అన్నాడీఎంకేలో సంస్థాగత ఎన్నికల పర్వం ముగిసింది. కింది స్థాయి పదవుల్ని ఎన్నికల ద్వారా,
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సంస్థాగత ఎన్నికల పర్వం ముగిసింది. కింది స్థాయి పదవుల్ని ఎన్నికల ద్వారా, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పదవుల నియామకాలు అధినేత్రి జయలలిత ఆదేశాల మేరకు ఏక గ్రీవంగా సాగాయి. ఈ ప్రక్రియ ముగియడంతో రాష్ట్ర కమిటీని రెండు రోజుల క్రితం అధికార పూర్వకంగా అన్నాడీఎంకే కార్యాలయం వర్గాలు ప్రకటించాయి. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయలలిత మళ్లీ ఎన్నికయ్యారు.
అలాగే పార్టీ ప్రిసీడియం చైర్మన్, కోశాధికారి, క్రమశిక్షణా సంఘం సభ్యులు, నిర్వాహక కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులతో కూడిన జాబితా విడుదల అయింది. కొత్తగా నియమితులైన వారందరూ బుధవారం చెన్నైకు చేరుకున్నారు. ఆయా జిల్లాల నుంచి తరలి వచ్చిన ఈ నాయకులు ఉదయాన్నే పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కారు. సీఎం జయలలిత ఆశీస్సుల్ని అందుకుంటూ పుష్పగుచ్ఛాలను అందజేశారు. కొత్త కమిటీ వర్గాలకు జయలలిత శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఈ కమిటీతో అధినేత్రి భేటీ అయ్యారు. వరద బాధిత ప్రాంతాల్లో సాగుతున్న సహాయక చర్యలు, బాధితుల్ని ఆదుకునే విధంగా వారికి అండగా ఉంటూ పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించి ఉన్నారు. ప్రజల్లో నిత్యం ఉంటూ, పార్టీ వర్గాలకు అందుబాటులో ఉంటూ, పార్టీ పరంగా కార్యక్రమాల్ని విస్తృతం చేయాలని సూచించారు. ప్రజాకర్షణే లక్ష్యంగా ప్రభుత్వ ప్రగతిని చాటే రీతిలో కార్యకర్తలను వేగవంతం చేయడంతోపాటుగా రానున్న ఎన్నికల ద్వారా మళ్లీ అధికారం లక్ష్యంగా పయనం సాగించాలని పిలుపునిచ్చి ఉన్నారు. చివరగా జయలలితతో కొత్త కమిటీ గ్రూప్ ఫొటో దిగింది.
జయలలిత ఆశీస్సుల్ని అందుకున్న వారిలో పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా మధుసూదనన్, కోశాధికారిగా ఓ పన్నీరు సెల్వం, క్రమ శిక్షణా కమిటీ సభ్యులు నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడపాడి పళనిస్వామి, పళనియప్పన్, నిర్వాహక కార్యదర్శులుగా పొన్నయ్యన్, విశాలాక్షి నెడుంజెలియన్, ఎస్ బన్రూటి రామచంద్రన్, సెమ్మలై, గోకుల ఇందిర, ఏకే సెల్వరాజ్, ఎస్ రాజు, పాపాసుందరం, కే గోపాల్, ఎస్ వలర్మతి, జె.జయసింగ్ త్యాగరాజ్ నటర్జీ, ఎంజీయార్ మండ్ర కార్యదర్శిగా తమిళ్ మగన్ హుస్సేన్, ప్రచార కార్యదర్శి తంబిదురై, సహాయ ప్రచార కార్యదర్శిగా నాంజిల్ సంపత్‌లతోపాటుగా అనుబంధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు ఉన్నారు.