కెరీర్‌ బెస్ట్‌ 17వ ర్యాంకులో రోహిత్‌

Rohit Sharma Attains Career-Best Ranking - Sakshi

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌

దుబాయ్‌: భారత ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ టెస్టుల్లో కెరీర్‌ బెస్ట్‌ 17వ ర్యాంక్‌కు ఎగబాకాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో అతను 36 స్థానాల్ని మెరుగుపర్చుకొని 17వ ర్యాంకుకు చేరుకున్నాడు. వైజాగ్‌ టెస్టులో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇతనికి జోడీగా ఆడిన మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ర్యాంకూ మెరుగైంది. అతను 38 స్థానాల్ని మెరుగుపర్చుకొని కెరీర్‌ బెస్ట్‌ 25వ ర్యాంకులో నిలిచాడు.

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెండో స్థానంలోనే కొనసాగుతున్నప్పటికీ 900 రేటింగ్‌ పాయింట్ల దిగువన పడిపోయాడు. గతేడాది జనవరి నుంచి 900 పైబడిన రేటింగ్‌ పాయింట్లతో ఉన్న కోహ్లి ఖాతాలో ఇప్పుడు 899 పాయింట్లున్నాయి. టాప్‌ ర్యాంకులో ఉన్న స్టీవ్‌ స్మిత్‌ (937, ఆస్ట్రేలియా) కంటే 38 పాయింట్లు తక్కువ ఉన్నాయి. టెస్టు బౌలర్ల జాబితాలో మళ్లీ భారత స్పిన్నర్‌ అశ్విన్‌ టాప్‌–10లోకి చేరాడు. తొలి టెస్టులో 8 వికెట్లు తీయడం ద్వారా 4 స్థానాల్ని మెరుగుపర్చుకొని పదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఐసీసీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భాగమైన ఈ సిరీస్‌లో భారత్‌  తొలి టెస్టు విజయంతో 40 పాయింట్లను ఖాతాలో వేసుకొని మొత్తం 160 పాయింట్లతో ఉంది. విండీస్‌పై 2–0తో గెలవడం ద్వారా 120 పాయింట్లను పొందింది.

అమ్మాయిల జట్టు పటిష్టంగా...
ఐసీసీ మహిళల జట్ల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు నిలకడగా రెండో స్థానంలో ఉన్నప్పటికీ... పాయింట్ల పరంగా పటిష్టమైంది. 122 పాయింట్లతో ఇంగ్లండ్‌ మూడో స్థానంలో ఉండగా... 125 పాయింట్లతో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఆసీస్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. టి20ల్లో కూడా కంగారూ జట్టుదే టాప్‌ ర్యాంకు కాగా... భారత్‌ ఐదో స్థానంలో ఉంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top