్ని సీట్లు రిజర్వు కానున్నాయి.

గ్రేటర్‌లోనే కొత్తగా పది స్థానాలు  

పునర్విభజనలో గ్రేటర్ హైదరాబాద్‌లో  కనీసం పది శాసనసభ స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ కోర్‌సిటీ(హైదరాబాద్ జిల్లా)లో రెండు నియోజకవర్గాలు పెరుగుతుండగా, గ్రేటర్ హైదరాబాద్‌లో భాగమైన శివార్లు(రంగారెడ్డి జిల్లా) కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, మహేశ్వరం తదితర నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాలన్నీ విడిపోయి కనీసం ఎనిమిది కొత్త నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
 
 
 పునర్విభజన ఇలా..

 తెలంగాణ జనాభా(2011)     :    3,51,93,978
 నియోజకవర్గ సగటు జ నాభా    :    2,30, 026
 మొత్తం నియోజకవర్గాలు    :    153
 ఎస్సీలకు రిజర్వు అయ్యేవి    :    23
 ఎస్టీలకు రిజర్వు అయ్యేవి    :    16
 అత్యధిక స్థానాల జిల్లా    :    రంగారెడ్డి (23)
 తక్కువ స్థానాల జిల్లా    :    నిజామాబాద్(11)

http://img.sakshi.net/images/cms/2014-09/61410463953_Unknown.jpg
 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top