నన్ను మాత్రం నమ్ముకోవద్దు: కోహ్లి

Virat Kohli Has Special Message for Fans Looking for Passes India vs Pakistan  - Sakshi

‘జీవితకాలం సాగే మ్యాచ్‌ కాదు’

మాంచెస్టర్‌: భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ కోసం టికెట్లు అడుగుతున్న స్నేహితులు,బంధువులు తనని నమ్ముకోవద్దని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సూచించాడు. అవకాశం ఉంటే ఇంగ్లండ్‌ వచ్చి మ్యాచ్‌ చూడాలని, లేదంటే ఇంట్లో కూర్చొని టీవీలో ఆస్వాదించాలని సలహా ఇచ్చాడు. పాకిస్తాన్‌ మ్యాచ్‌ నేపథ్యంలో కోహ్లి శనివారం మీడియాతో మాట్లాడాడు.

‘అన్ని మ్యాచ్‌లలాగే ఇది కూడా నిర్ణీత సమయానికి మొదలై నిర్ణీత సమయానికి ముగుస్తుంది. బాగా ఆడినా, ఆడకపోయినా ఇదేమీ జీవితకాలం సాగదు. ఈ మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉన్నా అదే ముగింపు కాదు. టోర్నమెంట్‌ ఇంకా మిగిలే ఉంది. ఏ ఒక్కరి మీదో ఒత్తిడి ఉండదు. పదకొండు మందీ బాధ్యత పంచుకుంటారు. వాతావరణం మన చేతుల్లో లేదు కాబట్టి అన్నింటికి సిద్ధంగా ఉండాలి. టీవీ రేటింగ్స్‌కు పనికొచ్చే ఆసక్తికర వ్యాఖ్యలు నేనేమీ చేయను. నాకు ఏ బౌలరైనా ఒకరే. ఆడేటప్పుడు నేను బంతిని మాత్రమే చూస్తాను.

అయితే నేను ప్రతీ బౌలర్‌ ప్రతిభను గౌరవిస్తాను. దానిని గుర్తించి ఆడతాను. అభిమానులూ... మ్యాచ్‌ను చూడండి, చూసి ఆనందించండి. ఇది కేవలం క్రికెట్‌ మాత్రమే. ఈ మ్యాచ్‌ కోసం నన్ను టికెట్లు అడుగుతున్న స్నేహితులు, బంధువులకు ఒకటే మాట చెబుతున్నా. టికెట్ల కోసం నన్ను మాత్రం నమ్ముకోవద్దు. మీకు అవకాశం ఉంటే వచ్చి మ్యాచ్‌ చూడండి. లేదంటే ఇంట్లో కూర్చొని టీవీలో చూడండి. మీ అందరి ఇళ్లలో చాలా మంచి టీవీలు ఉండే ఉంటాయి. నేను ఒకసారి టికెట్లు ఇవ్వడం మొదలు పెడితే దానికి అంతు ఉండదు. అందుకే అలా మొదలు పెట్టదల్చుకోలేదు.’  కోహ్లి చెప్పుకొచ్చాడు. యావత్‌ క్రికెట్‌ ప్రపంచంలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ప్రత్యేకం. రెండు దాయదీ దేశాలు ఈ మ్యాచ్‌ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాయి. కానీ వరుణుడు కరుణిస్తేనే మరి కొద్ది గంటల్లో మ్యాచ్‌ ఆరంభమవుతోంది. అభిమానులకు కావాల్సిన మజా లభిస్తోంది. ఇక విశ్వవేదికపై ఇప్పటి వరకు జరిగిన దాయాదీ పోరులో భారతే పైచేయిసాధించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top