ఇంగ్లండ్‌... ఇప్పుడైనా!

 World Cup offers England golden shot at rejuvenation  - Sakshi

పటిష్టంగా ఆతిథ్య జట్టు

బ్యాటింగ్‌లో దుర్బేధ్యం

అండగా ఆల్‌రౌండర్ల బలం

సొంతగడ్డ సానుకూలత

జెంటిల్మన్‌ క్రీడకు పుట్టిల్లు...వన్డే ప్రపంచ కప్‌ పురుడు పోసుకున్న నేల..  క్రికెట్‌ మక్కా ‘లార్డ్స్‌’ మైదానం కొలువైనదీ అక్కడే! అయినా, ఇంగ్లండ్‌కు ప్రపంచ కప్‌ తీరని కలే! మూడుసార్లు ఫైనల్‌ వరకు వచ్చినా కిరీటం అందినట్టే అంది చేజారింది. ఇదంతా గతం. ఇప్పుడు మాత్రం దుర్బేధ్య బ్యాటింగ్‌ లైనప్, అందుకుతగ్గ బౌలింగ్‌ బలగం, నాణ్యమైన ఆల్‌ రౌండర్లతో ఆతిథ్య దేశం అత్యంత బలంగా ఉంది.ప్రత్యర్థులకు దడ పుట్టించే ఆటతో ఎన్నడూ లేనంత ధీమాగా బరిలో దిగుతోంది. ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యంలోని  ఈ జట్టుకు ‘విపరీతమైన అంచనాల ఒత్తిడి’ ప్రధాన ముప్పు.  ఆ ఒక్కదాన్నీ అధిగమిస్తే చిరకాల వాంఛ నెరవేరినట్లే!  

సాక్షి క్రీడా విభాగం: వన్డేల్లో నంబర్‌వన్, హాట్‌ ఫేవరెట్, ఆతిథ్యం... బహుశా ఇన్ని సానుకూలతలతో ఇంగ్లండ్‌ ఎప్పుడూ ప్రపంచ కప్‌ బరిలో దిగి ఉండకపోవచ్చు. చుట్టూ సానుకూల వాతావరణంలో మోర్గాన్‌ సేన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. వన్డేల్లో నమోదైన చివరి 400పైగా స్కోర్లలో నాలుగు ఇంగ్లండ్‌వే అంటేనే ఆ జట్టు భీకర ఫామ్‌ను అర్థం చేసుకోవచ్చు. విధ్వంసక బ్యాట్స్‌మన్‌ అలెక్స్‌ హేల్స్‌ దూరమైనా... ఒక్క శాతం కూడా బలహీనపడ్డట్లు కనిపించకపోవడమే ఆతిథ్య దేశం ఎంత పటిష్టంగా ఉందో తెలుపుతోంది. అయితే, దీని వెనుక నాలుగేళ్ల సంస్కరణల కృషి ఉంది. గత కప్‌లో దారుణ వైఫల్యంతో గ్రూప్‌ దశలోనే వెనుదిరగడం వారి కళ్లు తెరిపించింది. కొందరు ఆటగాళ్లనూ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టి... ఆద్యంతం దూకుడు కనబరిచేవారిని ఎంచుకోవడం మంచి ఫలితాన్నిచ్చింది. ఈ ప్రయోగాలన్నీ విజయవంతమైనట్లు ద్వైపాక్షిక సిరీస్‌ల ద్వారా తే లింది. మరి ప్రపంచకప్‌లో ఏమౌతుందో చూడాలి.

ఆతిథ్యం ఐదోసారి...
ప్రపంచ కప్‌కు అత్యధికంగా ఐదోసారి ఆతిథ్యం ఇస్తోంది ఇంగ్లండ్‌. ఇక్కడే జరిగిన 1975 కప్‌లో సెమీస్‌కు, 1979లో ఫైనల్‌కు, 1983లో సెమీస్‌కు చేరింది. తర్వాతి రెండు కప్‌ల (1987, 1992)లో రన్నరప్‌గా నిలిచింది. మెగా టోర్నీలో ఇక్కడి నుంచి జట్టు ప్రదర్శన పడిపోయింది. భారత్‌ ఆతిథ్యమిచ్చిన 1996 కప్‌లో క్వార్టర్స్‌ వరకు చేరగలిగినా... సొంతగడ్డపై జరిగిన 1999 కప్‌లో గ్రూప్‌ దశ కూడా దాటలేదు. 2003లో గ్రూప్, 2007లో సూపర్‌–8, 2011లో క్వార్టర్స్, 2015లో గ్రూప్‌ దశతోనే సరిపెట్టుకుంది.

