జయ సంబరం | aiadmk leaders Celebrations | Sakshi
Sakshi News home page

జయ సంబరం

May 19 2014 11:31 PM | Updated on Mar 29 2019 9:24 PM

అనూహ్యమైన మెజారిటీని సాధించి రాష్ట్రంలో అన్నాడీఎంకే, కేంద్రంలో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మరో రెండు మూడు రోజు ల్లో ప్రధానిగా నరేంద్రమోడీ

చెన్నై, సాక్షి ప్రతినిధి:  అనూహ్యమైన మెజారిటీని సాధించి రాష్ట్రంలో అన్నాడీఎంకే, కేంద్రంలో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మరో రెండు మూడు రోజు ల్లో ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. 37మంది సభ్యులతో పార్లమెంటులో అతిపెద్ద మూడో పార్టీగా అవతరించిన అన్నాడీఎంకే సగర్వంగా ఢిల్లీకి పయనమయ్యేందుకు సన్నాహమవుతోంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో సీఎం జయలలిత సోమవారం సమావేశమయ్యూరు. పార్టీ పార్లమెంటరీ నాయకునిగా తంబిదురై, సహాయ నేతగా వేణుగోపాల్‌ను నియమించారు. జయ మూడేళ్ల పాలన పూర్తయి నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలపై చెన్నైలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. 32 జిల్లాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఏర్పాటైన ప్రదర్శనను మంత్రులు ప్రారంభించారు. భారీ విజయాన్ని సాధించిన జయకు మోడీ స్వయంగా ఫోన్‌చేసి అభినందనలు తెలపడం, రాష్ట్ర ప్రగతికి అండగా నిలుస్తానని హామీ ఇవ్వడం అన్నాడీఎంకేకు అదనపు ఆనందాన్ని ఇచ్చింది.
 
 కీచులాటలు
 అన్నాడీఎంకే శిబిరాల్లో సాగుతున్న దానికి విరుద్ధంగా మిగిలిన అన్ని పార్టీలు ఘర్షణలు, కీచులాటల్లో మునిగితేలుతున్నాయి. ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఘోర పరాజయానికి తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జ్ఞానదేశికనే కారణమంటూ పొల్లాచ్చి నుంచి పోటీచేసిన సెల్వరాజ్ సోమవారం బహిరంగంగా ధ్వజమెత్తారు. ఎన్నికల ఏర్పాట్లపై నేతలను కలవకుండా, ఎన్నికల ఖర్చుకు అధిష్టానం ఇచ్చిన నిధులను స్వాహా చేశారని ఆరోపించారు. ఆయనపై సోనియా, రాహుల్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డీఎంకేతో రహస్య సంబంధాలు నెరుపుతున్న జ్ఞానదేశికన్ వెంటనే అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
 
   ఎన్నికల ఫలితాలు డీఎంకేలోని కుటుంబ కలహాలను బాగా రాజేశాయి. డీఎంకేలో తన ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకే రాజీనామా పాచిక విసిరారని స్టాలిన్‌పై ఆయన అన్న, బహిష్కృత నేత అళగిరి విరుచుకుపడ్డారు. డీఎంకేలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని మదురైలో సోమవారం వ్యాఖ్యానించారు. అళగిరి వ్యాఖ్యలకు ఆయన తండ్రి కరుణానిధి సోమవారం చెన్నైలో ఘాటుగానే స్పందించారు. పార్టీలోనూ, కుటుంబంలోనూ అళగిరి పేరును ఏనాడో మరిచిపోయానని వ్యాఖ్యానించారు. అతను పార్టీలో ఉన్నపుడు కూడా డీఎంకే ఓడిందని ఎద్దేవా చేశారు. డీఎంకేను ఇప్పటికైనా ప్రక్షాళన చేయకుంటే పార్టీకి మనుగడే ఉండదని లక్ష్య డీఎంకే అధినేత టీ రాజేందర్ సోమవారం మీడియా సమావేశంలో హితవు పలికారు. డీఎంకేకు అధికారం పోయింది, ప్రతిపక్ష హోదా లేదు, ఇపుడు లోక్‌సభలో ప్రాతినిధ్యం కూడా కోల్పోయిందని అన్నారు. ఇప్పటికైనా కరుణ కళ్లు తెరవాలని మాజీ డీఎంకే కార్యదర్శిగా కోరుతున్నానని చెప్పారు. భరించలేని ఓటమితో ఒత్తిడికి గురైన వీసీకే నేతలు అన్నాడీంకే నేతలపై దాడికి దిగారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు చిన్నారులు సహా పలువురు గాయపడ్డారు. కడలూరుకు సమీపంలో ఉన్న వైరంకుప్పంలోని అన్నాడీఎంకే నేత తిరునావుక్కరసు అదే ప్రాంతానికి చెందిన వీసీకే పార్టీ నేత శివగురుకు మధ్య పాత కక్షలు ఉన్నాయి. డీఎంకేతో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో పోటీచేసిన వీసీకే అభ్యర్థి ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పర స్పరం దాడులకు దిగడంతో రెండు పార్టీలకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement