కేసీఆర్‌ను ఉరి తీసినా తప్పులేదు: రేవంత్‌రెడ్డి
సీఎం కేసీఆర్ పై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరవీరులను అవమానపర్చిన కేసీఆర్ ను గన్ పార్క్ లేదా బుద్దుని విగ్రహం దగ్గర ఉరి తీసినా తప్పులేదని రేవంత్ వ్యాఖ్యానించారు. సీఎం కుర్చీలో ఆంధ్రాకు చెందిన చినజీయర్ స్వామిని కూర్చోబెట్టడం అమరవీరులను అవమానపర్చడమే అని మండిపడ్డారు. సెల‍్ఫీలతో కేటీఆర్.. సెల్ఫ్ డబ్బాలతో కేసీఆర్ బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
హామీలను అమలు చేయడంలో సీఎం విఫలమయ్యారన్నారు. గద్దెనెక్కిన రెండున్నర ఏళ్ల పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా.. ప్రశ్నించిన వారి గొంతు నొక్కేలా అక్రమ కేసులు పెట్టిస్తున్నారన్నారు. డబుల్ బెడ్ రూం పథకం ఇల్లు పీకి పందిరేసినట్లుందన్నారు. బంగారు తెలంగాణ అంటూ తెలంగాణను బొందల గడ్డగా మార్చారని ఆరోపించారు. అందుకు రైతుల ఆత్మహత్యలే నిదర్శమన్నారు.