ఎవరికీ పట్టని ఓ ఒలింపియన్

ఎవరికీ పట్టని ఓ ఒలింపియన్


ఓ చిన్న టోర్నీ గెలవగానే అర్జున అవార్డులు వచ్చేస్తున్నాయి... ఊరూపేరూ లేని చోటకు వెళ్లి గుర్తింపు లేని ఆటల్లో పతకాలు గెలిచిన వాళ్లకు కూడా ప్రభుత్వాలు లక్షల రూపాయలు ఇస్తున్నాయి... భారత క్రీడారంగం వెలిగిపోతోంది. ప్రభుత్వాలు క్రీడలకు పెద్ద పీట వేస్తున్నాయి.

... ఇదంతా నాణేనికి ఒకవైపు.


 

ఎలాంటి కోచ్‌లు, సదుపాయాలు లేకుండా స్వయంకృషితో ఎదిగి భారత్ తరఫున 1956లోనే ఒలింపిక్స్‌కు వెళ్లిన దిగ్గజం షంషేర్ ఖాన్. గుంటూరు జిల్లాలోని కై తేపల్లి అనే చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన షంషేర్... మెల్‌బోర్న్ ఒలింపిక్స్ క్రీడల్లో స్విమ్మింగ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆయన తర్వాత మళ్లీ 1996 వరకు భారత్ నుంచి ఎవరికీ  ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో అర్హత కూడా లభించలేదు. అలాంటి దిగ్గజం 86 ఏళ్ల వయసులో ఎలాంటి గుర్తింపూ లేకుండా నివసిస్తున్నారు. మన ఒలింపియన్‌ను కనీసం గౌరవించుకోలేకపోవడం తెలుగు జాతి దురదృష్టం.

... ఇది నాణేనికి రెండోవైపు.


 

భారత్ తరఫున స్విమ్మింగ్‌లో ఒలింపిక్స్‌కు వెళ్లిన తొలి భారతీయుడు షంషేర్ ఖాన్

గుంటూరు జిల్లాలోని ఓ పల్లెటూరు నుంచి ఎదిగిన వైనం

ఎలాంటి గుర్తింపునకూ నోచుకోని స్థితిలో ఒలింపియన్


 

విదేశీ కోచ్‌లు, ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం కోసం కోట్లాది రూపాయల ప్రభుత్వ సహాయం... అద్భుతమైన మౌలిక సదుపాయాలు... ఇవన్నీ ఉన్నా ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం కోసం అష్టకష్టాలు పడుతున్న అథ్లెట్లను చూస్తున్నాం. కానీ ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం ఎలాంటి సౌకర్యాలు లేని స్థితిలో కూడా ఒలింపిక్స్‌కు వెళ్లారు షంషేర్ ఖాన్. కానీ ఇప్పటివరకూ ఎలాంటి అవార్డులు గానీ, రివార్డులు గానీ లభించలేదు. అదే 1956 ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో పాల్గొన్న కామినేని ఈశ్వర్‌రావుకు అర్జున అవార్డు ఇచ్చిన ప్రభుత్వం షంషేర్‌ను గుర్తించకపోవడం దురదృష్టం.

 

గేదెలు ఈత నేర్పాయి


గుంటూరు జిల్లా రేపల్లెకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైతేపల్లి అనే గ్రామంలో 1930 ఆగస్టు 2న షంషేర్ జన్మించారు. చదువుకుంటామంటే తల్లిదండ్రులు తిట్టే రోజులు అవి. వ్యవసాయం చేస్తానంటే వెన్నుతట్టే పరిస్థితులు. గ్రామంలోని అనేక మంది పిల్లల్లాగే షంషేర్ కూడా గేదెలు తోలుకుని కృష్ణానదికి వెళ్లేవాడు. గేదె తోక పట్టుకుని ఈత నేర్చుకున్నాడు. ‘మా రోజుల్లో కోచ్‌లు, స్విమ్ సూట్‌లు, కళ్లకు గాగుల్స్ ఉండేవి కావు. మా గేదెలే నాకు ఈత నేర్పాయి. అవే నా కోచ్‌లు’ అని షంషేర్ నవ్వుతూ చెప్పారు.ఉర్దూ స్కూల్‌లో మూడో తరగతి వరకూ చదువుకోవడం, బలంగా ఉండటం వల్ల ఆర్మీలోకి వెళ్లాలనే ఆలోచన కలిగింది. అప్పట్లో ఆర్మీ సెలక్షన్స్ వింతగా ఉండేవట. ఆఫీసర్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వాలి. ఆ చేతిలో పట్టు ఉందని ఆఫీసర్‌కు అనిపిస్తే ఆర్మీలోకి తీసుకుంటారు. అలా 16 ఏళ్ల వయసులో 1946 ఆర్మీలో చేరాడు. బెంగళూరులోని సదరన్ కమాండ్‌లో ఉద్యోగం. అక్కడ స్విమ్మింగ్‌పూల్ ఉంది. స్వతహాగా నదిలో ఈత నేర్చుకోవడం వల్ల అది తెలిసినా... టెక్నిక్స్ తెలియవు. కొంతకాలం అక్కడి వ్యక్తులను పరిశీలించాక, స్విమ్మింగ్ పూల్‌లో దిగాడు. ఆర్మీలో ఎలాంటి పోటీలు పెట్టినా కనీస పోటీ కూడా లేకుండా షంషేర్ ఖాన్‌కే అగ్రస్థానం.

