సింధును ఆపతరమా!

PV Sindhu Tops Group A, Kidambi Srikanth Loses Third Straight Game - Sakshi

వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఘనవిజయం

చిత్తుగా ఓడిన యామగుచి

నేటి సెమీస్‌లో చెన్‌ యుఫెతో ‘ఢీ’ 

శ్రీకాంత్‌కు ‘హ్యాట్రిక్‌’ ఓటమి

వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌

తొలి మ్యాచ్‌లో మూడు గేమ్‌ల పాటు పోరాడాల్సి వచ్చింది... రెండో మ్యాచ్‌లో రెండు గేమ్‌లలోనే సునాయాస విజయం... ఇక దీంతో పోలిస్తే మూడో మ్యాచ్‌లో అయితే ప్రత్యర్థికి మరో మూడు పాయింట్లు తక్కువగానే ఇచ్చి మ్యాచ్‌కు ముగింపు... బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్లో రోజురోజుకూ సింధు ప్రదర్శిస్తున్న ఆట ఇది. ఈ టోర్నీలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మన సింధు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తన గ్రూప్‌లో దర్జాగా అగ్రస్థానాన్ని అందుకోగా... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ పరాజయం పరిపూర్ణమైంది.   

దుబాయ్‌ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి :
ఈ ఏడాదికి అద్భుతమైన ముగింపు ఇవ్వాలని పట్టుదలగా ఉన్న తెలుగుతేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు మరోసారి తన సత్తాను చాటింది. ఇప్పటికే సెమీస్‌ చేరి ప్రాధాన్యత లేని మ్యాచ్‌ అయినా సరే... తన దూకుడు ఏమాత్రం తగ్గదని నిరూపించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ ‘ఎ’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో సింధు 21–9, 21–13 స్కోరుతో అకానె యామగుచి (జపాన్‌)ను చిత్తుగా ఓడించింది. ఫలితంగా తన గ్రూప్‌లో అందరినీ ఓడించి మూడు విజయాలతో టాపర్‌గా నిలిచింది. ఈ లీగ్‌ మ్యాచ్‌ కేవలం 36 నిమిషాల్లోనే ముగిసింది.  

టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన మరో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్‌ చివరి మ్యాచ్‌లో కూడా ఓటమి పాలయ్యాడు. ఈ ఏడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ సాధించిన శ్రీకాంత్‌ ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. షి యుకి (చైనా)తో జరిగిన పోరులో శ్రీకాంత్‌ 17–21, 21–19, 14–21 తేడాతో ఓటమి చవిచూశాడు. రెండో గేమ్‌ గెలుచుకొని కోలుకునే ప్రయత్నం చేసినా చివరకు శ్రీకాంత్‌కు ఫలితం దక్కలేదు.  

అతి అలవోకగా... 
యామగుచితో జరిగిన మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో ప్రత్యర్థిపై చెలరేగింది. సింధు చక్కటి ఆటకుతోడు యామగుచి వరుస పొరపాట్లు ఈ గేమ్‌ను ఏకపక్షంగా మార్చేశాయి. వరుస పాయింట్లతో ముందుగా సింధు 5–0తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. యామగుచి కొట్టిన షాట్‌ను సింధు రిటర్న్‌ చేయలేకపోవడంతో ప్రత్యర్థి ఖాతా తెరిచింది. ఆ తర్వాత మళ్లీ అవకాశం ఇవ్వకుండా వరుసగా 6 పాయింట్లు సాధించి 11–1తో ఎదురు లేకుండా సాగింది. ఆ తర్వాత యామగూచి కోలుకునే ప్రయత్నం చేసినా సింధు జోరు తగ్గించకుండా ఆడి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో మాత్రం సింధుకు కొంత పోటీ ఎదురైంది. ఆరంభంలో ఇద్దరూ చకచకా పాయింట్లు సాధించడంతో స్కోరు 4–4తో సమమైంది. ఈ సమయంలో చక్కటి డ్రాప్‌ షాట్‌తో పాయింట్‌ సాధించి ముందంజ వేసిన సింధు వెనుదిరిగి చూడలేదు. స్కోరు 9–8 వద్ద ఉన్నప్పుడు గేమ్‌ హోరాహోరీగా సాగుతున్నట్లు అనిపించింది. కానీ ఈ సమయంలో ఒక్కసారిగా చెలరేగిన సింధు వరుసగా నాలుగు పాయింట్లు సాధించింది. ఆ తర్వాత ఆమెను అందుకోవడం యామగుచి వల్ల కాలేదు. చక్కటి స్మాష్‌లు, డ్రాప్‌లతో వేగంగా పాయింట్లు సాధించిన సింధు చివరకు నెట్‌పై నుంచి స్లో స్మాష్‌తో ఆటను ముగించి లీగ్‌ దశలో అజేయంగా నిలిచింది.

ఈ విజయం చాలా సంతృప్తినిచ్చింది. గురువారమే నేను సెమీస్‌కు అర్హత సాధించినా ఆఖరి మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకోలేదు. కచ్చితంగా గెలవాలని అనుకున్నాను. అటాకింగ్‌ మాత్రమే అని కాకుండా అన్ని రకాల షాట్లతో సిద్ధమయ్యాను. ఆమె డిఫెన్స్‌ చాలా బాగుంది. నేను అటాక్‌ చేసే అవకాశం ఇవ్వకుండా ఎక్కువగా ర్యాలీలు ఆడించే ప్రయత్నం చేసింది. అందుకే ర్యాలీలతోనే సమాధానమిచ్చాను. మ్యాచ్‌ మ్యాచ్‌కు నా ఆట మెరుగైందనేది వాస్తవం. నిజానికి తొలి మ్యాచ్‌లో విజయంతో నా ఆత్మవిశ్వాసం చాలా పెరిగింది. చెన్‌ యుఫెతో నేడు జరిగే సెమీఫైనల్లో కూడా ఇదే తరహాలో ఆడగలనని నమ్ముతున్నా. 
–‘సాక్షి’తో పీవీ సింధు

►నేటి సెమీస్‌  సా.గం. 5:30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్షప్రసారం 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top