కార్పొరేషన్ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచాలనే ఉద్దేశంతో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్‌డీఎంసీ) ఓ బృహత్తర పథకానికి రూపకల్పన చేస్తోంది. కార్పొరేషన్ పాఠశాలలను వివిధ స్వచ్ఛంద సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు, ప్రైవేటు పాఠశాలలకు దత్తత ఇవ్వాలని యోచిస్తోంది. ప్రతిపాదన దశలో ఉన్న పథకానికి ఇప్పటికే మంచి స్పందన కనిపిస్తోందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
న్యూఢిల్లీ: కార్పొరేషన్ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచాలనే ఉద్దేశంతో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్‌డీఎంసీ) ఓ బృహత్తర పథకానికి రూపకల్పన చేస్తోంది. కార్పొరేషన్ పాఠశాలలను వివిధ స్వచ్ఛంద సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు, ప్రైవేటు పాఠశాలలకు దత్తత ఇవ్వాలని యోచిస్తోంది. ప్రతిపాదన దశలో ఉన్న పథకానికి ఇప్పటికే మంచి స్పందన కనిపిస్తోందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కొన్ని సంస్థలు ఈ విషయమై తమను సంప్రదించాయని, కార్పొరేషన్ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు ఆసక్తి కనబర్చాయన్నారు.
‘ఈ పథకం ద్వారా కార్పొరేషన్ పాఠశాలల్లో విద్యానాణ్యత పెరుగుతుంది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను కూడా నిర్వహించడం వీలుపడుతుంది. దత్తత తీసుకున్న సంస్థలు పాఠశాల పూర్తి నిర్వహణ బాధ్యతను తీసుకుంటాయి. కార్పొరేషన్ తరఫు నుంచి పుస్తకాలు, భోజనం వంటి కనీస వసతులు సమకూరుస్తాం. అయితే ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు ఇంకా రూపొందించలేద’ని ఎస్‌డీఎంసీలో బీజేపీ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ సతీశ్ ఉపాధ్యాయ్ తెలిపారు. నగరంలోని స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ఈ విషయంలో తమవంతు సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం పంపాయని సతీశ్ తెలిపారు. ముంబైలోని పలు సంస్థలు ఇప్పటికే ఇటువంటి పద్ధతిలో ప్రభుత్వ పాఠశాలలను దత్తతకు తీసుకొని, నిర్వహిస్తున్నాయని చెప్పారు. అయితే ఢిల్లీలో మాత్రం తొలిసారిగా ఈ పథకాన్ని ఎస్‌డీఎంసీ ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
ఇదిలా ఉండగా దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 588 పాఠశాలలు ఉండగా అందులో యాభై శాతం పాఠశాలలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండి, విద్యానాణ్యత తక్కువగా ఉన్న పాఠశాలలను ఈ పథకం కింద ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కొన్ని పాఠశాలల్లో వెయ్యిమంది విద్యార్థులకు సరిపడా మౌలిక సదుపాయాలు ఉండగా అందులో కేవలం 100-150 మంది విద్యార్థులే ఉంటున్నారని, దీంతో వెచ్చించిన సొమ్ము వృథా అవుతోందని, వందశాతం వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ దత్తత పథకానికి రూపకల్పన చేశామన్నారు. కార్పొరేషన్‌కు చెందిన పాఠశాలల్లో ఒకరిద్దరు టీచర్లు మాత్రమే ఉన్న పాఠశాలలు ఎన్నో ఉన్నాయని, అటువంటి పాఠశాలలు దత్తత పథకానికి ఎంపికైతే ఆ టీచర్లను ఇతర పాఠశాలలకు బదిలీ చేస్తామని, తద్వారా మిగతా పాఠశాలల్లో కూడా విద్యానాణ్యత పెరిగే అవకాశముంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.