మెట్రో చార్జీలపై సందిగ్ధం | dilemma on Metro charges | Sakshi
Sakshi News home page

మెట్రో చార్జీలపై సందిగ్ధం

Apr 16 2014 10:30 PM | Updated on Oct 16 2018 5:04 PM

నగరవాసులకు త్వరలో అందుబాటులోకి రానున్న మెట్రో రైలు చార్జీలు ఎంతమేర వసూలు చేయాలనే దానిపై సందిగ్ధం కొనసాగుతోంది.

సాక్షి, ముంబై: నగరవాసులకు త్వరలో అందుబాటులోకి రానున్న  మెట్రో రైలు చార్జీలు ఎంతమేర వసూలు చేయాలనే దానిపై సందిగ్ధం కొనసాగుతోంది. దీనిపై అధికారులు ఇంకా తుది నిర్ణయానికి రాలేకపోయారు. మెట్రో కనీస చార్జీలు రూ.9, గరిష్ట చార్జీలు రూ.24 చొప్పున విధించాలంటుండగా, ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించిన రిలయన్స్ సంస్థ కనీస చార్జీ రూ.22, గరిష్ట చార్జీలు రూ.33 వసూలు చేసేలా అనుమతివ్వాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ఇటు మెట్రో అధికారులు, అటు రిలయన్స్ ప్రతినిధులు చార్జీలపై సమిష్టి నిర్ణయానికి రాలేకపోయారు. అయితే లోక్‌సభ ఎన్నికలతర్వాతే మెట్రోచార్జీల పట్టికపై స్పష్టతవచ్చే అవకాశముంది.

 వేగంగా పనులు...: ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. సాధ్యమైనంత త్వరగా ఈ రైలు సేవలు ముంబైకర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు రేయింబవళ్లు కృషి చేస్తున్నారు.  మెట్రో భద్రత సర్టిఫికెట్ జారీచేయాలని గత వారం క్రితమే దరఖాస్తు చేసుకుంది. త్వరలో మంజూరు లభించే సూచనలు కనబడుతున్నాయి. ప్రభుత్వం బెస్ట్ చార్జీల కంటే మెట్రోకు ఒకటిన్నర రేటు ఎక్కువ కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఇంత తక్కువ చార్జీలతో సేవలు అందించడం సాధ్యం కాదని రిలయన్స్ తేల్చిచెప్పింది. కనీస చార్జీలు రూ.22, గరిష్ట చార్జీలు రూ.33 వసూలుచేసేలా అనుమతివ్వాలని ప్రతిపాదించింది.

 ‘మెట్రోకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం లభించదు. బెస్ట్ చార్జీలతో ఖరీదైన మెట్రో సేవలు అందించడం సాధ్యం కాదు. బెస్ట్ కంటే నాలుగైదు రేట్లు ఎక్కువే చార్జీలు కేటాయించాల్సి ఉంటుంద’ని రిలయన్స్ స్పష్టం చేసింది. మెట్రో రైలు సేవల వల్ల ఘాట్కోపర్-వర్సోవా ప్రాంతాల మధ్య రెండు గంటల ప్రయాణ సమయం తగ్గనుంది. దీంతో ప్రజల విలువైన సమయం, డబ్బులు ఆదా కానున్నాయి. ఇతర రవాణా సాధనాలతో పోలిస్తే మెట్రో, ముంబైకర్లకు అత్యాధునిక సేవలు అందించనుంది.

అన్ని స్టేషన్లలో సీసీ కెమెరాల నిఘా, భారీ భద్రత ఉంటుంది. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తూ తక్కువ చార్జీలతో సేవలు అందించడం సాధ్యం కాదని రిలయన్స్ సంస్థ స్పష్టం చేసింది. ఈ చార్జీలు నిర్ణయించే ముందు నగర రహదారులపై తిరుగుతున్న బెస్ట్ బస్సులు, ఆటో, ట్యాక్సీల్లో కొన్ని సంవత్సరాల్లో పెరిగిన చార్జీలను కూడా పరిగణనలోకి తీసుకుంది. బెస్ట్ బస్సుల్లో 140 శాతం, ఆటోలలో 88 శాతం, ట్యాక్సీలలో 74 శాతం చార్జీలు పెరిగాయి. మెట్రో స్టేషన్ల నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగింది. ఉక్కు ధరలు 129 శాతం పెరిగిపోయాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని మెట్రో చార్జీలు నిర్ణయించినట్లు రిలయన్స్ సంస్థ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement