గులాబీ దూకుడు!

2019 General Elections Main TRS - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : రానున్న సాధారణ ఎన్నికలే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు పెంచుతోంది. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేలా భారీ కసరత్తు చేస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను గెలుచుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. అందుకు అనుగుణంగా త్వరలో రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి విపక్షాలను మరింత బలహీనం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలుత సంస్థాగతంగా టీఆర్‌ఎస్‌ లోపాలపై పార్టీ ముఖ్యనేతలు దృష్టి కేంద్రీకరించారు.

నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తూనే.. తాజాగా రైతు సమన్వయ సమితుల పేరిట పలువురికి పదవులు అప్పగించారు. అలాగే ఎప్పటికప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలా ప్రణాళిక రూపొందించారు. అందుకు అనుగుణంగా వీలు చిక్కినప్పుడల్లా ముఖ్యనేతల బహిరంగసభలు, సమావేశాలు ఏర్పాటుచేస్తున్నారు. కీలక శాఖల మంత్రులు ఎక్కువగా పాలమూరు ప్రాంతంలోనే అధికారిక పర్యటనలు చేస్తుండడం ఇక్కడ ప్రస్తావనార్హం. తద్వారా గత ప్రభుత్వాల తప్పిదాలను ఎండగడుతూ, ప్రస్తుత అభివృద్ధిని వివరిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ, ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు.

 మెజార్టీ సీట్లే లక్ష్యంగా..

వచ్చే ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలు ఉన్న పాలమూరులో ఆధిక్యం కనబర్చాలని అన్ని రాజకీయపార్టీలు తహతహలాడుతున్నాయి. జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుపొందిన పార్టీలు అధికారం దక్కించుకోవడం ఖాయమనే సెంటిమెంట్‌ ఎప్పటి నుంచో ఉంది. అందుకోసం పాలమూరు సెంటిమెంట్‌ను ఆసరా చేసుకుని ప్రధాన పార్టీలు వ్యూహా ప్రతివ్యూహాలు చేస్తుంటాయి. ఈనేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గులాబీ జెండా ఎగరవేయాలని కృతనిశ్చయంతో ఉన్న టీఆర్‌ఎస్‌ నేతలు అందుకు అనుగుణంగా కసరత్తు చేపట్టారు.

గత ఎన్నికల్లో ఏ మాత్రం బలం లేకపోయినా, సంస్థాగతంగా నిర్మాణం లేకపోయినప్పటికీ మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానంతో పాటు షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్‌ స్థానాలను కైవసం చేసుకొంది. తద్వారా టీఆర్‌ఎస్‌కు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ను సులువుగా సాధించుకుంది. అలాగే వచ్చే ఎన్నికల్లో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాలను గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయాలని ఆ పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.

ఆపరేషన్‌ పాలమూరు..

ఓట్లు, సీట్లే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ‘ఆపరేషన్‌ పాలమూరు’కు శ్రీకారం చుట్టుంది. దేశంలోనే అత్యంత వెనకబడిన ప్రాంతంగా పాలమూరు ప్రాంతానికి పేరుంది. అభివృద్ధిలో వెనుకబడడంతో ఇక్కడి ప్రజలు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు ఎక్కువగా వలస వెళ్తుంటారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు పనుల కోసం ముంబై, పూణెలతో పాటు ఇతర ప్రాంతాలకు నిత్యం వందల సంఖ్యలో వెళ్తుండడం సర్వసాధారణం. తలాఫున కృష్ణమ్మ పారుతున్న జిల్లాకు అనుకున్న స్థాయిలో ఉపయోగపడడం లేదు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికాకపోవడంతో భూములన్నీ బీళ్లుగా మారిపోయేవి. దీన్ని దృష్టిలో పెటు ్టకుని టీఆర్‌ఎస్‌ పార్టీ... గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దే చర్యలకు శ్రీకారం చుట్టింది.

అందుకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మే రకు నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు జిల్లాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై నిత్యం పర్యవేక్షిస్తూ పనులను వేగవంతం చేశారు. ఫలితంగా మూడేళ్లలో ఆ ఫలాలు ప్రజలకు చేరువయ్యాయి. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో బీడుభూములు విస్తృతం గా సాగులోకి తీసుకొచ్చారు. మూడేళ్ల క్రితం జిల్లాలో లక్షన్నర ఎకరాలకు మాత్రమే సాగునీరు అందగా.. తాజాగా 6లక్షల పైచిలుకు భూమి సాగులోకి వచ్చింది. అదే విధంగా రాష్ట్ర ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటగా అతిపెద్ద ప్రాజెక్టు పాలమూరు–రంగారెడ్డిని చేపట్టారు. దీనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి పాలమూరు ప్రాంతంలో 14లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.  

విపక్షాలపై ఆధిపత్యం.. 
జిల్లాలో విపక్షాలను కోలుకోకుండా చేసేందుకు టీఆర్‌ఎస్‌ మరో అస్త్రాన్ని సంధించాలని యోచిస్తోంది. రైతుబంధుతో పాటు వివిధ సంక్షేమ పథకాలను ఆసరాగా చేసుకుని వచ్చే ఎన్నికలకు బలమైన ఫునాది వేసుకోవా లని భావిస్తోంది. అందుకోసం త్వరలో రా నున్న స్థానిక ఎన్నికలను ఆయుధంగా మలుచుకోవాలనే ఆలోచనలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా విపక్షాలను నైతికంగా దెబ్బతీయాలని భావిస్తోంది. ఎక్కువ స్థానాల్లో గులాబీ సానుభూతిపరులు గెలిచిపించుకుంటే వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడకలా మారుతుందని టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావించి, అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది.  

సంస్థాగత నిర్మాణంపై దృష్టి

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు పూర్తి కావొస్తున్నా సంస్థాగతంగా పార్టీ ఇం కా బలహీనంగానే ఉందనే విమర్శలున్నాయి. పార్టీకి ఒక నిర్మాణం, కమిటీలు వంటివేమీ లేకపోవడంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నా యి. అంతేకాదు బంగారు తెలంగాణ పేరుతో ఇతర పార్టీలకు చెందిన నేతలను భారీగా పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో సంస్థాగత ంగా బలోపేతం కాకపోతే వచ్చే ఎన్నికల్లో తీవ్ర నష్టం జరిగే ప్రమాదముందని పార్టీ ముఖ్యులు భావించారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే కొందరు ముఖ్య నేతలకు మార్కెట్‌ కమిటీ, గ్రంథాలయ సంస్థల పదవులు అప్పగించారు.

అలాగే గ్రామీణ స్థాయిలో కూడా పార్టీని ప టిష్టం చేసుకోవడంలో భాగంగా రైతు సమన్వ య సమితిలను తీసుకొచ్చారు. ఈ పదవుల్లో ని యామకం ద్వారా గ్రామాల్లో తిరుగులేని శక్తిగా ఏర్పడేందుకు టీఆర్‌ఎస్‌ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.8వేలు ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే త్వరలో ప్రతీ జిల్లాకు కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top