తల్లి ఒలింపిక్స్ కలను కొడుకు సాకారం చేశాడు! | Sakshi
Sakshi News home page

తల్లి ఒలింపిక్స్ కలను కొడుకు సాకారం చేశాడు!

Published Fri, Aug 19 2016 9:32 AM

తల్లి ఒలింపిక్స్ కలను కొడుకు సాకారం చేశాడు!

రియో: రియో ఒలింపిక్స్‌లో దక్షిణాఫ్రికా యువ సంచలనం వాన్ నికెర్క్ స్వర్ణం సాధించాడు. ప్రతిష్టాత్మకమైన 400 మీటర్స్ రన్నింగ్‌లో 43.03 సెకన్ల టైంమింగ్‌తో ప్రపంచ రికార్డ్ నెలకొల్పి మరీ ఈ విజయం సాధించాడు. నికెర్క్ ప్రదర్శనకు జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ సైతం ముగ్ధుడయ్యాడంటే నికెర్క్ ప్రదర్శన ఎంత అసాధారణమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అయితే ఈ విజయం నికెర్క్కు అంత సులభంగా రాలేదు. దాని వెనుక అతడి తల్లి ఒడెస స్వాట్స్ బలమైన సంకల్పం ఉంది. స్వతహాగా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అయిన స్వాట్స్ ఒలింపిక్స్ గురించి కలలుకన్నా.. ఆనాడు దేశంలో అధికారికంగా అమలులో ఉన్న వర్ణవివక్షత(అపార్థిడ్) మూలంగా.. కనీసం జాతీయ స్థాయిలో పోటీపడే అవకాశం కూడా దక్కలేదు. అయితే ఆమె తన కొడుకు నికెర్క్ ద్వారా ఆమె ఒలింపిక్స్ కలను సాకారం చేసుకుంది.

'నికెర్క్ నెలలు నిండకుండానే(29 వారాలకే) పుట్టడంతో డాక్టర్లు అసలు బ్రతుకుతాడో లేదో అనే సందేహం వ్యక్తం చేశారు. 24 గంటలు గడిస్తేగానీ ఏం చెప్పలేమని తెలిపారు. బ్రతికినా అంగవైకల్యం ఏర్పడే ప్రమాదముందన్నారు' అని స్వాట్ చెప్పుకొచ్చింది. అలాంటి తన కొడుకు నేడు ప్రపంచ వేదికపై నిల్చున్నాడని సంతోషం వ్యక్తం చేసింది. విజయం సాధించిన నికెర్క్‌తో పాటు తల్లి స్వాట్‌పై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.

Advertisement
Advertisement