ఈ లెడెకీ లేడీ ఫెల్ప్స్‌..! | An abundance of self-confidence in ledeki | Sakshi
Sakshi News home page

ఈ లెడెకీ లేడీ ఫెల్ప్స్‌..!

Aug 10 2016 1:13 AM | Updated on Sep 4 2017 8:34 AM

ఈ లెడెకీ  లేడీ  ఫెల్ప్స్‌..!

ఈ లెడెకీ లేడీ ఫెల్ప్స్‌..!

ఆ అమ్మాయి వయసు 19 ఏళ్లు మాత్రమే... కానీ ఇప్పటికే తొమ్మిది సార్లు ప్రపంచ చాంపియన్... వరుసగా ఒలింపిక్స్‌లో రెండుసార్లు స్వర్ణాలు..

రికార్డు సృష్టించటం, బద్దలు కొట్టడం హాబీ
కొలనులో, చారిటీలో అన్నింటా ముందు

19 ఏళ్ల అమెరికా స్విమ్మర్ లెడెకీ

 

ఆ అమ్మాయి వయసు 19 ఏళ్లు మాత్రమే... కానీ ఇప్పటికే తొమ్మిది సార్లు ప్రపంచ చాంపియన్... వరుసగా ఒలింపిక్స్‌లో రెండుసార్లు స్వర్ణాలు... ఇప్పటికే 12 సార్లు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది. అమెరికా దిగ్గజ స్విమ్మర్ ఫెల్ప్స్‌కు లేడీ క్లోనింగ్‌లా తన సంచలన ప్రదర్శనతో ఇప్పటికే ప్రపంచాన్ని ఆకర్షించింది. పిట్ట కొంచెం...  కూత ఘనంలా సాగుతోంది కేటీ లెడెకీ ప్రస్థానం.

 

సాక్షి క్రీడావిభాగం రియో ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీ లెడెకీ యమా ఫాస్ట్. కొలనులో దిగితే ఈమెను అందుకోవటం కష్టమే. లండన్ ఒలింపిక్స్ (2012)లో పాల్గొనేటప్పటికి ఈమె వయసు కేవలం 15 ఏళ్లే. అయినా ఎవ్వరూ ఊహించని రీతిలో 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో స్వర్ణపతకం గెలుచుకుంది. అదీ అప్పటివరకున్న రెండో అత్యుత్తమ టైమింగ్‌తో. మహామహులైన స్విమ్మర్లను సైతం ముక్కున వేలేసుకునేలా చేసిందీ ఫిమేల్ ఫెల్ప్స్. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 1997లో పుట్టిన లెడెకీ ఆరెళ్లప్పటినుంచే కొలనులో విన్యాసాలు మొదలుపెట్టింది. ఈమె తల్లి కూడా న్యూమెక్సికో వర్సిటీ తరపున పలు ఆక్వాటిక్ ఈవెంట్లలో పాల్గొంది. స్కూలు స్విమ్మింగ్ కెరీర్లోనే లెడెకీ రెండు అమెరికా జాతీయ రికార్డులు నెలకొల్పింది.


‘రికార్డు’లతోనే పోటీ
లండన్ ఒలింపిక్స్‌తోనే లెడెకీ సత్తా ప్రపంచానికి పరిచయం అయింది. ఆ తర్వాత జరిగిన పలు అంతర్జాతీయ ఈవెంట్లు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో ఈమె జోరును ఎవరూ అడ్డుకోలేకపోయారు. లండన్‌కు రియోకు మధ్య జరిగిన అంతర్జాతీయ అక్వాటిక్ పోటీల్లో 16 బంగారు పతకాలు, ఒక రజత పతకం గెలుచుకుంది. అదీ సాదాసీదాగా కాదు. 12 సార్లు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టి.. వాటిని తనపేర రాసుకుంది. 2013 నుంచి వరుసగా మూడేళ్లు ప్రపంచ మహిళా స్విమ్మర్, అమెరికన్ స్విమ్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు ఈ లడకీవే. 2014లో అంతర్జాతీయ మహిళా ‘చాంపియన్ ఆఫ్ చాంపియన్స్’ అవార్డు అందుకుంది. 400 మీటర్లు, 800 మీటర్లు, 1,500 మీటర్ల ఫ్రీస్టయిల్లో ప్రస్తుత ప్రపంచ రికార్డు ఈమెపేరుపైనే ఉంది. 500, 1000, 1650 గజాల ఫ్రీస్టయిల్లోనూ ఫాస్టెస్ట్ టైమ్ రికార్డు ఈమెదే. తాజా రియో ఒలింపిక్స్‌లో 4ఁ100మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో.. అమెరికా బృందంలో భాగంగా రజతం గెలిచింది. 400 మీటర్ల వ్యక్తిగత ఫ్రీస్టయిల్ విభాగంలో హీట్స్‌లో 3.58.71 టైమింగ్‌తో ఒలింపిక్స్ రికార్డు నమోదు చేసింది. ఫైనల్లో హీట్స్ కంటే రెండు సెకన్ల ముందే రేసు పూర్తి చేసి స్వర్ణం సాధించడంతో పాటు తన రికార్డును తనే బద్దలు కొట్టుకుంది. ‘లెడెకీ పోటీపడేది తోటి స్విమ్మర్లతోకాదు.. రికార్డులతో’ అని ఈమె గురించి తెలిసినవారంటారు.

 

రికార్డులు+ఆత్మవిశ్వాసం+చారిటీ
రేసుకు ముందు.. రేసు పూర్తయిన తర్వాత ఎప్పుడు చూసినా లెడెకీలో ఆత్మవిశ్వాసం మెండుగా కనబడుతుంది. ‘నేను గెలుస్తానని నాకు తెలుసు. ఆ ఆత్మవిశ్వాసమే నా బలం’ అని చాలా సందర్భాల్లో లెడెకీ బహిరంగంగానే వ్యాఖ్యానించింది. కొలనులో రికార్డులే కాదు మంచి మనసుతోనూ ఈ అమ్మాయి అమెరికన్ల మనసు గెలుచుకుంది. స్విమ్మింగ్‌లో తనకున్న క్రేజ్‌ని, సంపాదించిన దాంట్లో సింహభాగాన్ని వివిధ చారిటీ కార్యక్రమాలకు వినియోగిస్తూ ‘లెడెకీ ద గ్రేట్’ అనిపించుకుంటోంది. కేథలిక్ చారిటీస్, షెపర్డ్స్ టేబుల్, వూండెడ్ వారియర్స్ వంటి సంస్థల భాగస్వామ్యంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. చిన్న వయసులోనే రికార్డులు, మెడళ్లతోపాటు సేవా కార్యక్రమాలతో నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్న లెడెకీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement