స్మిత్‌.. నువ్వు ఏం చేశావో తెలుసు?

Steve Smith Mocked By New Zealand Fans - Sakshi

మెల్‌బోర్న్‌: ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ తన రీఎంట్రీ తర్వాత  పరుగుల మోత మోగిస్తున్నా గతేడాది బాల్‌ ట్యాంపరింగ్‌ పాల్పడిన వివాదం మాత్రం అతన్ని వదలడం లేదు. ఏ దేశం తరఫున మ్యాచ్‌ ఆడుతున్నా ప్రత్యర్థి జట్టుకు సంబంధించి అభిమానులు ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ స్మిత్‌కు కుదురులేకుండా చేస్తున్నారు. ఆ ట్యాంపరింగ్‌ వివాదాన్ని అటు నోటితోనూ ఇటు ఫ్లకార్డుల ద్వారా ప్రదర్శిస్తూ స్మిత్‌ను మరింత రెచ్చగొడుతున్నారు. తాజాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో ఆరంభమూన తొలి టెస్టులో స్మిత్‌కు ఈ తరహా అనుభవం మరోసారి ఎదురైంది. తొలి రోజు ఆటలో స్మిత్‌ మైదానంలోకి వెళుతున్నప్పుడు,బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు కూడా గత వివాదాన్ని వేలెత్తి చూపుతున్నారు. (ఇక్కడ చదవండి: స్టీవ్‌ స్మిత్‌ మరోసారి రచ్చరచ్చ)

స్మిత్‌ ఏడుస్తున్న ప్లకార్డును ఒక అభిమాని ప్రదర్శించగా,  స్మిత్‌.. గత సమ్మర్‌లో ఏం చేశావో మాకు తెలుసు అంటూ మరొక ప్లకార్డు దర్శనిమిచ్చింది. అయితే దీన్ని స్మిత్‌ తేలిగ్గా తీసుకోవడం తప్పితే ఏమీ చేయలేని పరిస్థితి. దీనిపై స్మిత్‌ మాట్లాడుతూ.. ‘ అసలు ఏం జరిగిందో నాకు తెలీదు. ఈ విషయంలో నాకు ఎటువంటి ఆలోచన కూడా లేదు. నేను బ్యాటింగ్‌కు వస్తున్నప్పుడు వారు(న్యూజిలాండ్‌ అభిమానులు) ఏమన్నారు నేను నిజంగానే వినలేదు’ అని తెలిపాడు. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌లు ట్యాంపరింగ్‌ ఆరోపణలతో నిషేధాన్ని ఎదుర్కొన్నారు. స్మిత్‌, వార్నర్‌లపై ఏడాది నిషేధం పడగా, అది వరల్డ్‌కప్‌కు ముందు ముగిసింది.

ఇక తన ఆలోచన అంతా ఆసీస్‌ను పటిష్ట స్థితిలో నిలపడంపైనే ఉందన్నాడు. మరిన్ని పరుగులు సాధించడమే తమ గేమ్‌ ప్లాన్‌లో భాగమన్నాడు. రేపటి ఆటలో మరొక మంచి భాగస్వామ్యం నెలకొల్పడంపై దృష్టి పెడతానని స్మిత్‌ పేర్కొన్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. స్మిత్‌ 77 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. అంతకముందు లబూషేన్‌(63) హాఫ్‌ సెంచరీ సాధించాడు. డేవిడ్‌ వార్నర్‌(41) ఫర్వాలేదనిపించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top