
పది జెడ్పీటీసీ స్థానాల్లో సీపీఐ పోటీ
జిల్లా వ్యాప్తంగా 10 జెడ్పీటీసీ, 135 ఎంపీటీసీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్ తెలిపారు.
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా 10 జెడ్పీటీసీ, 135 ఎంపీటీసీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్ తెలిపారు. ఆదివారం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ పొత్తులు కొనసాగుతాయన్నారు. భావసారూప్యత కలిగిన రాజకీయ పక్షాలతో సీపీఐ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకుంటుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పోరాడిన పార్టీలన్నీ ఒకేతాటిపైకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే సత్ఫలితాలు ఉంటాయన్నారు.
తెలంగాణ వ్యతిరేకులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాక్షేత్రంలో తెలంగాణ వ్యతిరేక పార్టీలకు స్తానం లేకుండా చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.పోశం, మండల కార్యదర్శి బి.సత్యనారాయణ, నాయకుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.