నష్ట నివారణలో సీఏ.. కొత్త కోచ్‌ ఆయనే!

Justin Langer New Head Coach for Australia - Sakshi

సిడ్నీ: బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం నుంచి ఆస్ట్రేలియా జట్టును బయటపడేసేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో జట్టుకు కొత్త కోచ్‌గా జస్టిన్‌ లాంగర్‌ను నియమించింది. ఈ 47 ఏళ్ల ఈ మాజీ ఆటగాడు నాలుగేళ్ల పాటు మూడు ఫార్మట్లలో ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నాలుగెళ్లలో ఆసీస్‌ ప్రధానంగా ప్రతిష్టాత్మకమైన రెండు యాషెస్‌ సిరీస్‌లు, 2019 ప్రపంచకప్‌, టీ20 ప్రపంచకప్‌లు ఆడనుంది.

ఆసీస్‌ ప్రధానకోచ్‌గా తనను ఎంపిక చేయడం పట్ల జస్టిన్‌ లాంగర్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా జట్టు నుంచి అభిమానులు ఎంతో కొంత ఆశిస్తుంటారు. ఇక నుంచి ఆటగాళ్లు అప్రమత్తంగా ఉంటారని, మైదానంలో మర్యాదగా ప్రవర్తిస్తారని అనుకుంటున్నా. ఆటలో ప్రత్యర్థులు ఒకరినొకరు గౌరవించుకోవటం మంచి సంప్రదాయం. నా దృష్టిలో ప్రపంచంలో గౌరవాన్ని మించింది ఏది లేదు. నిషేధం ముగిశాక ముగ్గురు ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రావటాన్ని తాను స్వాగతిస్తాను’ అని లాంగర్‌ మీడియా సమావేశంలో తెలిపారు.

బాల్‌ ట్యాంపరింగ్‌ నేపథ్యంలో ఆటగాళ్లు స్టీవ్ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, కామెరూన్‌ బెన్‌క్రాఫ్ట్‌లపై వేటు పడగా.. ఒత్తిళ్ల నేపథ్యంలో కోచ్‌ డారెన్‌ లెహ్‌మన్‌ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఆపై కొత్త కోచ్‌ కోసం పలువురి పేర్లను సీఏ ప్రతిపాదించగా.. రాజకీయాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారం సీఏకు తలనొప్పిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వివాదరహితుడిగా పేరున్న లాంగర్‌ను నియమించటమే మంచిదని సీఏ భావించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top