14 శాతం ఆదాయ వృద్ధి!

14 percent growth rate - Sakshi

గత నాలుగు నెలల్లో నమోదు

జీఎస్టీతో పెరుగుతున్న రాష్ట్ర రాబడి

జీఎస్టీపై తొలగుతున్న అపోహలు, అనుమానాలు

సాక్షి, హైదరాబాద్‌: జీఎస్టీపై ఉన్న అనుమానాలు క్రమంగా తొలగిపోతున్నాయి. రాష్ట్రానికి జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం క్రమంగా పుంజుకుంటోంది. రాష్ట్ర ఖజానాకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయ వృద్ధి గతేడాదితో పోలిస్తే ఆశించిన స్థాయిలోనే ఉంటోంది. గతేడాది అమల్లో ఉన్న వ్యాట్‌తో పోలిస్తే ఈ ఏడాది అమ్మకపు పన్ను ద్వారా వచ్చిన ఆదాయం నవంబర్‌లో 25.6 శాతం పెరిగింది. అక్టోబరులో 26.34 శాతం పెరిగింది. మొత్తంగా గత నాలుగు నెలల ఆదాయాన్ని పరిశీలిస్తే 14.29 శాతం ఆదాయ వృద్ధి నమోదైంది. దీంతో జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందనే అపోహలు, అనుమానాలు తొలగినట్లయింది.

ఆశాజనకం..
అమ్మకపు పన్ను ద్వారా వచ్చే ఆదాయంపై చెప్పుకోదగ్గ ప్రభావమేమీ లేదని, జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలి రెండు నెలలతో పోలిస్తే క్రమంగా ఆదాయం పుంజుకోవటం ఆశాజనకంగానే ఉందని వాణిజ్య పన్నుల శాఖ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. గతంలో అమల్లో ఉన్న వ్యాట్‌కు ప్రత్యామ్నాయంగా జూలై నుంచి కేంద్రం దేశవ్యాప్తంగా జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పెట్రోలియం, మద్యం మినహా మిగతా వస్తు సేవలన్నీ జీఎస్టీ పరి«ధిలోకి చేరాయి. దీంతో జీఎస్టీపై ఆదాయం పెరుగుతుందా, తగ్గుతుందా అని రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడింది. అయితే జీఎస్టీ, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద వచ్చే ఐజీఎస్టీ, పెట్రోలియం, మద్యం ద్వారా వచ్చే ఆదాయం క్రమంగా పుంజుకుంది. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌ నెలల్లో వ్యాట్‌ ద్వారా రూ.11,111 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అదే నాలుగు నెలల్లో రూ.12,700 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రధానంగా పెట్రోలు, మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ప్రభుత్వ ఖజానాకు పెద్ద దిక్కు. ప్రతి నెలా దాదాపు రూ.1,400 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల మేరకు ఈ ఆదాయం సమకూరుతోంది. దీంతో జీఎస్టీలో హెచ్చు తగ్గులున్నప్పటికీ.. మొత్తంగా వచ్చే ఆదాయంలో పెద్దగా నష్టమేమీ లేదని వాణిజ్య శాఖ ఊపిరి పీల్చుకుంటోంది.

ఐజీఎస్టీతో ఊరట
జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం ప్రతి నెలా స్థిరంగానే కనబడుతోంది. ఆగస్టులో రూ.841 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.803 కోట్లు, అక్టోబర్‌లో రూ.847 కోట్లు, నవంబర్‌లో రూ.750.7 కోట్ల ఆదాయం వచ్చింది. అదే సమయంలో ఐజీఎస్టీలో రాష్ట్ర వాటా ఆగస్టులో రూ.419 కోట్లు ఉండగా.. నవంబర్‌ నాటికి రూ.798.3 కోట్లకు అమాంతం పెరిగింది. మరోవైపు జీఎస్టీలో తగ్గిన ఆదాయం మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రెండు విడతల్లో మొత్తం రూ.164 కోట్లు పరిహారం విడుదల చేసింది. కానీ క్రమంగా ఈ పరిహారం అందుకునే జాబితాలో తెలంగాణకు చోటు దక్కే అవకాశం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. జీఎస్టీలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఆదాయ వృద్ధి 14 శాతం మించటంతో రానురాను పరిహారం రావటం కష్టమేనని అంచనా వేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top