కాంగ్రెస్‌పై ముప్పేట దాడి | Congress muppeta attack | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌పై ముప్పేట దాడి

Jul 22 2014 2:55 AM | Updated on Mar 29 2019 9:24 PM

రాష్ట్రంలో జరగుతున్న వరుస అత్యాచారాల ఘటనలు ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. ఇదే విషయంపై శాసనమండలిలో సోమవారం ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి.

  • మండలిలో సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం
  • అత్యాచారాల ఘటన లపై విస్తృత చర్చకు విపక్షాల పట్టు
  • సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో జరగుతున్న వరుస అత్యాచారాల ఘటనలు ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. ఇదే విషయంపై శాసనమండలిలో సోమవారం ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. సభా కార్యక్రమాలు ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల సమయానికి ముందే అత్యాచారాల ఘటన లపై విస్తృత చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అయితే ఇందుకు అధికార పక్షం అంగీకరించలేదు. దీంతో సభలో బీజేపీ, జేడీఎస్‌లు కాంగ్రెస్‌పై ముప్పెటదాడికి దిగాయి. సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. దీంతో సభాపతి డీహెచ్ శంకరమూర్తి అరగంట పాటు సభను వాయిదా వేశారు.  

    ఈ సమయంలో అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లతో శంకరమూర్తి తన కార్యాలయంలో సమావేశమై చర్చించారు. ‘ప్రశ్నోత్తరాలను టేబుల్ చేస్తారు. సంబంధిత మంత్రులు మండలిలో సమాధానమివ్వరు. తర్వాత చర్చ కొనసాగుతుంది.’ (అంటే సాంకేతికంగా ప్రశ్నోత్తరాల సమయం ఉన్నట్టే. అయితే ఆ ప్రశ్నలపై సమాధానాలు ఉండవు. దీని వల్ల సభలో సమయం ఆదా అవుతుంది. అత్యాచారాలపై చర్చకు ఎక్కువ సమయం దొరుకుతుంది) అన్న విషయానికి అన్ని పార్టీల సభ్యులు అంగీకారం తెలిపారు.

    తర్వాత సభా కార్యక్రమాలు మొదలైన తర్వాత మండలి విపక్ష నాయకుడు ఈశ్వరప్ప వట్లాడుతూ... ‘ఈ సమాజంలో శునకాలపై కూడా అత్యాచారం చేసే వికృత మనస్తత్వం ఉన్నవారు ఉన్నారు. అలాంటి వారికి కఠిన శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది. అత్యాచారానికి పాల్పడిన వారు రెండు గంటల్లో బెయిల్‌పై బయటకు వస్తున్నారు. చట్టంలో ఇలాంటి లొసుగులు ఉండటం వల్లే సమాజంలో మహిళలకు, చిన్న పిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. ఈ విషయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కఠిన చట్టాలు తీసుకురావాలి. ఇందుకు పార్టీలకతీతంగా అందరి నాయకులు సహకరించాల్సిన అవసరం ఉంది.’ అని పేర్కొన్నారు.

    అనంతరం పరిషత్‌లో జేడీఎస్ ఫ్లోర్‌లీడర్ బసవరాజ హొరట్టి మాట్లాడుతూ... సరైన శిక్షలు లేకపోవడం వల్లే మహిళలపై దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. అందువల్ల పోలీసు, న్యాయశాఖలు ముందుకు వచ్చి నూతన చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విపక్ష నాయకుల వ్యాఖ్యలతో మండలిలోని సభ్యులందరూ రాజకీయ పార్టీలకతీతంగా ఏకీభవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement