బలం, బలగం కోహ్లినే..! | special story to royal challengers bangalore team | Sakshi
Sakshi News home page

కోహ్లి...ఈసారైనా?

Apr 1 2018 12:44 AM | Updated on Apr 1 2018 9:52 AM

special story to royal challengers bangalore team - Sakshi

కోహ్లి ,డివిలియర్స్

‘అన్నీ ఉన్నా... అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా మారింది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు పరిస్థితి. టి20లకే సాటి అయిన సమర్థులున్న ఆ జట్టు... పదేళ్లు కష్టపడినా ఒక్కసారి కూడా టైటిల్‌ను పట్టలేకపోయింది. మూడుసార్లు ఫైనల్‌కు చేరినా రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు గొప్ప విజయాలు అందిస్తూ ఆటగాడిగా, నాయకుడిగా కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆటగాళ్లతో పాటు ఆటతీరు, అదృష్టం కలిసి రావాలని... ముఖ్యంగా ఈ సీజన్‌లో తమ తడాఖా చూపించాలని కోహ్లి బృందం తహతహలాడుతోంది. మరి ఈ పట్టుదల టైటిల్‌ను చేతికందిస్తుందో లేదో చూడాలంటే రెండు నెలలు వేచి చూడాలి.  

సాక్షి క్రీడా విభాగం :కోహ్లి, డివిలియర్స్‌... గేల్, వాట్సన్‌ (వీళ్లిద్దరు ఇప్పుడు లేరు) ఏదో ఓ రోజు ఆడే గాలివాటం హిట్టర్లు కానే కాదు. ఒక్క ఓవర్లోనే మ్యాచ్‌ గతిని మార్చేసే ఘనులు. ఇంతటి హేమా హేమీలున్న బెంగళూరుకు అదృష్టం కలిసిరాలేదో లేక  దురదృష్టం తిష్టవేసిందో గానీ ఇప్పటిదాకా ఒక్కసారీ చాంపియన్‌ కాలేకపోయింది. గత కొన్నేళ్లుగా కోహ్లి భారత క్రికెట్‌లోనే కాదు... ప్రపంచ క్రికెట్‌లోనే అసాధారణ బ్యాట్స్‌ మన్‌గా కితాబు అందుకుంటున్నాడు. టి20, వన్డే, టెస్టు ఇలా ఫార్మాట్‌ ఏదైనా అతనే బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అని విమర్శకులు సైతం అంగీకరిస్తారు. అలాంటి నాయకుడున్న జట్టును టైటిల్‌ లేమి కలవరపెడుతోంది. ఇక ఈ సీజన్‌లోనైనా దురదృష్టానికి చెక్‌ పెట్టి అదృష్టాన్ని నిలకడైన విజయాలతో అందుకుందామని రాయల్‌ చాలెంజర్స్‌ ఆశిస్తోంది. జట్టు ఇప్పుడు భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. అయితే ఎవరి బలం ఎంతో... బలహీనత ఎక్కడుందో ఓ సారి పరిశీలిద్దాం. 

ఆ మూడు సార్లు గెలిచివుంటే... 
తొలి సీజన్‌లో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచిన బెంగళూరు రెండో సీజన్‌లోనే పుంజుకుని టైటిల్‌ బరిలో నిలిచింది. కానీ దక్కన్‌ చార్జర్స్‌ (ఇప్పుడు లేదు) చేతిలో ఓడింది. మళ్లీ 2011లో టైటిల్‌ కోసం పోరాడినా... చెన్నై చెక్‌ పెట్టింది. ముచ్చటగా మూడోసారి 2016లో తుదిపోరులో నిలిచింది. కోహ్లి, గేల్‌ అరివీర భయంకర ఫామ్‌లో ఉండటంతో ఆ సీజన్‌ లో టైటిల్‌ బెంగళూరుకే ఖాయమన్నారు. కానీ అంతిమ సమరంలో సన్‌రైజర్స్‌ చేతిలో చతికిలబడింది. ఇలా మూడుసార్లు ఓటమి బదులు గెలిచివుంటే ఒక ఏడాది (2017) ముందే ముంబై ఇండియన్స్‌ లిఖించిన అత్యధిక టైటిళ్ల రికార్డు బెంగళూరు ఖాతాలో ఉండేది.  

మరి ఇప్పటి సంగతి... 
కోహ్లి సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఫ్రాంచైజీ యాజమాన్యం అతనితో పాటు డివిలియర్స్‌ను, యువ బ్యాట్స్‌మన్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ను అట్టిపెట్టుకుంది. ఎదురుదాడికి దిగే బ్రెండన్‌ మెకల్లమ్, క్వింటన్‌ డికాక్‌లను వేలంలో కొనుగోలు చేసింది. ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌పై భారీ ఆశలు పెట్టుకున్న యాజమాన్యం వేలంలో రూ. 7.4 కోట్లు వెచ్చించి మరీ జట్టులోకి తీసుకుంది. బ్యాటింగ్‌ బలం పెంచుకుంది. ఆల్‌రౌండర్లు వాషింగ్టన్‌ సుందర్, మొయిన్‌ అలీ, కోరే అండర్సన్, గ్రాండ్‌హోమ్‌ల చేరికతో జట్టు పటిష్టంగా కనబడుతోంది. బౌలర్లు ఉమేశ్, చహల్, నవదీప్‌ సైని, హైదరాబాదీ పేసర్‌ సిరాజ్, టిమ్‌ సౌతీలతో ఓవరాల్‌గా జట్టు సమతుల్యంగా ఉంది. అందరు ఆశించిన మేర రాణిస్తే ఈ సీజన్‌లో కోహ్లి ట్రోఫీ అందుకునే క్షణాలను క్రికెట్‌ ప్రేమికులు కన్నుల పండువగా చూడొచ్చు.  

బలం, బలగం కోహ్లినే... 
ఇందులో ఎలాంటి సందేహం లేదు. జట్టు బలం, బలగం నాయకుడు కోహ్లినే. పైగా అతను వివాçహానంతర సెలవుల్లో సేద తీరుతున్నాడు. కచ్చితంగా తాజాతాజాగా ఈ సీజన్‌ను ఆరంభిస్తాడు. అదరగొడతాడు. డౌటే లేదు. అయితే భారాన్ని, బాధ్యతని తనొక్కడే వేసుకోవడం కంటే ప్రత్యర్థి బలాబలాలను విశ్లేషించుకొని మ్యాచ్‌ మ్యాచ్‌కు స్థిరమైన జట్టు కూర్పు చేయాలి. బ్యాటింగ్‌లో డివిలియర్స్‌తో పాటు మెకల్లమ్, అండర్సన్‌ మెరుపులు మెరిపిస్తే జట్టు పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం ప్రత్యర్థి బౌలర్లకు అసాధ్యమే అవుతుంది. 

జట్టు: కోహ్లి (కెప్టెన్‌), డివిలియర్స్, సర్ఫరాజ్‌ ఖాన్, మెకల్లమ్, మన్‌దీప్, కోరే అండర్సన్, వోక్స్, గ్రాండ్‌హోమ్, మొయిన్‌ అలీ, డికాక్, ఉమేశ్, చహల్, వాషింగ్టన్‌ సుందర్, పవన్‌ నేగి, పార్థివ్, సిరాజ్, టిమ్‌ సౌతీ, మనన్‌ వోహ్రా, కుల్వంత్‌ కెజ్రోలియా, అనికేత్, నవదీప్‌ సైని, మురుగన్‌ అశ్విన్, అనిరుధ జోషి, పవన్‌ దేశ్‌పాండే.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement