క్వార్టర్స్‌లో సింధు, గురుసాయిదత్ | Sindhu, Guru reach quarterfinals of Asian Badminton Championship | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సింధు, గురుసాయిదత్

Apr 25 2014 1:39 AM | Updated on Sep 2 2017 6:28 AM

క్వార్టర్స్‌లో సింధు, గురుసాయిదత్

క్వార్టర్స్‌లో సింధు, గురుసాయిదత్

భారత బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధు... ఆసియా చాంపియన్‌షిప్‌లో దూసుకెళ్తోంది. మహిళల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుని సత్తా చాటింది.

 జ్వాల జోడి కూడా...
 కశ్యప్‌కు చుక్కెదురు
 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
 
 గిమ్‌చియోన్ (కొరియా): భారత బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధు... ఆసియా చాంపియన్‌షిప్‌లో దూసుకెళ్తోంది. మహిళల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుని సత్తా చాటింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 14-21, 21-13, 21-18తో హిరోస్ ఎరికో (జపాన్)పై విజయం సాధించింది. గంటా 13 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి తొలి గేమ్‌లో ఓడినా... మిగతా రెండు గేమ్‌ల్లో స్థాయి మేరకు రాణించింది. క్వార్టర్స్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్ బుసానన్ ఆంగ్‌బుమ్రాంగపన్ (థాయ్‌లాండ్)తో సింధు తలపడుతుంది. గతంలో ఈమెతో తలపడిన రెండుసార్లూ ఏపీ అమ్మాయి పైచేయి సాధించింది.
 
 పురుషుల సింగిల్స్‌లో చాలా కాలం తర్వాత ప్రపంచ 38వ ర్యాంకర్ ఆర్.ఎం.వి. గురుసాయిదత్ జోరు కనబర్చాడు. ప్రిక్వార్టర్స్‌లో అతను 17-21, 21-13, 21-19తో వాంగ్ జూ వీ (చైనీస్ తైపీ)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏపీ కుర్రాడు చాలా ఓపికగా ఆడాడు. తొలి గేమ్ ఓడిన తర్వాత రెండో గేమ్‌లోనూ 3-7తో వెనుకబడ్డాడు. కానీ నెట్ వద్ద భిన్నమైన ఆటతీరుతో అదరగొట్టాడు. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ ప్రత్యర్థిని అలసిపోయేలా చేసి తర్వాత బలమైన స్ట్రోక్స్‌తో వరుసగా పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో పారుపల్లి కశ్యప్ 23-25, 17-21తో సు జెన్ హో (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడాడు.
 మహిళల డబుల్స్‌లో జ్వాల గుత్తా-అశ్విని పొనప్ప జోడి (భారత్) 21-11, 21-18తో డుంగానోంగ్-కుంచాల ఉర్విచెత్‌చైకుల్ (థాయ్‌లాండ్)పై గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement