మిథాలీ రాజ్‌ ఎందుకిలా? | Sakshi
Sakshi News home page

మిథాలీ రాజ్‌ ఎందుకిలా?

Published Tue, Sep 3 2019 2:41 PM

Mithali Raj announces retirement from T20 Internationals - Sakshi

న్యూఢిల్లీ:  సరిగ్గా వారం రోజుల క్రితం దక్షిణాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించిన భారత మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌.. తాజాగా తాను టీ20 ఫార్మాట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్లు ప్రకటించారు.  దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత్‌ జట్టును ప్రకటించడానికి ముందుగానే మిథాలీ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భారత్‌ తరఫున 89 టీ20 మ్యాచ్‌లు ఆడిన మిథాలీ వాటిలో 32 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇక మూడు టీ20 వరల్డ్‌కప్‌లు ఉండటం విశేషం.

2012 వరల్డ్‌కప్‌తో పాటు, 2014 వరల్డ్‌కప్‌, 2016 వరల్డ్‌కప్‌లకు ఆమె సారథిగా చేశారు. ఈ ఏడాది మార్చిలో  ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచే మిథాలీకి చివరిది. ఆ మ్యాచ్‌లో మిథాలీ రాజ్‌ 32 బంతుల్లో అజేయంగా 30 పరుగులు చేశారు. మొత్తంగా టీ20ల్లో మిథాలీ రాజ్‌ 2,364 పరుగులు చేశారు. ఇందులో 17 హాఫ్‌ సెంచరీలున్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో ఆమె అత్యుత్తమ స్కోరు 97 నాటౌట్‌.

తన రిటైర్మెంట్‌పై మిథాలీ మాట్లాడుతూ.. ‘ 2006 నుంచి భారత్‌ తరఫున టీ20లు ఆడుతున్నా. టీ20లతో పనిభారం ఎక్కువగా ఉండటంతో రిటైర్మెంట్‌ తీసుకోవాలను కుంటున్నా. 2021 వన్డే వరల్డ్‌కప్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడంపైనే  దృష్టి సారించా. భారత్‌కు వరల్డ్‌కప్‌ను అందించడమే నా కల. ఇందుకోసం నా శాయశక్తులా కష్టపడతా. టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్న భారత్‌ జట్టుకు ఇవే నా విషెస్‌’ అని మిథాలీ పేర్కొన్నారు.

మిథాలీ ఎందుకిలా?
వారం రోజుల క్రితం తాను దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించారు మిథాలీ.  ‘నాకు టీ20 వరల్డ్‌కప్ గురించి ఆలోచించడం లేదు. వరుసగా సిరీస్‌లు ఆడటమే నా ముందున్న లక్ష్యం. అది టీ20 సిరీస్‌ అయినా, వన్డే సిరీస్‌ అయినా నాకు తేడా లేదు’ అని మిథాలీ పేర్కొన్నారు.  మరి ఇంతలోనే మిథాలీ టీ20లకు గుడ్‌ బై చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. అయితే యువ క్రీడాకారిణులకు పెద్ద పీట వేయాలనే ఆలోచనలో ఉన్న మహిళా టీమ్‌ మేనేజ్‌మెంట్‌.. సఫారీలతో సిరీస్‌కు మిథాలీని ఎంపిక చేసేందుకు సుముఖంగా లేకపోవడమే  కారణం కావొచ్చు. దాంతోనే మిథాలీ అలిగి ఉన్నపళంగా రిటైర్మెంట్‌ ప్రకటించి ఉండవచ్చనేది సగటు క్రీడాభిమాని అభిప్రాయం.

Advertisement
Advertisement