ఆఫ్రిది.. నువ్వు రాజకీయ నాయకుడివి కాదు! | Shahid Afridi should behave like a cricketer, not politician | Sakshi
Sakshi News home page

ఆఫ్రిది.. నువ్వు రాజకీయ నాయకుడివి కాదు!

Mar 26 2016 10:18 AM | Updated on Sep 3 2017 8:38 PM

ఆఫ్రిది.. నువ్వు రాజకీయ నాయకుడివి కాదు!

ఆఫ్రిది.. నువ్వు రాజకీయ నాయకుడివి కాదు!

భారత పర్యటనలో షాహిద్ ఆఫ్రది ప్రవర్తన మరీ విచిత్రంగా ఉంది.

భారత పర్యటనలో షాహిద్ ఆఫ్రది ప్రవర్తన మరీ విచిత్రంగా ఉంది. అనేక కొర్రీలు పెట్టి, భద్రత అంటూ సాకులు చూపి.. టీ20 వరల్డ్‌కప్‌లో ఆడేందుకు పాకిస్థాన్‌ జట్టు భారత్‌కు వచ్చింది. ధర్మశాలలోని మ్యాచ్‌ను పట్టుబట్టి కోల్‌కతాకు బదలాయించుకుంది. ఇంతచేసి దాయాది భారత్‌ చేతిలో కంగుతింది. మరో రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి మూటగట్టుకుంది. ఈ క్రమంలో ఇంటికి తిరిగివెళ్తున్న ఆ జట్టు భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించుకునే దిశగా సంకేతాలు పంపుతుందని అంతా భావించారు.   
 
కానీ, అందుకు భిన్నంగా పాక్‌ జట్టు సారథి షాహిద్‌ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలతో తమ పర్యటనను ముగించాడు. ఇరుదేశాల మధ్య ఎంతో భావోద్వేగమైన సరిహద్దు అంశమైన కశ్మీర్‌ అంశాన్ని ఆఫ్రిది రెండుసార్లు ప్రస్తావించాడు. మొహలీలో మొన్న న్యూజిల్యాండ్ మ్యాచ్‌ సందర్భంగా.. తాజాగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. పాక్‌ జట్టుకు మద్దతు తెలుపాడనికి కశ్మీర్‌ నుంచి భారీగా ప్రజలు వచ్చారంటూ అతను చెప్పుకొచ్చాడు.

న్యూజిల్యాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా కామెంటేటర్‌, పాక్ మాజీ క్రికెటర్ రమీజ్‌ రజా ఆఫ్రిదితో మాట్లాడుతూ.. 'మాకు మద్దతుగా కశ్మీర్‌ నుంచి కూడా చాలామంది ప్రజలు వచ్చారు. ఇక కోల్‌కతా ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. వారు కూడా మద్దతు తెలిపారు' అని ఆఫ్రిది పేర్కొన్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా తమ జట్టుకు మద్దతుగా నిలిచిన కశ్మీర్ అభిమానులకు అతను కృతజ్ఞతలు తెలిపాడు.

పాకిస్థాన్‌లో కన్నా భారత్‌లోనే తమకు ఎక్కువ అభిమానం లభిస్తుందని అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే స్వదేశంలో పెద్ద వివాదాన్ని రేపాయి. దీనికితోడు భారత్ చేతిలో పాక్ జట్టు ఘోరంగా ఓడటం కూడా అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రేపోమాపో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి అతను రిటైర్మెంట్ తీసుకుంటాడని వినిపిస్తోంది. ఈ పరిణామాల నడుమ స్వదేశంలో అతనికి నిరసనలతో స్వాగతం ఎదురయ్యే అవకాశముంది. ఈ నిరసనలను, వ్యతిరేకతను తప్పించుకోవడానికి అతను రాజకీయ అంశమైన కశ్మీర్‌ను పదేపదే ప్రస్తావించాడని పరిశీలకులు అంటున్నారు. అతడి వ్యాఖ్యలపై ఎంతగా విమర్శలు చేస్తున్నా.. ఆఫ్రిది తీరు మారకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, వారు రాజకీయ వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని, అలా చేయకపోవడం వల్లే ఆఫ్రిది స్వదేశంలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నాడని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. ఆఫ్రిది రాజకీయ నాయకుడు కాదని, ఆయన క్రికెటర్‌గా మసులుకుంటే మంచిదని మాజీ క్రికెటర్లు, నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement