ఢిల్లీలో ఈనెల 26వ తేదీన జరిగే నరేంద్రమోడీ ప్రమాణస్వీకారోత్సవానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలకు ఆహ్వానం పంపింది. సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని
చెన్నై, సాక్షి ప్రతినిధి : ఢిల్లీలో ఈనెల 26వ తేదీన జరిగే నరేంద్రమోడీ ప్రమాణస్వీకారోత్సవానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలకు ఆహ్వానం పంపింది. సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుని బీజేపీ అధికారంలోకి రావడం, ఆ పార్టీ మిత్రపక్షాల్లో కలిగిన ఆనందర అంతలోనే ఆవిరైపోయింది. తమిళులకు శత్రువుగా పరిగణిస్తున్న శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్సేను ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ ఆహ్వానించడమే ఇందు కు కారణం. గత ఏడాది శ్రీలంకలో జరిగిన కామన్వెల్త్ సమావేశాలకు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరవుతున్నట్లు తెలియగానే రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటా యి. దీంతో ప్రధాని వెనక్కుతగ్గి విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌ను పంపారు. పాక్, శ్రీలంక దేశాధ్యక్షులతోపాటూ సార్క్ దేశాధినేతలకు ఆహ్వానం పలికినట్లు బీజేపీ ప్రకటించిన రోజు నుంచే రాష్ట్రంలో తీవ్ర నిరసనలు పెల్లుబికాయి. శ్రీలం క అంశంలో ఏ మాత్రం మెతక వైఖరిని అవలంబించినా రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదు. అందుకే అన్ని పార్టీలూ పోటీపడి నిరసన ప్రకటనలను గుప్పించాయి.
రజనీకాంత్, విజయ్‌కు ఆహ్వానాలు
రాష్ట్రంలో సాగుతున్న నిరసనలతో ప్రమేయం లేకుండా బీజేపీ రాష్ట్ర శాఖ పలువురు ప్రముఖులకు ఆహ్వానం పలికింది. మోడీ మిత్రుడైన సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో విజయ్‌లకు ఆహ్వానాలు ఆందాయి. వీరిద్దరూ హాజరవుతున్నట్లు సమాచారం.
పార్టీ రాష్ట్రశాఖ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఇల గణేశన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వానతి శ్రీనివాసన్ తదితర 30 మంది ఢిల్లీకి బయలుదేరుతున్నారు. మిత్రపక్షాల అధినేతలు విజయకాంత్ (డీఎండీకే), వైగో (ఎండీఎంకే), డాక్టర్ రాందాస్ (పీఎంకే), పచ్చముత్తు (ఐజేకే), ఈశ్వరన్ (కొంగునాడు), ఏసీ షణ్ముగం (పుదియ నీది కట్చి)ను పొన్ రాధాకృష్ణన్ స్వయంగా కలిసి ఆహ్వానించారు. అయితే వీరిలో వైగో ఢిల్లీలో నల్లజెండాల నిరసన ప్రదర్శనలకు సిద్ధమయ్యూరు.
జయ హాజరీ డౌటే
రాజపక్సే రాకపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న సీఎం జయలలిత మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరుకారని తెలుస్తోంది. సహజంగా జయ ప్రయాణానికి సిద్ధమైతే రెండు రోజుల ముందుగానే భద్రతాదళం ఢిల్లీకి చేరుకుంటుంది. రాష్ట్ర సమాచార శాఖకు చెందిన ఉన్నతాధికారుల బృందం కూడా ఢిల్లీకి వెళ్లి ఏర్పాట్లు చేస్తుంది. శనివారం వరకు అధికారుల్లో కదలిక లేనందున జయ హాజరుకారని, రాష్ట్ర ప్రతినిధులుగా మంత్రులను పంపుతారని భావిస్తున్నారు.