శాసన మండలి ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఎమ్మెల్సీలైన ఎ.హెచ్. శివ యోగి స్వామి, (కర్ణాటక పట్టభద్రుల ఆగ్నేయ నియోజక వర్గం....
సాక్షి, బెంగళూరు : శాసన మండలి ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఎమ్మెల్సీలైన ఎ.హెచ్. శివ యోగి స్వామి, (కర్ణాటక పట్టభద్రుల ఆగ్నేయ నియోజక వర్గం), పుట్టణ్ణ (ఉపాధ్యాయ బెంగళూరు నియోజక వర్గం) అవధి జూన్ 30తో ముగుస్తుంది. అదేవిధంగా మోహన్ ఏ లింబికాయ్ (కర్ణాటక పట్టభద్రుల పశ్చిమ నియోజకవర్గం), శశిల్ జి నమోషి (ఉపాధ్యాయ కర్ణాటక ఈశాన్య నియోజక వ ర్గం)లు గతంలో తమ పదవులకు రాజీనామా చేశారు.
దీంతో మొత్తం నాలుగు స్థానాలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందు కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నేడు నోటిఫికేషన్ వెలువ రించనుంది. జూన్ 3లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అదే నెల 6 వరకూ నామినేషన్లు ఉప సంహరించుకునేందుకు అవకాశం ఉంది. ఓటింగ్ ప్రక్రియ జూన్ 20న ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకూ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 24న 8 గంటలకు మొదలై ఫలితాలు అదే రోజు వెలువడనున్నాయి.
కాగా, జేడీఎస్ సోమవారం సాయంత్రమే ఆయా ఎమ్మెల్సీ స్థానాలకు పార్టీ తరఫున అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. పుట్టణ్ణ (ఉపాధ్యాయ బెంగళూరు నియోజక వర్గం), ఎం.బీ హంబల్గీ (ఉపాధ్యాయ కర్ణాటక ఈశాన్య నియోజక వర్గం), వసంత బసవరాజు హొరట్టి (కర్ణాటక పట్టభద్రుల పశ్చిమ నియోజకవర్గం), చౌదారెడ్డి తుప్పలి (కర్ణాటక పట్టభద్రుల ఆగ్నేయ నియోజకవర్గం)లు పోటీచేయనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర శాసనసభ నుంచి రాజ్యసభకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల కోసం జూన్ 2న నోటిఫికేషన్ వెలువడనుంది.