‘మొండి’వాళ్లను పిండేస్తాం | DMC sets target of Rs 200 crore house tax | Sakshi
Sakshi News home page

‘మొండి’వాళ్లను పిండేస్తాం

Jan 17 2014 12:14 AM | Updated on Jul 11 2019 5:12 PM

తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ) ఆస్తిపన్ను కట్టని ప్రభుత్వ సంస్థలపై దృష్టి సారించింది. ఎలాగైనా సరే వారి నుంచి రావల్సిన రూ.309 కోట్లను

 న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ) ఆస్తిపన్ను కట్టని ప్రభుత్వ సంస్థలపై దృష్టి సారించింది. ఎలాగైనా సరే వారి నుంచి రావల్సిన రూ.309 కోట్లను వసూలు చేసే దిశగా కఠిన చర్యలను తీసుకుంటోంది. ఇప్పటికే ఈ మేరకు తమ విభాగ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఈడీఎంసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సంజయ్ సూర్జన్ తెలిపారు.  ప్రైవేట్ సంస్థల నుంచి ఆస్తి పన్ను సాఫీగా వసూలవుతోందని, ఒక్క ప్రభుత్వ సంస్థల నుంచే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని తెలిపారు. ఇది తమ సంస్థకు ఆందోళన కలిగిస్తోందన్నారు. ఎన్నిసార్లు ఒత్తిడి తీసుకొచ్చినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని చెప్పారు. అవసరమైతే ఆయా సంస్థల బ్యాంక్ అకౌంట్‌లను అటాచ్‌మెంట్ చేస్తామన్న కఠిన సంకేతాలు ఇచ్చారు. ఈడీఎంసీకి ఆస్తిపన్ను చెల్లించే ప్రభుత్వ సంస్థల్లో ఢిల్లీ ట్రాన్స్‌కో లిమిటెడ్, ఢిల్లీ అభివృద్ధి సంస్థ, ఢిల్లీ పోలీసు, తపాలా కార్యాలయం, సామాజిక సంక్షేమ సంస్కార్ ఆశ్రమ్ విభాగం, మహిళా, శిశు అభివృద్ధి విభాగం తదితరులు ఉన్నాయి.  
 
 కొత్త బడ్జెట్‌పై కసరత్తు 
 ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.200 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించామని సంజయ్ సూర్జన్ తెలిపారు. తుది ముసాయిదా రూపకల్పనలో నిమగ్నమయ్యామని చెప్పారు. ఈడీఎంసీ కమిషనర్ ప్రతిపాదించిన కొత్త పన్నులకు బుధవారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదముద్ర పడలేదన్నారు. అయితే ఆస్తిపన్నులను పెంచడంపై కూడా కసరత్తు జరుగుతోందని చెప్పారు. ‘ప్రతి ఆస్తిపన్ను యజమానికి యూనిటీ ఐడెంటి కార్డుతో పాటు పాస్‌బుక్ జారీ చేయాలనుకుంటున్నాం. ఈ బుక్ ద్వారానే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామ’ని ఆయన తెలిపారు. జననాల నమోదుకు సంబంధించిన కేసుల్లో అదనపు పేర్లను చేర్చేందుకు 30 నిమిషాల ప్రత్యేక విండో సేవలను అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నామని తెలిపారు.
 
 ఆస్పత్రుల్లో జన్మించిన వారికి ఈ ప్రత్యేక విండో సేవల ద్వారా వారి జనన ధ్రువీకరణ పత్రం నేరుగా ఇంటికే పంపిస్తామన్నారు. అలాగే వివిధ ఆస్పత్రుల్లో మరణించిన వారికి మరణ ధ్రువీకరణపత్రాలు కార్పొరేషన్ సులభంగానే అందేలా జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. అలాగే వ్యాపారులు తమ లెసైన్సులను నేరుగా ఇంటి వద్దనే ఉండి పొందవచ్చని తెలిపారు. వాళ్లు కార్పొరేషన్‌కు కాల్ చేస్తే వారికి కావల్సిన పనులను మా ఒప్పంద సిబ్బంది చూసుకుంటుందన్నారు. ఈడీఎంసీ పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్‌తో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. నగరంలో పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు అందుకు స్థలాలను అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. హోర్డింగ్‌లు, గోడరాతలు తదితర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంతో పార్కింగ్ స్థలాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నామని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement