విలియమ్సన్‌ వచ్చేశాడు..

IPL 2019 Sunrisers Opt To Field Against Delhi And Williamson Return - Sakshi

మనీష్‌ పాండే, పఠాన్‌, కౌల్‌లకు నో ఛాన్స్‌

హైదరాబాద్‌: రెండు వరుస పరాజయాలతో డీలా పడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకుకు ఊరట కలిగించే వార్త. గాయం కారణంగా ఇప్పటికే పలు మ్యాచ్‌లకు దూరమైన రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. దీంతో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్‌లో భాగంగా స్థానిక రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ మైదానంలో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లు సన్‌రైజర్స్‌ పలు మార్పులు చేసింది. విలియమ్సన్‌ రావడంతో నబిని పక్కకు పెట్టింది. అంతేకాకుండా ఈ సీజన్‌లో పూర్తిగా విఫలమవుతున్న మనీష్‌ పాండే, యుసుఫ్‌ పఠాన్‌, సిద్దార్థ్‌ కౌల్‌లను పక్కను పెట్టి రికీ భుయ్‌, అభిషేక్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌లకు అవకాశం కల్పించింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. కోలిన్‌ మున్రో, అమిత్‌ మిశ్రాలు జట్టులో చోటు దక్కించుకున్నారు.   

వార్నర్, బెయిర్‌ స్టో పైనే ఆశలు...
మాజీ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గత రెండు మ్యాచ్‌ల్లో లయ తప్పింది. సొంతగడ్డపై ముంబై చేతిలో, మొహాలిలో పంజాబ్‌ చేతిలో ఓటమి పాలైంది. లీగ్‌లో రైజర్స్‌కు చివరి విజయం ఢిల్లీ క్యాపిటల్స్‌పైనే. ఇదే ఆత్మవిశ్వాసంతో సన్‌ నేడు మ్యాచ్‌కు సిద్ధమైంది. గత మ్యాచ్‌లో బౌలర్లు రాణించడంతో 129 పరుగులకే ఢిల్లీని కట్టడి చేసిన సన్‌ బృందం బ్యాటింగ్‌లోనూ రాణించి 5 వికెట్లతో గెలుపొందింది. తిరిగి అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని హైదరాబాద్‌ యోచిస్తోంది. కానీ మిడిలార్డర్‌ వైఫల్యంతో జట్టు కుదేలవుతోంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన వార్నర్‌–బెయిర్‌స్టో జంటపైనే హైదరాబాద్‌ బ్యాటింగ్‌ అతిగా ఆధారపడుతోంది. వీరిద్దరూ పెవిలియన్‌ చేరగానే ఇన్నింగ్స్‌ పేకమేడలా కుప్పకూలుతోంది. విజయ్‌ శంకర్‌ ఆరంభంలో టచ్‌లో ఉన్నట్లు కనిపించినా తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 

జోరు మీదున్న ఢిల్లీ...
లీగ్‌ ఆరంభంలో ఒకటి గెలిస్తే మరోటి ఓటమి అన్నట్లుగా సాగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పుడు అన్ని విభాగాల్లో కుదురుకుంది. బెంగళూరు, పటిష్ట కోల్‌కతా నైట్‌రైడర్స్‌లను వారి సొంతగడ్డలపై ఓడించి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. శిఖర్‌ ధావన్‌ కొత్త ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు. కోల్‌కతాపై సెంచరీ (63 బంతుల్లో 97 నాటౌట్‌)కి చేరువగా వచ్చి 7 వికెట్లతో తమ జట్టు గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ నాలుగో స్థానానికి ఎగబాకింది. రిషబ్‌ పంత్‌ కూడా తనదైన శైలిలో ఆడుతూ జట్టుకు ఉపయోగపడుతున్నాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్, పృథ్వీ షా కీలక ఇన్నింగ్స్‌తో త మ విలువను చాటుతున్నారు. కగిసో రబడ, క్రిస్‌ మోరిస్, ఇషాంత్‌ శర్మలతో బౌలింగ్‌ విభాగం కూ డా ప్రభావవంతంగా కనబడుతోంది. మరోసారి వీరంతా ఉమ్మడిగా రాణించి హైదరాబాద్‌పై పైచేయి సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు.  
 

తుది జట్లు: 
సన్‌రైజర్స్‌: కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టో, విజయ్‌ శంకర్‌, రికీ భుయ్‌, అభిషేక్‌ శర్మ, దీపక్‌ హుడా, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌

ఢిల్లీ: శ్రేయాస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, కోలిన్‌ మున్రో, రిషభ్‌ పంత్‌, క్రిస్‌ మోరిస్‌, అక్షర్‌ పటేల్‌, అమిత్‌ మిశ్రా, కీమో పాల్‌, కగిసో రబడ, ఇషాంత్‌ శర్మ

Liveblog - విలియమ్సన్‌ వచ్చేశాడు..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top