బలాలు
జేసన్‌ రాయ్, బెయిర్‌స్టో, జో రూట్‌ల టాపార్డర్‌... కెప్టెన్‌ మోర్గాన్, జాస్‌ బట్లర్, పేస్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌తో కూడిన బ్యాటింగ్‌ లైనపే ఇంగ్లండ్‌ బలం. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగల సమర్థుడు. జట్టు గెలిచిన కొన్ని సిరీస్‌లను చూస్తే... భారత్‌పై రూట్, బెయిర్‌స్టో, శ్రీలంకపై మోర్గాన్, బట్లర్‌ ఇలా ఇద్దరేసి బ్యాట్స్‌మెన్‌ కీలక పాత్ర పోషించారు. మిగతావారు విజయానికి కావాల్సిన ముగింపు ఇచ్చారు. రాయ్, బెయిర్‌స్టో విధ్వంసక ఆరంభాన్నిస్తే... రూట్, మోర్గాన్‌ మధ్య ఓవర్లలో ఇన్నింగ్స్‌ను నడిపిస్తారు. తర్వాత సంగతిని ఫటాఫట్‌ షాట్‌లతో బట్లర్‌ చూసుకుంటాడు. రెండేళ్లుగా బీభత్సమైన ఫామ్‌లో ఉన్న అతడు ఇటీవల పాకిస్తాన్‌తో సిరీస్‌లో 50 బంతుల్లోనే సెంచరీ బాదాడు.

ఫిబ్రవరిలో వెస్టిండీస్‌పై 77 బంతుల్లో 150 మార్క్‌ను అందుకున్నాడు. బౌండరీలతో చకచకా పరుగులు రాబడుతూ సెంచరీలపై సెంచరీలతో బెయిర్‌స్టో ఏడాదిన్నరగా నిలకడకు మారుపేరుగా నిలుస్తున్నాడు. తాజాగా ఐపీఎల్‌లోనూ రాణించాడు. రషీద్, అలీలతో స్పిన్‌ వైవిధ్యంగా కనిపిస్తోంది. నిరుడు తమ దేశంలో పర్యటించిన ఆస్ట్రేలియా, భారత్‌లకు వీరి నుంచే పెద్ద సవాలు ఎదురైంది. ముఖ్యంగా రషీద్‌... లంక, వెస్టిండీస్‌లోనూ వికెట్లు తీశాడు. గత కప్‌నకు ముందు అనూహ్యంగా పగ్గాలు చేపట్టిన మోర్గాన్‌... ఈసారి సారథిగా, బ్యాట్స్‌మన్‌గా పరిణతి సాధించాడు. వీరందరి తోడుగా భారీ లక్ష్యాలను విధిస్తున్న ఇంగ్లండ్, అంతే తేలిగ్గా పెద్ద స్కోర్లనూ ఛేదిస్తోంది.

బలహీనతలు
నిఖార్సైన పేసర్‌ లేకపోవడం ఇంగ్లండ్‌ లోటు. క్రిస్‌ వోక్స్, మార్క్‌ వుడ్‌ ప్రత్యర్థులను కట్టిపడేసేంత స్థాయి ఉన్నవారు కాదు. అందుకే మంచి లయతో బంతులేసే జోఫ్రా ఆర్చర్‌ను తీసుకున్నారు. స్టోక్స్‌ బౌలింగ్‌ కూడా ప్రభావవం తంగా లేదు. దీనికితోడు గాయాల బెడద. కెప్టెన్‌ మోర్గాన్‌ వేలికి దెబ్బ తగలడంతో ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడలేదు. ఇదే మ్యాచ్‌లో వుడ్‌ ఎడమ కాలు ఇబ్బంది పెట్టడంతో స్కానింగ్‌కు వెళ్లాడు.

సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆర్చర్‌ ఆ వెంటనే బంతిని ఆపే యత్నంలో తడబడి మైదానం వీడాడు. ఎడంచేతి స్పిన్నర్‌ లియామ్‌ డాసన్‌ వేలి గాయం, రషీద్‌ భుజం నొప్పి, వోక్స్‌ మోకాలి సమస్యలు సైతం జట్టును కలవరపెట్టేవే. బహుళ దేశాల ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఒత్తిడి పెద్ద శత్రువు. ఈ ప్రభావం సొంత గడ్డపై ఇంగ్లండ్‌కు మరింత ఎక్కువ. రెండేళ్ల క్రితం తమ దగ్గరే వన్డే ఫార్మాట్‌లో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీలో దాదాపు ఇదే జట్టు ఆడినా ఫైనల్‌ చేరడంలో విఫలమైన సంగతి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top