సీరియస్‌ మ్యాచ్‌...సిల్లీ రనౌట్‌!

Pandya runs himself out in second test against south africa - Sakshi

సెంచూరియన్‌: ఏ క్రికెట్‌ మ్యాచ్‌ ఫలితంలోనైనా రనౌట్లు కీలక పాత్ర పోషిస్తాయనేది వాస్తవం. అయితే నామ మాత్రపు మ్యాచ్‌లో రనౌట్లు గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే ఒక సీరియస్‌ మ్యాచ్‌లో సిల్లీగా రనౌటైతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ టీమిండియాకు చాలా ముఖ్యమైనది. ఈ మ్యాచ్‌ గెలిస్తేనే సిరీస్‌ను సాధించే అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి తరుణంలో ఎవరైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాల్సి ఉంది. తాజాగా భారత ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చాలా సిల్లీగా రనౌటై విమర్శకుల నోటికి పని చెప్పాడు.

వివరాల్లోకి వెళితే.. భారత ఇన్నింగ్స్‌లో భాగంగా రబడా వేసిన 68 ఓవర్‌ తొలి బంతిని పాండ్యా మిడాన్‌ వైపు ఆడి సింగిల్‌ కోసం యత్నించాడు. అయితే అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్నఫిలిండర్‌ బంతిని ఆపిన మరుక్షణమే స్టైకింగ్‌ ఎండ్‌ వైపు నేరుగా విసిరి వికెట్లను గిరటేశాడు. కాగా, అప్పటికే సింగిల్‌ కోసం యత్నించి వెనుదిరిగిన పాండ్యా క్రీజ్‌లో చేరే క్రమంలోఅత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అటు బ్యాట్‌ను కానీ, కాలును కానీ క్రీజ్‌లో ఉంచలేదు. ఆ బంతి వికెట్లను తాకే సమయానికి పాండ్యా బ్యాట్ క్రీజ్‌ లోపల ఉన్నప్పటికీ అది గాల్లో ఉంది. దాంతో థర్డ్‌ అంపైర్‌ నిర్ణయానికి వెళ్లడం, పాండ్యా అవుట్‌ కావడం చకచకా జరిగిపోయాయి.

అంతకుముందు ఇదే తొలి ఇన్నింగ్స్‌ రెండో రోజు ఆటలో చతేశ్వర పుజారా కూడా రనౌట్‌గా పెవిలియన్‌ చేరిన సంగతి తెలిసిందే. తను ఆడిన తొలి బంతికే పరుగు కోసం యత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. భారత జట్టు అనవసరంగా రెండు రనౌట్లు కావడంతో భారీ స్కోరుకు బాటలు వేసుకోవడం క్లిష్టంగా మారింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి సెంచరీ సాధించాడు. సోమవారం 85 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ కొనసాగించిన కోహ్లి..146 బంతుల్లో శతకాన్ని  పూర్తి చేసుకున్నాడు. ఇది విరాట్‌ టెస్టు కెరీర్‌లో 21వ సెంచరీ.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top