ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘనపై మొత్తం 3వేల కేసులను నమోదు చేయగా వాటిల్లో 1200 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘనపై మొత్తం 3వేల కేసులను నమోదు చేయగా వాటిల్లో 1200 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రవీణ్‌కుమార్ తెలి పారు. కోవైలో మంగళవారం నిర్వహించిన లెక్కింపు శిక్షణా తరగతుల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గడువు తర్వాత ఎన్నికల ప్రచారం, వాహనాల వినియోగం, లెక్కకు మించి నామినేషన్ దాఖలులో పాల్గొనడం, ఓటర్లకు డబ్బులు పంపిణీ వంటి అనేక అంశాలపై వేలాది ఫిర్యాదులు అందాయని తెలిపారు. అయితే వాటిల్లో విచారణకు అర్హమైన మూడువేల ఫిర్యాదులను నమోదు చేసుకున్నామని చెప్పారు.
ఇందులో 1200 కేసులకు సంబంధించి వివరాల సేకరణతో చార్జ్‌షీట్ దాఖలు పూర్తయిందని అన్నారు. మిగిలిన వాటిపై కూడా త్వరలో చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. ఎన్నికల కమిషన్ తీరువల్లనే కొన్ని గ్రామాల్లో ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. నేతలు ప్రజల ప్రాథమిక అవసరాలు, సౌకర్యాలను పట్టించుకోలేదనే ఆగ్రహంతోనే ఓటింగ్‌లో పాల్గొనలేదని ఆయన స్పష్టం చేశారు. కోవైలోని పల్లడం, శూలురులలో 85 శాతం పోలింగ్ జరిగినా రీపోలింగ్ అవసరం లేదన్నారు. కేవలం అధికశాత పోలింగ్ మాత్రమే పరిగణనలోకి తీసుకోరాదన్నారు. నిబంధనల ఉల్లంఘన, రిగ్గింగ్, శాంతి భద్రతల విఘాతం వంటి అంశాలను సైతం విశ్లేషిస్తామని అన్నారు.
ప్రచారం ముగిసిన తరువాత నుంచి పోలింగ్ సమయం వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ విధించినందున కేవలం రూ.70 లక్షలు పట్టుపడిందని తెలిపారు. అవసరమైతే ఈనెల 16 వ తే దీ లెక్కింపు రోజున కూడా 144 సెక్షన్‌ను అమలుచేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు తాము పెట్టిన ఖర్చుల తాలూకు వివరాలను తక్కువ చేసి చూపిస్తే మూడేళ్ల జైలు శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. అభ్యర్థులు తగిన ఆధారాలతో సరైన లెక్కలను సమర్పించాలని ఆయన కోరారు. అందరికంటే నోటాకే ఎక్కువ ఓట్లు పోలైన పక్షంలో రెండవ మెజారిటీ సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తామని ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఓట్ల లెక్కింపు శిక్షణా శిబిరాల రెండోరోజున కోవై, ధర్మపురి, ఈరోడ్డు, నామక్కల్, తిరుపూరు, నీలగిరి, సేలం తదితర జిల్లాల ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.