 

అక్కడా వివక్ష...


ఆర్మీలో మిగిలిన వారికి కోచింగ్ ఇచ్చే స్థాయికి షంషేర్ ఎదిగాడు. వరుసగా 27 ఈవెంట్స్‌లో ఫస్ట్. అంతే మిగిలిన వారిలో అసూయ మొదలైంది. కేరళ, తమిళనాడు వాళ్లను ఈవెంట్లకు పంపిస్తూ షంషేర్‌ను తొక్కేశారు. ఇంగ్లిష్ చానల్ ఈదుతానని, భారత్-శ్రీలంకల మధ్య సముద్రంలో ఈత కొడతానని దరఖాస్తు చేసుకున్నా అనుమతి రాలేదు. ఈ దశలో కొత్త కల్నల్‌గా గోమ్స్ అనే వ్యక్తి వచ్చారు. ఆయన షంషేర్‌లోని ప్రతిభను గుర్తించారు.1956లో బెంగళూరులో జరిగిన జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌కు పంపించారు. ఆ టోర్నీలో షంషేర్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచాడు. దీంతో మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌కు వెళ్లే అవకాశం లభించింది. 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్, 200 మీటర్ల బటర్‌ఫ్లై విభాగాల్లో పాల్గొన్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లడానికి భారత ప్రభుత్వం కేవలం ఫ్లయిట్ టిక్కెట్స్ మాత్రమే ఇచ్చింది. అక్కడి ఖర్చుల కోసం 300 రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటే... తర్వాత మూడు నెలలు జీతం ఇవ్వకుండా ఆ రూ. 300 కట్ చేసుకున్నారు.

 

ఇండో-పాక్ యుద్ధంలో...

ఒలింపిక్స్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఆర్మీలో రకరకాల విధుల కారణంగా స్విమ్మింగ్‌కు దూరం కావాల్సి వచ్చింది. 1962లో అస్సాంకు బదిలీ అయింది. అక్కడ చైనా బోర్డర్ వరకు రోడ్డు వేసే పనిలో పాల్గొన్నాడు. ఆ తర్వాత 1971లో పాకిస్తాన్‌తో యుద్ధంలో పాల్గొన్నాడు. జలంధర్ రెజిమెంట్‌లో పనిచేస్తూ శత్రువులు రాకుండా మైన్స్ పెట్టే పని చేశారు. 1973లో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు.ఎవరికీ తెలియదు...

రిటైర్ అయిన తర్వాత స్వగ్రామం కైతేపల్లి వచ్చేశారు. సాధారణంగా ఆర్మీలో పనిచేసి రిటైర్ అయితే భూమి ఇస్తారు. కానీ షంషేర్‌కు ఇవ్వలేదు. కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. అప్పట్లో 111 రూపాయలు పెన్షన్ వచ్చేది. షంషేర్‌కు ఐదుగురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. పెద్దబ్బాయి ఆర్మీలోనే పని చేస్తున్నాడు. రెండో అబ్బాయి అదే ఊరులో మసీదులో ఇమాం. ప్రస్తుతం షంషేర్ వయసు 86 సంవత్సరాలు. సరిగా వినిపించదు. మూడుసార్లు హార్ట్ అటాక్ వచ్చినా ప్రాణాపాయం తప్పింది. ఆర్మీలో పని చేసినందువల్ల పెన్షన్ వస్తుంది కాబట్టి ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ తన ఘనతను ఎవరూ గుర్తించలేదనే వేదన ఆ పెద్దాయనని కుంగదీసింది. ఆట పరంగా ఎలాంటి అవార్డులు, రివార్డులూ రాలేదు.

 

ఒలింపిక్స్‌కు భారత్ నుంచి భారీగా బృందం వెళుతోందని సంబరపడుతున్నాం. కనీసం ప్రపంచంలో ఆటల పండగ జరుగుతున్న సందర్భంలో అయినా ప్రభుత్వా లు ఇలాంటి పాతతరం యోధులను గుర్తించి సన్మానిస్తే చాలు... ఆ గుర్తింపే వాళ్లను మరింత కాలం బతికిస్తుంది.

- ఆలూరి రాజ్‌కుమార్ (సాక్షి, విజయవాడ స్పోర్ట్స్)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top