రెండో రోజు బౌలర్ల హవా

Ranji Trophy: Hyderabad VS Rajasthan Match 2 day Highlights - Sakshi

ఒకే రోజు 16 వికెట్లు పతనం

రాజస్తాన్‌ 135 ఆలౌట్‌

రవి కిరణ్‌కు నాలుగు వికెట్లు

రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ 101/6

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్, రాజస్తాన్‌ మధ్య జరుగుతోన్న రంజీ క్రికెట్‌ మ్యాచ్‌లో రెండో రోజు బౌలర్ల హవా నడిచింది. రోజంతా ఆధిపత్యం ప్రదర్శించిన ఇరు జట్ల బౌలర్లు ఒకే రోజు 16 వికెట్లను నేలకూల్చారు. తొలుత హైదరాబాద్‌ బౌలర్‌ రవి కిరణ్‌ (4/46) హడలెత్తించడంతో... రాజస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా హైదరాబాద్‌కు 36 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. రవి కిరణ్‌కు సీవీ మిలింద్‌ (2/36), సాకేత్‌ సాయిరామ్‌ (2/9) సహకారం అందించారు.

హైదరాబాద్‌ బౌలర్లు ఒక్క అదనపు పరుగు కూడా ప్రత్యర్థికి ఇవ్వకపోవడం విశేషం. రాజస్తాన్‌ సారథి అశోక్‌ మెనారియా (88 బంతుల్లో 42, 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ మంగళవారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 35.3 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 101 పరుగులు చేసింది. ప్రస్తుతం అక్షత్‌ రెడ్డి (105 బంతుల్లో 43; 4 ఫోర్లు, సిక్స్‌) క్రీజులో ఉన్నాడు. 

రవి కిరణ్‌ అదరహో 
ఓవర్‌నైట్‌ స్కోరు 2/0తో ఆట కొనసాగించిన రాజస్తాన్‌ను రవి కిరణ్‌ తొలి దెబ్బ తీశాడు. రెండో రోజు తాను వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికే వికెట్‌ రాబట్టాడు. ఓపెనర్‌ కొఠారి (6; ఫోరు) వికెట్‌ కీపర్‌ కొల్లా సుమంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తన తర్వాతి ఓవర్‌లో మరో ఓపెనర్‌ మణీందర్‌ సింగ్‌ (9; 2 ఫోర్లు), మరో రెండు ఓవర్ల అనంతరం రాజేశ్‌ బిష్ణోయ్‌ (14; 2 ఫోర్లు, సిక్స్‌)లను అవుట్‌ చేసిన రవి కిరణ్‌ హైదరాబాద్‌కు అదిరే బ్రేక్‌ ఇచ్చాడు. ఇతడికి సాకేత్, సీవీ మిలింద్‌ల నుంచి కూడా సహకారం లభించడంతో రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు. ఒంటరి పోరాటం చేసిన అశోక్‌ మెనారియాను సాకేత్‌ పెవిలియన్‌కు చేర్చాడు. 

ఆనందం కాసేపే... 
బౌలర్ల అద్భుత ప్రదర్శనతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించిందనే ఆనందం హైదరాబాద్‌కు ఎంతో సేపు నిలబడలేదు. రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ ఒకరివెంట మరొకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. సారథి తన్మయ్‌ అగర్వాల్‌ (16; 2 ఫోర్లు), సందీప్‌ (9), హిమాలయ్‌ అగర్వాల్‌ (2), జావీద్‌ అలీ (0), కొల్లా సుమంత్‌ (3) ఇలా వచ్చి అలా వెళ్లారు. దాంతో హైదరాబాద్‌ 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో అక్షత్‌ రెడ్డి, రవితేజ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆరో వికెట్‌కు 33 పరుగులు జోడించారు. అయితే మరికొద్ది సేపట్లో ఆట ముగుస్తుందనగా బౌలింగ్‌కు వచ్చిన అనికేత్‌ చౌదరి చక్కటి డెలివరీతో రవితేజను అవుట్‌ చేశాడు. ఆ వెంటనే మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేశారు. అనికేత్‌ 3 వికెట్లు తీయగా... తన్వీర్‌ ఉల్‌ హక్‌ 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌ 137 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

స్కోరు వివరాలు 
హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌: 171 ఆలౌట్‌
రాజస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 135 ఆలౌట్‌
హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌: తన్మయ్‌ (సి) రితురాజ్‌ సింగ్‌ (బి) తన్వీర్‌ 16; అక్షత్‌ రెడ్డి (బ్యాటింగ్‌) 43; సందీప్‌ (బి) తన్వీర్‌ 9; హిమాలయ్‌ (సి) రితురాజ్‌ (బి) అనికేత్‌ చౌదరి 2; జావీద్‌ అలీ (సి) మణీందర్‌ సింగ్‌ (బి) అనికేత్‌ చౌదరి 0; కొల్లా సుమంత్‌ (సి) ఆదిత్య (బి) శుభమ్‌ శర్మ 3; రవితేజ (సి) యశ్‌ కొఠారి (బి) అనికేత్‌ చౌదరి 20; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (35.3 ఓవర్లలో 6 వికెట్లకు) 101. 
వికెట్ల పతనం: 1–28, 2–46, 3–53, 4–53, 5–68, 6–101. బౌలింగ్‌: అనికేత్‌ 11.3–3–26–3, తన్వీర్‌ 10–2–27–2, రితురాజ్‌ 11–3–21–0, శుభమ్‌ శర్మ 2–0–15–1, మహిపాల్‌ లామ్రోర్‌ 1–0–8–0.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top