
సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో నామినేషన్లు వేసేందుకు క్యూలో నిలబడిన పసుపు, ఎర్రజొన్న రైతులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ స్థానానికి రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు సోమవారం ఏకంగా 182 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో 179 మంది రైతులే ఉన్నారు. తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, పసుపు, ఎర్రజొన్నను ప్రభు త్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. పెద్ద ఎత్తున రైతులు తరలిరావడంతో కలెక్టరేట్ పరిసరాలు కిటకిటలాడాయి. సమస్యను జాతీయ స్థాయిలో వినిపించేందుకే తాము నామినేషన్లు వేశామని పసుపు, ఎర్రజొన్న రైతులు ప్రకటించారు. కాగా, ఈనెల 20న ఏడు నామినేషన్లు, 22న 56 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం మీద నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి దాఖలైన నామినేషన్ల సంఖ్య 245 కు చేరింది.
తరలి వచ్చిన నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన రైతులు
పసుపు, ఎర్రజొన్న సాగయ్యే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలతో పాటు జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల నుంచి రైతులు తరలివచ్చారు. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుండగా, ఉదయం ఎనిమిది గంటల నుంచే రైతుల రాక ప్రారంభమైంది. ఒక్కో గ్రామం నుంచి ఇద్దరు, ముగ్గురు, నలుగురు., అభ్య ర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసే రైతులతో పాటు, అభ్యర్థిని బలపరిచేందుకు వచ్చిన రైతులతో కలెక్టరేట్ పరిసరాలు కిటకిటలాడింది. ఒక్కసారిగా రైతులు తరలిరావ డంతో అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పా ట్లు చేసింది. ప్రగతిభవన్‌లో షామియానాలు, కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. నాలుగైదు కౌంటర్లను ఏర్పాటు చేసి, అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. నామినేషన్ల పరిశీలన, ధ్రువపత్రాలు, చెక్‌లిస్టు ప్రకా రం జత చేయాల్సిన సర్టిఫికెట్లు., ఇలా ఒక్కో అంశానికి సంబంధించి ఒక్కో కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లలో పరిశీలన అనంతరం జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎం రామ్మోహన్ రావు నామినేషన్లు తీసుకున్నారు. జిల్లాలోని డీఆర్‌వో, ఆర్డీవోలు, అన్ని స్థాయిల్లోని రెవెన్యూ ఉన్నతాధికారులందరూ చివరి రోజు ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ విధులను నిర్వర్తించారు.
గ్రామాభివృద్ధి కమిటీల తీర్మానాలు
ఆయా గ్రామాల్లోని రైతులంతా ఏకతాటిపైకి వచ్చి నామినేషన్లు వేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు కొన్ని గ్రామాల్లో వీడీసీ (గ్రామాభివృద్ధి కమిటీ)లు తీర్మానాలు చేశాయి. నామినేషన్లు వేసే అభ్యర్థులకు డిపాజిట్ల కోసం అవసరమైన మొత్తాన్ని కూడా వీడీసీలే సర్దుబాటు చేశాయి. ఆయా గ్రామాల్లోని ఒక్కో కుటుంబం నుంచి నిర్ణీత మొత్తాన్ని జమ చేసి, అభ్యర్థులకు అవసరమైన డిపాజిట్ నిధులను సమకూర్చుతున్నారు.
ఫలించని మంత్రి, ఎమ్మెల్యేల ప్రయత్నాలు
రైతులు నామినేషన్లు వేయకుండా నిలువరించేందుకు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల అనంతరం ఎర్రజొన్నకు బోనస్ ప్రకటిస్తామని టీఆర్‌ఎస్ నేతలు హామీలు ఇచ్చారు. మరోవైపు నామినేషన్లు వేయకుండా టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు రైతులతో మాట్లాడారు. నామినేషన్లు వేయవద్దని సూచించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా మోర్తాడ్‌లో రైతులతో సమావేశమై నామినేషన్లు వేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు. అయితే ఇందుకు రైతులు ససేమిరా అన్నట్లు నామినేషన్ల వెల్లువను బట్టి తెలుస్తోంది.
144 సెక్షన్ అమలు
నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిజామాబాద్ కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ట్రాఫిక్ వన్‌వేగా ఏర్పాటు చేసి, కలెక్టరేట్ వైపు ఇతర వాహనాలు వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పా ట్లు చేశారు. జిల్లా పోలీసులతో పాటు, సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు.
జాతీయ స్థాయిలో గళం వినిపించేందుకే..
తమ సమస్యను జాతీయ స్థాయిలో విని పించేందుకే తాము నామినేషన్లు వేశామని పసుపు, ఎర్రజొన్న రైతులు ప్రకటించారు. నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాము ఎన్నికల్లో భారీ ఎత్తున నామినేషన్లు వేయాలని నిర్ణయించామని ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన గాదేపల్లి మధు అనే రైతు విలేకరులతో పేర్కొన్నారు.