
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని ముందుగానే ప్రకటించిన వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ దాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడమే కాదు.. టీ20లు ఆడకుండా టెస్టులు ఆడతానని కూడా షాకిచ్చాడు. అయితే టెస్టు క్రికెట్‌కు అంతగా సెట్ కాని గేల్ నిర్ణయంపై వెస్టిండీస్ మాజీల నోటికి పని పెట్టింది. క్రికెట్‌కు రిటైర్మెంట్ చెప్పకుండా ఇలా చెప్పడం ఏమిటని కొంతమంది తలలు పట్టుకున్నారు. ఇదిలా ఉంచితే, గేల్ 40 వసంతాలను పూర్తి చేసుకున్నాడు.
ఈరోజు(సెప్టెంబర్ 21) గేల్ పుట్టినరోజు జరుపుకుంటున్న గేల్‌కు ఐపీఎల్‌లో సహచర ఆటగాడైన కేఎల్ రాహుల్ శుభాకాంక్షలు తెలియజేశాడు. గేల్‌కు నలభై సంవత్సరాలు నిండిపోయిన విషయాన్ని రాహుల్ సరదాగా ప్రస్తావిస్తూ..‘ సిగ్గు పడకు బాస్.. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి’ అంటూ ట్వీట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక గేల్‌కు చహల్ అభినందనలు తెలియజేస్తూ ‘ హ్యాపీ బర్త్ డే అంకుల్’ అని పేర్కొన్నాడు. ‘ క్రికెట్ లెజెండ్.. ఎంటర్‌టైనర్‌కు ఇవే నా శుభాకాంక్షలు’ అని కృనాల్ ట్వీట్ చేయగా, ‘ హ్యాపీ బర్త్‌డే యూనివర్స్ బాస్’ అని శ్రేయస్ అయ్యర్ అభినందించాడు.