మహిళకు పదోసారి గర్భం

Women Escape From Family Planning surgery In Tamil Nadu - Sakshi

టీ.నగర్‌: పదోసారి గర్భం దాల్చిన 52 ఏళ్ల మహిళ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సకు భయపడి భర్తతో అదృశ్యమైంది. దీంతో పోలీసులు సదరు మహిళ కోసం గాలిస్తున్నారు. తమిళనాడులోని పుదుకోటై జిల్లా అరంతాంగి సమీపం వేదియన్‌కుడికి చెందిన ఆనందన్‌ (55). భార్య ఆరాయి (52). ఈమెకు ఇది వరకే తొమ్మిది ప్రసవాలు ఇంట్లోనే జరిగాయి. ఒక బిడ్డ ప్రసవంలోనే మృతి చెందగా ఎనిమిది మంది సంతానం ఉన్నారు. వీరిలో నలుగురికి వివాహాలయ్యాయి. ఇదిలాఉండగా ఆరాయి మళ్లీ గర్భం దాల్చింది. ఇటీవల ఆమె సింగవనం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పరీక్షల నిమిత్తం వెళ్లింది. ఆమెను వైద్యులు పరిక్షించగా మధుమేహం, బీపీ ఉన్నట్లు తెలిసింది. మెరుగైన చికిత్సల కోసం ఆమెను పుదుకోటై ప్రభుత్వ ఆస్పత్రి వైద్య కళాశాలకు పంపారు.

అక్కడ చికిత్స పొందిన ఆరాయి సొంత ఊరికి చేరుకుంది. ఆరాయికి ఆగస్టు 18న ప్రసవం తేదీగా వైద్యులకు తెలిసింది. డాక్టర్‌ అయ్యప్పన్‌ ఆధ్వర్యంలోని వైద్య బృందం గత నాలుగో తేదిన వేదియన్‌కుడికి వెళ్లి ఆరాయికి పరీక్షలు నిర్వహించారు. బిడ్డ ఆరోగ్యకరంగా పుట్టేందుకు అంబులెన్స్‌ ద్వారా పుదుకోటై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేరాల్సిందిగా సూచించారు. అయితే ఆనందన్, నిండు చూళాలైన భార్యతోపాటు అదృశ్యమయ్యాడు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లి ఉండొచ్చని సమాచారం. వైద్యబృందం, రెవెన్యూ సిబ్బంది ఆరాయి, ఆమె భర్త కోసం అనేకచోట్ల గాలించినా వారి జాడ తెలియలేదు. డాక్టర్‌ అయ్యప్పన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగుడి పోలీసులు కేసు నమోదు చేసి ఆరాయి కోసం గాలిస్తున్నారు.

16 మంది పిల్లల కోసం ఆశ: దీనిపై స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఆనందన్, అతని భార్యకు 16 మంది పిల్లలను కనాలన్న ఆశ ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకుంటే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేస్తారనే భయంతో ఆరాయి తన భర్తతో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిపారు.

మాతాశిశు సంరక్షణకు పథకం: ప్రసవం సమయంలో మాతాశిశు మరణాలను నిరోధించేందుకు సర్కరైయిల్‌ అక్కరై పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు మంత్రి విజయభాస్కర్‌ వెల్లడించారు.ఈ పథకం ఈ నెల 15వ తేదీ నుంచి రానున్న జనవరి 26 వరకు అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా గర్భిణులకు రక్త పోటు, తదితర వైద్య పరీక్షలు జరిపి తగిన చికిత్స అందచేయనున్నట్లు తెలిపారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top